‘తెలంగాణ యోగి’కి అసలు సీన్ అర్థమయ్యిందా..?
తెలంగాణ ఎన్నికల్లో అందరి కంటే ఎక్కువగా నష్టపోయిన పార్టీ భారతీయ జనతా పార్టీ. గతంలో ఎన్నడూ లేనంతగా బీజేపీ ఈ ఎన్నికలపై ఆశలు పెట్టుకుంది. ఈసారి తెలంగాణలో ఓట్లు, సీట్లు పెంచుకుని బలోపేతమవుతామనుకుంది. మొదటిసారి అన్ని స్థానాలకూ పోటీచేసింది. ‘మార్పు కోసం బీజేపీ’ అంటే మంత్రాన్ని జపించింది. అనేక మంది స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దించింది. వేలాది మంది ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు నేలల తరబడి కష్టపడి అండర్ గ్రౌండ్ వర్క్ చేశారు. ఇక ఎన్నికలకు రెండు నెలల ముందు శ్రీపీఠం అధిపతి పరిపూర్ణాంద స్వామిని బీజేపీలో చేర్చుకున్నారు. అమిత్ షా ఆయనను సాధరంగా పార్టీలోకి ఆహ్వానించి కీలకమైన ప్రచార బాధ్యతలు అప్పగించారు. స్వామి పరిపూర్ణానంద స్టార్ క్యాంపెయినర్ గా తెలంగాణ ఎన్నికల్లో చాలా కష్టపడ్డారు. అయితే, ఆయన క్షేత్రస్థాయిలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను ఏమాత్రం అంచనా వేయనట్లున్నారు. ఒకదశలో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి తనకు రెండు నెలల సమయం చాలు అన్న కామెంట్ కూడా ఆయన చేశారు.
ఫలించని స్వామి మంత్రం...
ఓ దశలో తెలంగాణ ‘యోగి’ పరిపూర్ణాంద స్వామినే అన్న ప్రచారం కూడా సాగింది. ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి అని కూడా అన్నారు. దీంతో అందరి దృష్టి ఆయనపై పడింది. అయితే, ఎటువంటి హడావుడి లేకుండా ఢిల్లీలో పార్టీలో చేరి వచ్చిన ఆయన తనపై పెట్టిన బాధ్యతలను విజయంవంతంగా నిర్వర్తించేందుకు కష్టపడ్డారు. సుమారు 50కి పైగా సభల్లో పాల్గొని అన్ని జిల్లాల్లో ప్రచారం నిర్వహించారు. ప్రత్యేకించి ఆయనకు ప్రియ శిష్యుల్లాంటి రాజాసింగ్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బండి సంజయ్ ల గెలుపు కోసం ఆయన తీవ్రంగానే శ్రమించారు. కానీ, రాజాసింగ్ మినహా మిగతా ఇద్దరూ ఓడిపోయారు. రాష్ట్రవ్యాప్తంగానే బీజేపీ ఒక్క సీటు మాత్రమే గెలిచింది. దీంతో అనుకున్నది ఒక్కటి... అయినది ఒక్కటి .. అన్నట్లుగా ఉంది పరిపూర్ణానంద స్వామి పరిస్థితి. పార్టీని కచ్చితంగా 60 రోజుల్లో అధికారంలోకి తీసుకువస్తానని పరిపూర్ణానంద ధీమాగా చెబితే ఎవ్వరూ నమ్మలేదు... ఇప్పుడు ఫలితాలు వచ్చాక కూడా అదే జరిగింది.
రెండు నెలల్లో ఏదో చూస్తామంటే..?
బీజేపీ అభ్యర్థులు బలంగా ఉన్న చోట్ల, గెలిచే అవకాశం ఉన్న చోట్ల అదనపు బలం కోసం పరిపూర్ణానంద ప్రచారం నిర్వహించారు. ఎంఐఎం ఆధిపత్యం ఉన్న ప్రాంతాల్లోనూ, అక్బరుద్దిన్ ఓవైసీ నియోజకవర్గమైన చాంద్రాయణగుట్టలోని బీజేపీ అభ్యర్థి షెహజాది తరపున ప్రచారం చేశారు. పరిపూర్ణానంద ప్రవచనాలు ఆసక్తికరంగా ఉంటాయి. మంచి వాక్పటిమ ఆయన సొంతం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆయన మాట్లాడినంత సేపూ భక్తులు ఎంత శ్రద్ధగా వింటారు. దీంతో ఏపీతో పాటు తెలంగాణలో ఆయనకు పెద్దఎత్తున శిష్యులు, అనుచరులు ఉన్నారు. ఇవన్నీ రాజకీయాల్లో కలిసి వస్తాయని ఆయన భావించి ఉంటారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత సీన్ రివర్స్ అయ్యింది. గులాబీ గాలికి కాషాయం జాడ లేకుండా పోయింది.
హిందుత్వ నినాదం వల్లనేనా?
తెలంగాణలో హిందుత్వ నినాదం హైదరాబాద్ లో తప్పించి ఎక్కడా ప్రభావం చూపదు. ఈ ఎన్నికల్లో అయితే అది కేవలం గోషామహాల్ కే పరిమితమైంది. మొత్తానికి పరిపూర్ణానంద స్వామికి తెలంగాణ ఎన్నికలు పెద్ద షాక్ నే ఇచ్చాయి. రెండు నెలల్లో తన మంత్రం ఫలిస్తుందనుకున్న ఆయనకు వాస్తవ పరిస్థితులు అవగతమయ్యాయి. సుదీర్ఘ ప్రణాళిక లేకుండా కేవలం రెండు నెలల్లోనే మొత్తం మార్చేస్తామనుకోవడమే బీజేపీ, పరిపూర్ణానంద చేసిన తప్పిదంగా కనిపిస్తోంది. ఇక, స్వామి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటారో లేదా ఆధ్మాత్మిక దారిలోనే మళ్లీ వెళతారో చూడాలి. ఒకవేళ రాజకీయాల్లో కొనసాగాలనుకుంటే షార్ట్ టర్మ్ రాజకీయాలకు స్వస్థి పలికి లాంగ్ టర్మ్ ప్రణాళికతో ముందుకుపోతే మేలు జరిగి అవకాశం ఉంది.