Wed Nov 20 2024 07:33:23 GMT+0000 (Coordinated Universal Time)
మోదీ కామెంట్స్.. కేసీఆర్‌కే కాదట.. ఇటు చంద్రబాబుకూ
నిజామాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ కేసీఆర్ పట్ల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారాయి
నిజామాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ కేసీఆర్ పట్ల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారాయి. మోదీ తనతో కేసీఆర్ జరిపిన సంభాషణను బయటకు చెప్పడంతో ఇప్పుడు ఏపీ నేతల గుండెలు గుభేలు మంటున్నాయి. కేసీఆర్ పై మోదీ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు తమకు తాము అన్వయించుకుంటున్నారు. కేసీఆర్ ఎన్డీఏలో చేరాలని తనతో అడిగారని, అయితే తాను అందుకు అంగీకరించలేదని మోదీ చెప్పారు. తన కుమారుడిని ముఖ్యమంత్రిని చేస్తానని తనతో అన్నారని, అందుకు తాను అంగీకరించలేదని కూడా చెప్పారు. అయితే ఇందులో నిజానిజాలు పక్కన పెడితే కేసీఆర్ పై చేసిన కామెంట్స్ ఇటు చంద్రబాబుకు కూడా కొందరు అన్వయిస్తున్నారు.
టీడీపీ కూడా...
తెలుగుదేశం పార్టీ కూడా కుటుంబ పార్టీయే. ఆయన కూడా తన కుమారుడికి పగ్గాలు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తుకు మోదీ మోకాలడ్డుతారా? అన్న అనుమానం కలగక మానదు. కేసీఆర్ నే మోదీ ఎన్డీఏలోకి తీసుకోకుండా తిరస్కరించినందున, ఇక ఏపీలో టీడీపీని ఎలా తీసుకుంటారన్నది సైకిల్ పార్టీ వ్యతిరేకుల వాదనగా ఉంది. ఇప్పటికే జనసేనతో పొత్తులో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తుకు సిద్ధమవుతుందా? అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది.
తనను వ్యక్తిగతంగా...
ప్రధాని నరేంద్ర మోదీ పై వ్యతిరేకంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఆయన ఈ విధమైన కౌంటర్ ఇచ్చారనే చెప్పాలి. గత కొంతకాలంగా నరేంద్ర మోదీ, బీజేపీని టార్గెట్ చేస్తుండటం, వ్యక్తిగత దూషణలకు దిగడం, ప్రధాని రాష్ట్రానికి వస్తే స్వాగత, వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొనకపోవడం, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వ్యతిరేకం చేయడం వంటివి కేసీఆర్ పట్ల ఆయనకు వ్యతిరేకత పెంచాయంటున్నారు. అదే సమయంలో చంద్రబాబు కూడా 2019లో బీజేపీ నుంచి విడిపోయిన తర్వాత దీక్షల పేరుతో మోదీని దూషించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేసిన చంద్రబాబును ఈ ఎన్నికల్లో మోదీ దగ్గరకు రానివ్వరన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి.
చంద్రబాబు విషయంలో...
ఇప్పటికే జనసేన, టీడీపీ పొత్తు ఖరారయింది. అవసరమైతే జనసేనను వదులుకుని ఒంటరిగానైనా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. కేసీఆర్ పై చేసిన కామెంట్స్ ఇందుకు సంకేతాలుగానే చూడాలన్నది విశ్లేషకుల అంచనా. తెలంగాణ తర్వాత జరగనున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లోనూ ఇలాగే మోదీ అటాక్ చేసే అవకాశాలున్నాయి. చంద్రబాబు తనతో జరిపిన ప్రయివేటు సంభాషణలు కూడా మోదీ బయట పెట్టే అవకాశాలు లేకపోలేదన్న భయం ఇప్పుడు పార్టీ నేతలను వెంటాడుతుంది. మొత్తం మీద నిజామాబాద్‌లో కేసీఆర్ పై మోదీ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీలోనూ వేడి పుట్టిస్తున్నాయి.
Next Story