చిన్నమ్మ దెబ్బతీశారే... !!
అసలే ఏపీకి ప్రత్యేక హోదా బీజేపీ ఇవ్వలేదన్న ఆగ్రహంతో జనం ఉన్నారు. దానికి తోడు విశాఖ వంటి వెనకబడిన జిల్లాలకు తగిన నిధుల కేటాయింపు కూడా లేవన్న ఆవేదన చాలా ఉంది. విశాఖకు సంబంధించి రైల్వే జోన్ కోసం ఎంతగా ఊరించారో తలచుకుని మరీ నగర వాసులు కుమిలిపోతూంటారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల వ్యవధిలో విశాఖకు రైల్వే జోన్ వస్తుందని హమీ ఇచ్చిన కమలనాధులు అయిదేళ్ళు పూర్తవుతున్నా ఏమీ చేయలేకపోయారు. ఈ నేపధ్యంలో జోన్ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని రేపటికైనా ఇవ్వకపోతారా అని ఎదురుచూస్తున్న వేళ బీజేపీ మహిళా నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ఓ చేదు వార్తను వినిపించేశారు. దాంతో షాక్ తినడం విశాఖ వాసుల వంతైంది.
విశాఖకు జోన్ కష్టమట....
విశాఖకు జోన్ అన్నది అసాధ్యమని పురంధేశ్వరి బాంబు లాంటి నిజం బయట పెట్టారు. విశాఖకు జోన్ ఇస్తే ఒడిషాలో ఇపుడు ఉన్న తూర్పు కోస్తా జోన్ ని ముక్కలు చేయాల్సి ఉంటుందని, ముక్కలైన తూర్పు కోస్తా జోన్ అస్థిత్వం ఉండదని ఒడిషాపై సానుభూతి చూపుతున్నారు. అందువల్ల విశాఖకు ప్రత్యేకంగా జోన్ ఇవ్వడం కుదిరేపని కాదని తేల్చి చెబుతున్నారు.
విజయవాడ జోన్ అయితే....
పైగా మరో మాట కూడా ఆమె అన్నారు. విశాఖకు బదులుగా విజయవాడ కేంద్రంగా జోన్ అడిగితే మరుక్షణంలో మంజూరు చేయించుకుని వస్తామని కూడా చెబుతున్నారు. దీంతో మరింతగా విశాఖ జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖకు జోన్ అని చెప్పి ఇపుడు విజయవాడకు తరలించే ప్రయత్నమా, ఈ విధంగా ప్రాంతాల మధ్యన చిచ్చు పెడతారా అంటూ గుస్సా అవుతున్నారు.
రాజకీయ ఎత్తుగడలో భాగమే...
విశాఖప్రజల ఓట్లతో ఓ మారు ఎంపీగా గెలిచిన పురంధేశ్వరికి విశాఖ వాసుల కంటే పొరుగున ఉన్న ఒడిషా పైనే మక్కువా? అన్న విమర్శలు ఇపుడు గట్టిగా వినిపిస్తున్నాయి. దీని వెనక రాజకీయాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఇక కేంద్రంలోని బీజేపీ పెద్దలు కూడా ఒక పథకం ప్రకారం విశాఖ రైల్వే జోన్ లేకుండా చేస్తున్నారని కూడా అంటున్నారు. రేపటి రోజున కేంద్రంలో బీజేపీకి మెజారిటీ తగ్గిపోతే ఒడిషాలోని బీజేడీ ఎంపీల సాయం తీసుకునేందుకే ఈ రకమైన ఎత్తుగడలు వేస్తున్నారని కూడా విమర్శిస్తున్నారు. విశాఖ జోన్ అన్నది ఈనాటిది కాదని, అటువంటి డిమాండ్ ని నెరవేరుస్తామని చెబితేనే 2014లో విశాఖ ప్రజలు బీజేపీకి మద్దతుగా ఓట్లసి ఎంపీని, ఎమ్మెల్యేని కూడా గెలిపించారని గుర్తు చేస్తున్నారు. ఇపుడు రాష్ట్రాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం భావ్యమేనా అని కూడా ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి నానాటికి తీకట్టుగా ఉన్న విశాఖ బీజేపీకి పురంధేశ్వరి తన తాజా ప్రకటనలతో మరింత చేటు తెచ్చారని స్థానిక బీజేపీ నెతలే మండిపడుతున్నారు
- Tags
- andhra pradesh
- ap politics
- bharathiya janatha party
- janasena party
- nara chandrababu naidu
- pawan kalyan
- purandhreswari
- railway zone
- telugudesam party
- visakhapatnam
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- పురంద్రీశ్వరి
- భారతీయ జనతాపార్టీ
- రైల్వే జోన్
- విశాఖపట్నం
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ