డాక్టర్ సాబ్ కి ఈసారి కష్టమేనా..?
ఓవైపు స్వంత పార్టీ క్యాడర్ లో అసమ్మతి... మరోవైపు వివాదాలు... సై అంటున్న రెబల్ అభ్యర్థి... మొత్తానికి స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో డా.టి.రాజయ్య క్లిష్ట పరిస్థితులనే ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 2009లో విజయం సాధంచిన రాజయ్య తర్వాత తెలంగాణ ఉద్యమ ప్రభావంతో టీఆర్ఎస్ లో చేరారు. రాష్ట్రం కోసం రాజీనామా చేయగా వచ్చిన ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించారు. రెండు సార్లూ ఆయన కడియం శ్రీహరిపైన విజయం సాధించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయరామారావుపైన సుమారు 58 వేల భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే, గత ఎన్నికల్లో రాజయ్యకు కడియం శ్రీహరి వర్గం పూర్తి స్థాయిలో మద్దతు తెలిపింది.
కడియం వర్గం మద్దతు ఉండేనా..?
ఈ ఎన్నికల్లో కడియం శ్రీహరి తన కూతురు కడియం కావ్యకు టిక్కెట్ ఆశించారు. ఇక్కడి నుంచి మూడు సార్లు ప్రతానిథ్యం వహరించిన కడియం శ్రీహరికి నియోజకవర్గంలో మంచి పట్టుంది. గ్రామగ్రామాన తనకంటూ ప్రత్యేక క్యాడర్ ఉంది. కూతురికి టిక్కెట్ పైన ఆయన భారీగానే ఆశలు పెట్టుకున్నా నెరవేరలేదు. మళ్లీ రాజయ్యకే టిక్కెట్ దక్కింది. దీంతో కడియం వర్గం ఓ రేంజ్ లో వ్యతిరేకించింది. ధర్నాలు, ఆందోళనలకు కూడా దిగింది. అయినా వెనక్కు తగ్గని టీఆర్ఎస్ రాజయ్యకే టిక్కెట్ ఇచ్చారు. తర్వాత కడియం వర్గాన్ని బుజ్జిగించే ప్రయత్నం చేశారు. అయితే, కడియం శ్రీహరి... రాజయ్యకు మద్దతు ఇచ్చినా ఆయన క్యాడర్ మాత్రం పూర్తిగా మద్దతు ఇవ్వడం లేదు.
టీఆర్ఎస్ కి రెబల్ బెడద
ఇక టీఆర్ఎస్ టిక్కెట్ ఆశించిన మరో నేత రాజారపు ప్రతాప్ రెబల్ గా మారారు. ఆయన టీఆర్ఎస్ కి రాజీనామా చేసి బీఎస్పీ తరపున బరిలో దిగుతున్నారు. నియోజకవర్గంలో ఫలితాలను ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉన్న క్రిస్టియన్ ఓటు బ్యాంకులో ప్రతాప్ కి మంచి పట్టు ఉంది. దీంతో ఆయన భారీగానే ఓట్లు చీల్చే అవకాశం ఉంది. ఆయన ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. ఆయనపై కొంత ప్రజల్లో కొంత సానుభూతి కూడా ఉంది.
కాంగ్రెస్ కి తప్పని అసమ్మతి
కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి విజయరామారావును కాదని మహిళా నేత ఇందిరకు టిక్కెట్ ఇచ్చారు. ఆమె కొంత బలమైన అభ్యర్థిగానే భావిస్తున్నారు. ఇదే సమయంలో టిక్కెట్ దక్కని విజయరామారావు రెబల్ గా పోటీ చేస్తానని, గెలిచి మళ్లీ కాంగ్రెస్ లోనే చెరతారని అంటున్నారు. దీంతో కాంగ్రెస్ ఓట్లు కూడా చీలే అవకాశం ఉంది. వరుసగా మూడుసార్లు రాజయ్య గెలవడంతో సహజంగానే ఏర్పడే వ్యతిరేకతను కూడా కాంగ్రెస్ ఉపయోగించుకోలేకపోయింది.
రాజయ్య వైపు మొగ్గు ఉన్నా...
మొత్తానికి నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం ఉంది. రాజయ్యపై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉన్నా ఆయనకు అనుకూలత కూడా బాగానే ఉంది. ప్రత్యేకించి నియోజకవర్గ కేంద్రంతో పాటు రెండు మండలాల్లో టీఆర్ఎస్ కి అనుకూలత ఎక్కువ ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ ఈసారి గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే, ఇప్పటి వరకైతే రాజయ్య వైపే కొంత మొగ్గు ఉన్నా ఈ పరిస్థితి మారే అవకాశం ఉందని అంటున్నారు.