అందరూ కుళ్లుకునేలా రేవంత్....??
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ ఎనుముల రేవంత్ రెడ్డి ప్రచారం దూసుకుపోతున్నారు. నలభై ఏళ్లుగా కాంగ్రెస్ లో ఉంటూ ముఖ్యమంత్రి అభ్యర్థులుగా చెప్పుకుంటున్న వారు కుళ్లుకునేలా దూసుకుపోతున్నారు. ఏకంగా హెలీకాఫ్టర్ లోనే రాష్ట్రవ్యాప్తంగా చక్కర్లు కొడుతూ ప్రచారపర్వంలోకి దూకారు. ఓ వైపు కేసీఆర్ రోజుకు 4 నుంచి 9 సభల్లో పాల్గొంటూ టీఆర్ఎస్ ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తుండగా... రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ తరుపున పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇందుకు ఏకంగా హెలీకాఫ్టర్ నే ఉపయోగించుకుంటున్నారు. ఒక్కో రోజుల 3 - 4 నియోజకవర్గాల్లో సభలు పెట్టి రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు.
కొడంగల్ కే పరిమితం చేయాలనుకున్నా
కేసీఆర్ ని ఢీకొట్టాలంటే కాంగ్రెస్ లో ఉంటేనే కరెక్ట్ అని నిర్ణయానికి వచ్చిన రేవంత్ రెడ్డి పార్టీలో చేరి సంవత్సరం పైనే అయ్యింది. మంచి వాక్పటిమ, ప్రత్యర్థులపై సూటిగా విమర్శలు చేయడంలో ముందే ఆయన ప్రచార కమిటీ బాధ్యతలను ఆశించారు. అయితే, రేపు ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పాటుచేస్తే ప్రచార కమిటీ బాధ్యతలు నిర్వహించిన వారికి కీలక పదవి దక్కేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. దీంతో కొందరు కాంగ్రెస్ సీనియర్ల అభ్యంతరంతో ఆ పదవి దక్కలేదు. కేసీఆర్ తో రాజకీయ వైరం తెలంగాణ కాంగ్రెస్ లో అందరి కంటే రేవంత్ రెడ్డికే ఎక్కువ. దీంతో కేసీఆర్ ను ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. తమకు కొరక రాని కొయ్యగా మారిన రేవంత్ రెడ్డిని ఈసారి స్వంత నియోజకవర్గంలోనే ఓడించాలని టీఆర్ఎస్ కూడా గట్టి పట్టుదలతో ఉంది.
ప్రత్యేక హెలీకాఫ్టర్ ద్వారా...
ప్రజలను ఆకట్టుకునేలా మాట్లాడగలిగే రేవంత్ కు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉంది. దీంతో రేవంత్ ను టార్గెట్ చేసిన టీఆర్ఎస్ కొడంగల్ లో టఫ్ ఫైట్ ఇవ్వడం ద్వారా ఆయనను నియోజకవర్గం దాటి బయటకు రానివ్వద్దని స్కెచ్ వేసింది. అనుకున్నట్లుగానే పట్నం నరేందర్ రెడ్డిని బరిలోకి దింపి రేవంత్ రెడ్డికి గట్టి పోటీ ఇస్తోంది. గెలుపుపై పూర్తి ధీమాగా ఉన్న రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి దిగారు. ప్రచార కమిటీ, స్టార్ క్యాంపెయినర్లతో సంబంధం లేకుండా ప్రచారం చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ హెలీకాఫ్టర్ ను కూడా రేవంత్ ఏర్పాటు చేసుకున్నారు. కొడంగల్ లోనే హలీప్యాడ్ ఏర్పాటు చేసి అక్కడినుంచే వెళ్లి వస్తున్నారు. ఇది స్థానికంగానూ రేవంత్ ఇమేజ్ ను మరింత పెంచుతుంది. కాంగ్రెస్ అభ్యర్థులు కూడా రేవంత్ రెడ్డి సభలు నిర్వహించాలని ఉవ్విళ్లూరుతున్నారు. షబ్బీర్ అలీ, గీతా రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి వంటి సీనియర్ నేతలు సైతం రేవంత్ రెడ్డిని ప్రచారానికి తీసుకెళ్లి రోడ్ షోలు, సభలు నిర్వహించారు. రేవంత్ సభలకు జనసమీకరణ కూడ బాగానే చేస్తున్నారు. సిరిసిల్లలో కూడా రేవంత్ భారీ సభనే నిర్వహించారు. మొత్తానికి ఎన్నికల్లో రేవంత్ హంగామా మామూలుగా లేదు.