కొ‘దంగల్’లో పహిల్వాన్ ఎవరు..?
తెలంగాణ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొడంగల్ ముందు వరుసలో ఉంది. ఇక్కడి నుంచి పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్, తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ముద్రపడ్డ రేవంత్ రెడ్డి పోటీలో ఉండటమే ఇందుకు కారణం. ఇప్పటికే రెండుసార్లు టీడీపీ నుంచి కొడంగల్ లో విజయం సాధించిన రేవంత్ రెడ్డి మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలతో ఉన్నారు. ఇక తమకు కొరకరాని కొయ్యగా మారి తరచూ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్న రేవంత్ రెడ్డిని కచ్చితంగా ఓడించి ఆయన దూకుడు చెక్ పెట్టాలని టీఆర్ఎస్ కంకణం కట్టుకుంది. దీంతో కొడంగల్ పై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఆసక్తి నెలకొని ఉంది. ఇక ఇటీవల కొడంగల్ కేంద్రంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం మరింత కొడంగల్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఇక, ఎటువంటి శాంతిభద్రతల సమస్యలు రాకుండా అధికారులు కూడా కొడంగల్ పై ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గంలో మొత్తం 264 పోలింగ్ కేంద్రాల్లో 95 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా అధికారులు గుర్తించారు.
సెంటిమెంట్ ను తట్టిన రేవంత్...
స్థానికేతరుడే అయినా పదేళ్లకాలంలోనే రేవంత్ రెడ్డి కొడంగల్ లో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. గత ఎన్నికల్లో ఆయన పార్టీ ఇమేజ్ కంటే వ్యక్తిగత బలంతోనే గెలుపొందారని చెప్పవచ్చు. కొడంగల్ నుంచి గెలిచి ఆయన రాష్ట్ర నాయకుడిగా ఎదిగారు. సంవత్సరం క్రితం కాంగ్రెస్ లో చేరిన ఆయన రాష్ట్రవ్యాప్తంగా కూడా ప్రచారం చేశారు. ఇక కొడంగల్ లో గెలుపుపై రేవంత్ ధీమాగా ఉన్నారు. అభివృద్ధిలో కొడంగల్ చాలా వెనకబడి ఉంది. కర్ణాటక సరిహద్దులో విసిరేసినట్లుగా ఉన్న ఈ నియోజకవర్గాన్ని ఏ పార్టీ కూడా పట్టించుకోకపోవడంతో వెనుకబడింది. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేల్లో కేవలం 1967లో అచ్యుతరెడ్డి మాత్రం కొంతకాలం మంత్రిగా పనిచేశారు. తర్వాత ఆ అవకాశం ఎవరికీ రాలేదు. ఆరుసార్లు గెలిచిన గురునాథ్ రెడ్డి కూడా మంత్రి కాలేకపోయారు. దీంతో నియోజకవర్గం అభివృద్ధి జరగలేదు. ఇక రాష్ట్ర స్థాయి నేతగా ఉన్న రేవంత్ రెడ్డికి ఈ అంశం కొంత సానుకూలంగా మారింది. రేవంత్ గెలిస్తే కీలక పదవి వస్తుందని, అభివృద్ధి జరుగుతుందని కొంతమంది ప్రజల్లో భావన ఉంది. ఇక రేవంత్ రెడ్డి ప్రధానంగా సెంటిమెంట్ ను తెరపైకి తెచ్చారు. తనవల్లె కొడంగల్ కు రాష్ట్రస్థాయిలో గుర్తింపు వచ్చిందని, తాను ఉన్నందునే టీఆర్ఎస్ ఇటీవల అభివృద్ధి పనులు ప్రారంభించిందని రేవంత్ పదే పదే చెబుతున్నారు. ఇక టీఆర్ఎస్ బలగంలో కొడంగల్ పైన యుద్ధం చేస్తోందని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇక ఇటీవల జరిగిన ఐటీ దాడులు, అర్థరాత్రి అరెస్టు, సోదాలు, భద్రత వంటి అంశాలు కూడా రేవంత్ పట్ల సానుభూతిని క్రియేట్ చేశాయి.
బలంగా మారిన టీఆర్ఎస్
ఇక, సంవత్సరం క్రితమే ఇక్కడ ఉప ఎన్నికలు వస్తాయని భావించిన టీఆర్ఎస్ అప్పటి నుంచే రేవంత్ ను దెబ్బ తీసేందుకు వ్యూహాలు ప్రారంభించింది. గత ఎన్నికల్లో అభ్యర్థిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గురునాధ్ రెడ్డిని వయస్సురిత్యా పక్కనపెట్టి బలమైన అభ్యర్థిగా ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డిని తీసుకువచ్చారు. ఆయన సంవత్సర కాలంగా నియోజకవర్గంలో బాగా పనిచేసుకున్నారు. మంత్రి హరీష్ రావు, జిల్లా మంత్రులుగా పనిచేసిన డా.లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు కొడంగల్ లో అనేకసార్లు పర్యటించి పెద్దఎత్తున అభివృద్ధి పనులు ప్రారంభించి తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఇతర పార్టీల నాయకులతో పాటు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను, రేవంత్ వర్గంగా ఉన్న కొంతమంది నేతలను తమవైపు తిప్పుకుని పార్టీని బలంగా చేసుకున్నారు. గ్రామాల్లో మంచి గుర్తింపు ఉన్న గురునాధ్ రెడ్డి పూర్తిస్థాయిలో పార్టీ కోసం పనిచేశారు. దీంతో టీఆర్ఎస్ గతంలో కంటే చాలా బలంగా తయారైంది. నియోజకవర్గంలో ప్రభావం చూపే స్థాయిలో బీసీ ఓటర్లు, ముఖ్యంగా యాదవులు, ముదిరాజ్ లు ఉన్నారు. వీరు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతారనే అంచనాలు ఉన్నాయి. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలే గట్టెక్కిస్తాయని ఆ పార్టీ ధీమాగా ఉంది. మొత్తానికి రేవంత్ రెడ్డికి ఈ ఎన్నికల్లో తీవ్ర పోటీనే ఎదుర్కొంటున్నారు.