రేవంత్ రహస్య స్నేహితుడు ఎవరంటే?
తెలంగాణ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్, టీడీపీ పొత్తుకు కృషి చేస్తున్నారా? రేవంత్ కు ఇప్పటికీ చంద్రబాబుకు టచ్ లోనే ఉన్నారా? తెలంగాణలో కాంగ్రెస్ ను విజయబాటను పట్టించేందుకు రేవంత్ రాహుల్ సూచనలతోనే ప్రయత్నిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వస్తుంది. తొలి నుంచి రేవంత్ రెడ్డి రాకపై కాంగ్రెస్ పార్టీలో కొందరు సీనియర్ నేతలకు అనుమానాలున్నాయి. చంద్రబాబు అనుమతిని తీసుకునే రేవంత్ హస్తం పార్టీలో చేరారన్న వ్యాఖ్యలు అప్పట్లోనే విన్పించాయి. తొలి నుంచి రేవంత్ తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలని తొలిసారి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. దీనిని సీనియర్ నేత జైపాల్ రెడ్డి సమర్థించారు. తెలుగుదేశం పార్టీ అంటరాని పార్టీ కాదంటూ జైపాల్ రెడ్డి రేవంత్ కు వత్తాసు పలికారు.
నేతలు విభేదించినా.....
అయితే అప్పట్లో తెలుగుదేశం పార్టీలో ఉన్న రేవంత్ తో కొందరు సీనియర్ నేతలు విభేదించారు. ముఖ్యంగా మోత్కుపల్లి వంటి సీనియర్ నేతలు రేవంత్ వ్యాఖ్యలను బహిరంగంగానే ఖండించారు. రేవంత్ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆ మాట అన్నారా? లేక వ్యక్తిగతంగా చేశారో చెప్పాలని మోత్కుపల్లి అప్పట్లోనే నిలదీశారు. దీనిపై కొందరు నేతలు చంద్రబాబుకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే అప్పట్లో చంద్రబాబు రేవంత్ వ్యాఖ్యలను చూసీ చూడనట్లు వదిలేశారు. పైగా పొత్తుల అంశం ఇప్పుడు కాదని, ఎన్నికలకు ముందే దానిపై నిర్ణయం ఉంటుందని తేల్చి చెప్పారు.
రాజీనామా లేఖ ఎక్కడ?
ఆ తర్వాత రేవంత్ అమరావతి వెళ్లి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే రాజీనామా లేఖను కూడా చంద్రబాబుకు సమర్పించారు. ఇప్పటికీ ఆ రాజీనామా ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. స్పీకర్ కార్యాలయం తమకు చేరలేదని అంటుంటే, తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతలు మాత్రం చంద్రబాబు ఆ రాజీనామా లేఖను పంపించామని కాలం నెట్టుకొచ్చారు. రేవంత్ పార్టీని వీడేటప్పుడు కూడా చంద్రబాబుపై ఒక్క నెగిటివ్ కామెంట్ చేయలేదు. అలాగే చంద్రబాబు కూడా రేవంత్ పై విమర్శలు చేయలేదు. ఇలా రేవంత్ తెలుగుదేశం పార్టీ నుంచి జాగ్రత్తగా హస్తం పార్టీలోకి దూకేశారు.
ఉత్తమ్ సూచనలతోనే......
ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి టీడీపీ, కాంగ్రెస్ ల పొత్తు విషయంలో రేవంత్ నే ఉపయోగించుకుంటున్నారన్నది గాంధీ భవన్ లో టాక్. చంద్రబాబుకు రేవంత్ కు మధ్య ఇప్పటికీ సన్నిహిత సంబంధాలున్నాయని కొందరు కాంగ్రెస్ నేతలే అంటున్నారు. తెలంగాణలో ఒక వర్గం నేతలకు చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం ఇష్టంలేదు. కేవలం గ్రేటర్ హైదరాబాద్ లో సీట్ల కోసం టీడీపీతో పొత్తు పెట్టుకుంటే పార్టీ మనుగడ భవిష్యత్తులో కష్టమవుతుందని కొందరు ఈ పొత్తులను వ్యతిరేకిస్తున్నారు. కాని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం టీడీపీతో పొత్తుకు సై అంటున్నారు. ఇందుకు రేవంత్ ను ఉపయోగించుకుంటున్నారని తెలిసింది. పొత్తులపై అధిష్టానం నిర్ణయం ఫైనల్ అని చెబుతున్నప్పటికీ ఖచ్చితంగా టీడీపీతోనే వెళ్లాలన్నది పీసీసీ నిర్ణయంగా తెలుస్తోంది. మొత్తం మీద ఇరు పార్టీల పొత్తుల విషయంలో రేవంత్ కీలకంగా మారారంటున్నారు.
- Tags
- indian national congress
- k chandrasekhar rao
- nara chandrababu naidu
- revanth reddy
- talangana rashtra samithi
- telangana
- telangana politics
- telugudesam party
- uttam kumar reddy
- ఉత్తమ్ కుమార్ రెడ్డి
- కె. చంద్రశేఖర్ రావు
- తెలంగాణ
- తెలంగాణ పాలిటిక్స్
- తెలంగాణ రాష్ట్ర సమితి
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- భారత జాతీయ కాంగ్రెస్
- రేవంత్ రెడ్డి