ఇంతలో ఎంత మార్పు ? ఏపీలో ఏమి జరుగుతోంది?
ఏడాదిలో ఎంత మార్పు ! అంతకు ముందున్న పరిస్థితులు లేవు.పరిణామాలు వేగంగా మారుతున్నవి.
ఏడాదిలో ఎంత మార్పు ! అంతకు ముందున్న పరిస్థితులు లేవు.పరిణామాలు వేగంగా మారుతున్నవి.గాలిలో తేమ శాతం తగ్గి ఆగస్టులోనూ ఉక్కపోత పెరుగుతోంది.రాజకీయ బలాబలాల్లోనూ ఏదో తేడా కనిపిస్తోంది.నిజానికి రెండు మూడేళ్ళ నుంచే ఉరుములు,మెరుపులున్నా అవి ఒక రూపం దాల్చడానికి మరికొంత సమయం పట్టి ఉండవచ్చు.గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికార పార్టీ వైసీపీ ఓటమి,సస్పెన్షన్ అనంతరం ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడం,ఆలస్యమైనా పవన్ కళ్యాణ్ 'వారాహి యాత్ర' సూపర్ హిట్ కావడం వంటి పరిణామాలు... నిస్సందేహంగా తెలుగుదేశం పార్టీని ఐసీయు నుంచి జనరల్ వార్డుకు మార్చాయి.చంద్రబాబు ఇనుమడించిన ఉత్సాహంతో జగన్ పై 'నువ్వా - నేనా' అంటున్నారు.రండి చూసుకుందాం.కమాన్ కాస్కో!అంటూ పవన్ ఒరవడిలోనే తన భాషనూ చంద్రబాబు మార్చుకున్నారు.పులివెందుల,పుంగనూరు వంటి ప్రాంతాల్లో టీడీపీ అధ్యక్షుడి ప్రసంగాన్ని గమనిస్తే అందులో 'మిలిటెన్సీ' కనిపిస్తోంది.2024 లో అధికారంలోకి రాకపోతే పార్టీ మనుగడ ప్రమాదంలో పడుతుందన్న ఆందోళనతో చంద్రబాబు కసి ,పగ పెంచుకున్నారు.'ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి' యాత్రకు ముందు చంద్రబాబు వేరు.ఈ యాత్ర చేపట్టాక 'రుద్రవీణ' మీటుతున్న చంద్రబాబు వేరు.