శ్రీధర్ బాబు సత్తా చూపిస్తారా..?
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మంథని నియోజకవర్గంలో ఎన్నికల వేడి రాజుకుంది. కాంగ్రెస్ తరపున మంథనిలో మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బరిలో ఉండగా టీఆర్ఎస్ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు పోటీ చేస్తున్నారు. ఆటవీ, గ్రామీణ ప్రాంతం ఎక్కువగా ఉన్న మంథని నియోజకవర్గానికి చారిత్రకంగానూ గుర్తింపు ఉంది. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిన దివంగత నేత పీ.వి.నరసింహారావు తర్వాత దేశ ప్రధానమంత్రి స్థాయికి ఎదిగారు. ఇక శ్రీధర్ బాబు తండ్రి దుద్దిళ్ల శ్రీపాదరావు కూడా ఇక్కడి నుంచి మూడుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా పనిచేయడంతో పాటు ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా కూడా పనిచేశారు.
తండ్రి వారసత్వంగా వచ్చి...
శ్రీపాదరావు నక్సలైట్ల దాడిలో మరణించడంతో ఆయన తనయుడు శ్రీధర్ బాబు చిన్నవయస్సులోనే రాజకీయాల్లోకి వచ్చారు. వరుసగా మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తండ్రి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చినా ఆయన స్వంతంగా బలమైన నేతగా ఎదిగారు. 2009లో మూడోసారి విజయం సాధించగానే ఆయనకు వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రిగా అవకాశం లభించింది. తర్వాత కిరణ్ హయాంలోనూ మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో ఆయన విజయంపై చాలా ధీమాగా ఉన్నా టీఆర్ఎస్ తరపున పోటీచేసిన పుట్టా మధు సుమారు 20 వేల భారీ తేడాతో ఆయనను ఓడించారు. అంతకుముందు ఎన్నికల్లోనూ పుట్టా మధు ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చారు.
బీసీల ఓట్లు ఎటువైపో..?
నియోజకవర్గంలో సాధారణ కార్యకర్త స్థాయి నుంచి పుట్టా మధు ఎమ్మెల్యేగా ఎదిగారు. గ్రామగ్రామాన తనకంటూ ప్రత్యేకంగా క్యాడర్ ఏర్పాటుచేసుకుని బలమైన నాయకుడిగా ఎదిగారు. ఈ ఎన్నికల్లో ఫస్ట్ లిస్టులోనే ఆయన పేరు ఖరారు చేయడంతో రెండునెలలుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆయన భార్య పుట్టా శైలజ కూడా మంథని మేజర్ గ్రామ పంచాయితీకి సర్పంచ్ గా పనిచేశారు. ఇద్దరూ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలో బీసీ జనాభా ఎక్కువగా ఉండటం, అందులోనూ మున్నూరు కాపు వర్గానికి చెందిన వారు ప్రభావం చూపే స్థాయిలో ఉండటం మధుకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతుండటం కూడా టీఆర్ఎస్ కు ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది.
ఇద్దరిదీ అభివృద్ధి మంత్రమే..!
కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్ బాబుకు నియోజకవర్గ ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. తన హయాంలో, ముఖ్యంగా మంత్రి ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిని గుర్తు చేస్తున్నారు. రాష్ట్రస్థాయిలో కుదిరితే ప్రభుత్వంలో లేదా పార్టీలో కీలకంగా పనిచేయాలనుకున్న శ్రీధర్ బాబు గత ఎన్నికల్లో ఓటమితో నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. అప్పటినుంచి ప్రజల్లో ఉంటున్నారు. రాజకీయ వ్యూహాలకు కూడా పదును పెట్టిన ఆయన పలు సందర్భాల్లో ఎమ్మెల్యే పుట్టా మధును ఇరుకునపెట్టారు. పుట్టా మధు చుట్టూ నెలకొన్న పలు వివాదాల వెనుక శ్రీధర్ బాబు ఉన్నారని ఆయన వర్గం ఆరోపిస్తోంది. కానీ, పుట్టా మధుపై అవినీతి, అక్రమాల ఆరోపణలను మాత్రం ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. ఎమ్మెల్యే, టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో పాటు కాంగ్రెస్ కు ఇక్కడ ఉన్న బలమైన ఓటు బ్యాంకు కలిసివస్తుందని ఆయన ధీమాగా ఉన్నారు. అయితే, పుట్టా మధు ఈ నాలుగున్నరేళ్లలో నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి, ప్రభుత్వ పథకాలపై తనను గట్టెక్కిస్తాయని నమ్ముతున్నారు. అయితే, ఇద్దరు ప్రధాన అభ్యర్థులూ అభివృద్ధి నినాదం ఎత్తుకున్నా నియోజకవర్గం మాత్రం అంతగా అభివృద్ధి చెందలేదనేది ప్రజల ఆరోపణ.