Fri Nov 22 2024 13:13:45 GMT+0000 (Coordinated Universal Time)
ఎవరికి పడితే వారికి ఇస్తారా?: తాండూరు ఓటర్ల గోస
ఎవరికి పడితే వారికి ఇస్తారా?: తాండూరు ఓటర్ల గోస
పట్నం మహేందర్ రెడ్డి కేసీఆర్ కి సరెండర్ అయిపోయాక.. తాండూర్‌లో కాంగ్రెస్ క్యాడర్ కాస్త నిరుత్సాహ పడింది. అప్పటివరకూ గ్రూప్ పాలిటిక్స్‌తో సాగిన పైలట్ రోహిత్, పట్నం మహేందర్ ల వివాదాలు.. పట్నం ఏనాటికైనా కాంగ్రెస్ గూటికి చేరుస్తుందని అందరూ భావించారు. కానీ అందరి అంచనాలూ తారుమారయ్యాయి.
అలాంటి పరిస్థితులలో పైలట్ రోహిత్ రెడ్డి లాంటి అపొనెంట్ను ఎదుర్కోవడం ఎలా అని పార్టీ వర్గాలు, స్థానిక లీడర్లు ఆలోచించారు. అదే సమయంలో తాండూరులో కోలాహలంగా అడుగు పెట్టారు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి. దాదాపు ఇరవై రోజుల పాటు కేఎల్ఆర్ తాండూరులో పాదయాత్రలు, రోడ్ షోలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఓ కొత్త జోష్ తెచ్చారు.
పట్నం మహేందర్ బిఆర్ఎస్లో ఉండిపోవడంతో.. కాంగ్రెస్ పార్టీ లీడర్ డాక్టర్ సంపత్ కుమార్ టికెట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. సంపత్ కుమార్ స్థానికంగా పేరుప్రఖ్యాతలు ఉన్న వ్యక్తి. సౌమ్యుడు.. దాదాపు కొన్ని వేల కుటుంబాలకి ఉచిత వైద్య, ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. వారి భార్య సునిత ఇంతకుముందు తాండూరు మున్సిపల్ ఛైర్మన్ గా చేసి ఉన్నారు.
భార్యాభర్తలు ఇద్దరూ దాదాపు ముప్పై ఏళ్ళుగా తాండూరులో కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్నారు. ఈ కారణంతో సంపత్ కుమార్ తన అదృష్టం పరీక్షించుకునేందుకు ఢిల్లీకి వెళ్ళారు. అక్కడ పార్టీ పెద్దలతో చర్చించి టికెట్‌కి ఒప్పించగలిగారు. అదే సమయంలో తాండూరులోని మాజీ టీడీపి నేత ఒకరు ఢిల్లీలో ఉన్నారు. అతను బుయ్యని శ్రీనివాస్ రెడ్డి. వికారాబాద్ డీసీసీబి ఛైర్మన్‌గా చేసి ఇటీవల కాలంలో రాజీనామా చేసి తాండూరు టికెట్ కోసం కాంగ్రెస్ లో చేరిన మనోహర్ రెడ్డి తమ్ముడు ఈ శ్రీనివాస్ రెడ్డి.
తాండూరులో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్‌ను గ్రహించిన సోదరులు ఇద్దరూ హైకమాండ్‌తో లాబీయింగ్ చేసుకుని టికెట్ తమకే కన్ఫర్మ్ అయిందంటూ నియోజకవర్గంలో ప్రచారాలకు తెరలేపారు. డాక్టర్ సంపత్, శ్రీనివాస్ రెడ్డిలు ఢిల్లీకి వెళ్ళినప్పుడు.. ఆ ఇద్దరిలో ఒకరికి టికెట్ ఇస్తామని హామీ ఇచ్చి పంపింది. సరిగ్గా పదిరోజుల తర్వాత శ్రీనివాస్ రెడ్డి అన్న మనోహర్ రెడ్డి తన పదవికి, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి.. కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఇంత తతంగం జరుగుతున్న సమయంలో కేఎల్ఆర్ మాత్రం తన ప్రచార కార్యక్రమాలు మానుకోలేదు. మండల్ లెవల్ బూత్ లెవెల్ అధ్యక్షులని నియమిస్తూ.. ఎంపీటీసీ, జడ్పీటీసీ లను కలుపుకుని పోతున్నారు. డాక్టర్ సంపత్, మనోహర్ రెడ్డిలు రేవంత్ రెడ్డి అండ్ గ్యాంగ్‌ని ప్రతిరోజు కలుస్తూ ఒత్తిడి పెంచుతున్నారు.
ఈ ముగ్గురిలో ఎవరికి టికెట్ వస్తుందా అన్న సందిగ్ధత స్థానిక కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు కన్ఫ్యూజన్కి గురవుతున్నారు. కేఎల్ఆర్, సంపత్ కుమార్ల వర్గాలు ప్రచారాలు చేస్తున్న తరుణంలో మనోహర్ రెడ్డి తాలూకా కార్యకర్తలని అడ్డుకుంటున్నారని తెలుస్తోంది. పార్టీ ఎవరినో ఒకరిని డిసైడ్ చేసేంతవరకూ ప్రచారాలకు రావద్దని కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు అడ్డుకుంటున్నారు.
తాండూరులో ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో క్లిష్ట పరిస్థితులే నెలకొన్నాయని స్పష్టంగా తెలుస్తోంది. కానీ అసలు సమస్య ఏంటంటే.. ఈ నియోజకవర్గంలో పైలట్ రోహిత్ రెడ్డిని ఎదురుకోగల నేత ఎవరు అనేదే! అతని హైపర్ యాటిట్యూడ్‌కి సరిగ్గా ఎదురెళ్ళేవారే ఉండాలి లేదా ప్రజల్లో అమితమైన ప్రేమ ఉండేవాళ్ళు అయి ఉండాలి. ఆర్థికంగా, కార్యకర్తల పరంగా కేఎల్ఆర్ ఓకే అనుకుంటే.. నియోజకవర్గంలో డాక్టర్ సంపత్ కుమార్‌కు మంచి మద్దతు కనిపిస్తోంది. ఇటీవల కాలంలో పార్టీలోకి చేరిన మనోహర్ రెడ్డికి మాత్రం స్థానికంగా పదిశాతం కూడా మద్దతు కనిపించడం లేదు. మనోహర్ రెడ్డికి టికెట్ ఇస్తే కేవలం పార్టీ సింపతీ మాత్రమే గెలిపించుకోవాలి కానీ.. అతని సొంత వర్చస్సుతో గెలవడం కష్టం అని స్థానికులు చెప్తున్నారు. ఐదేళ్ళు పదవిని అనుభవించి చివరి నిమిషంలో రాజీనామా చేసి మరోచోట లక్కుని వెదుక్కుంటూ వచ్చిన నాన్ లోకల్ మనోహర్ రెడ్డి. అతను కేసీఆర్ పంపితే వచ్చాడు అంటూ తాండూరు ప్రజలు చర్చించుకుంటున్నారు...
Next Story