ఆ టీడీపీ ఎమ్మెల్యే వైసీపీ గూటికి చేరడం ఖాయమేనా ..?
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం టీడీపీ ఎమ్యెల్యే తోట త్రిమూర్తులు వైసిపి వైపు చూస్తున్నారా ? అవుననే అనుమానాలు కలిగేలా తోట మిత్ర బృందం వ్యవహరిస్తోంది. ప్రస్తుతం వైసిపి చీఫ్ వైఎస్ జగన్ పాదయాత్ర తాళ్లరేవు నియోజకవర్గం నుంచి రామచంద్రాపురానికి చేరుకుంటోంది. జగన్ పాదయాత్ర చేసే మార్గంలో తాజాగా ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఫ్లెక్సీలు వెలిశాయి. వాస్తవానికి ఇదేమీ పెద్ద విషయం కాదు. ప్రజాప్రతినిధులు గా వుండే వారు కానీ వారి తరపున అభిమానులు నేతలకు భారీ ఫ్లెక్సీలు కట్టడం షరా మామూలే. కానీ తోట త్రిమూర్తుల అభిమానులు కట్టిన ఫ్లెక్సీలు అనుమానం కలిగించేలా వున్నాయి. పార్టీలు ఏవైనా మా లీడర్ తోటే అంటూ పసుపు రంగు కాకుండా వైసిపి జెండాలో వుండే రంగు తోకూడిన ఫ్లెక్సీ లు ఏర్పాటు కావడం ఇప్పుడు అటు టిడిపి, ఇటు వైసిపి లలో చర్చనీయాంశంగా మారింది. దీని భావమేమిటి అని త్రిమూర్తులు అడుగుతున్నా ఆయన పెదవి విప్పకపోవడం విశేషం.
ఉప్పు నిప్పు గా వుండే తోట, పిల్లి ...
వైఎస్ జగన్ కి అత్యంత విశ్వాస పాత్రుడిగా పేరుపడిన మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పోటీ చేసే ఈ నియోజక వర్గం చాలా కాలంగా చురుకైన రాజకీయం లేక మౌనంగా వుంది. బోస్ కి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడం, 2021 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగే పరిస్థితి ఉండటంతో పిల్లి వారసులు ఎవరనే చర్చ మొదలైంది. కాపు, శెట్టిబలిజ సామాజికవర్గాల నడుమ నడిచే ఇక్కడి నియోజకవర్గ ఎన్నికల యుద్ధం దశాబ్దాలుగా ఇరువురి నేతల మధ్య రంజుగా సాగేది. కానీ ప్రజలు నేరుగా ఎన్నుకోని పదవిలో బోస్ ఉండిపోవడంతో ఆయనకు అత్యంత ఇష్టుడైన మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ చెల్లుబోయిన వేణుగోపాల్ రామచంద్రపురం వైసిపి టికెట్ కి రేసులో వున్నారు. ఈ నేపథ్యంలోనే ఖాళీ అయిన బోస్ ప్లేస్ లోకి వైసిపిలోకి తోట జంప్ అయ్యే పక్షంలో ఆయనకు వచ్చే ఎన్నికలు నల్లేరుపై బండినాడకలా సాగిపోనున్నాయి. ఈ ఈక్వేషన్స్ తోనే తోట అధికార పార్టీకి టాటా చెప్పేస్తారా అన్న అనుమానాలు షికారు చేస్తున్నాయి.
తోట ను వెంటాడుతున్న కేసు ...
తోట త్రిమూర్తులకు రెండు దశాబ్దాల క్రితం నమోదైన దళితుల శిరోమండనం కేసు వెంటాడుతుంది. టిడిపి జెండా పీకి వైసిపి లోకి వెళ్లిన పక్షంలో ఈ కేసు అమీతుమీ తేల్చేందుకు కంకణం కట్టుకున్న పిల్లి బోస్ వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఎదురౌతుంది. ఇవన్నీ ఆలోచించే త్రిమూర్తులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు ఆయన అనుచర వర్గాల సమాచారం. కులాల కురుక్షేత్రం గా వుండే రామచంద్రపురం ఎన్నికలను కాపు, శెట్టిబలిజ, ఎస్సి సామాజిక వర్గాలే ప్రభావితం చేస్తాయి. తోట వైసిపిలో చేరే పక్షంలో బోస్ దీనికి అంగీకరించే పరిస్థితే ఉంటే మూడు ప్రధాన సామాజిక వర్గాలు త్రిమూర్తులు కు వద్దన్నా అండగా నిలిచే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే టిడిపి బలమైన శెట్టిబలిజ వర్గానికి చెందిన అభ్యర్థిని నిలిపి పోటీ ఇచ్చినా బోస్ వెనుక వున్న ఆయన సామాజిక వర్గం, జగన్ కి అండగా వున్న దళిత సామాజిక వర్గాలు మరోసారి సునాయాస విజయాన్ని తోటకు కట్టబెట్టే పరిస్థితి. జనసేన రంగ ప్రవేశంతో కాపు సామాజికవర్గం ఓట్లు అటు టిడిపి, వైసిపి పార్టీలకు చిల్లు పెట్టినా త్రిమూర్తుల అంచనా ప్రకారం మిగిలిన సామాజిక వర్గాలు ఆయన్ను గెలుపు తీరానికి చేరుస్తాయని భావిస్తున్నట్లు తెలుస్తుంది.
సీనియర్ అయినా దక్కని మంత్రి ...
పార్టీలు మారినా టిడిపి లో సీనియర్ గానే తోట త్రిమూర్తులు లెక్కల్లోకి వస్తారు. రాజకీయాల్లో స్పీడ్ గా వుండే ఆయనకు మంత్రి పదవి దక్కుతుందని గత క్యాబినెట్ విస్తరణలో ఆశించారు. కానీ నిరాశే ఎదురైంది. పార్టీలో కొనసాగుతున్నా నియోజకవర్గ రాజకీయాలు తప్ప జిల్లా రాజకీయాలపై తోట దృష్టి పెట్టడం మానేశారు. ఒకప్పుడు జిల్లా రాజకీయాల్లో తనదైన మార్క్ వేసుకున్న త్రిమూర్తులు లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడం వెనుక టీడీపీ లో తగిన ప్రాధాన్యం లేకపోవడమే అన్నది నియోజకవర్గ క్యాడర్ లో టాక్. పార్టీకి విధేయతగా వుండే రాజప్పకు ఉపముఖ్యమంత్రి, హోమ్ మంత్రి పదవులు కట్టబెట్టడంతో ఇక కాపు సామాజిక వర్గం నేతలపై దృష్టి పెట్టాలిసిన పనిలేకుండా చంద్రబాబు వ్యూహాత్మకంగా చేయగలిగారు. అదే తోట వంటి పలువురి నేతలను నిరాశ పరిచిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ పార్టీలో ముందుగానే ఒక కర్చీఫ్ ను త్రిమూర్తులు వేసి ఉంచినట్లు ఫ్లెక్సీల ద్వారా చెప్పకనే చెప్పినట్లు అయ్యింది.