Fri Nov 22 2024 09:38:23 GMT+0000 (Coordinated Universal Time)
మూడోసారి కేసీఆర్ మ్యాజిక్ పనిచేయునా ?
తెలంగాణాలో మూడో సారి ఎవరు విజయం సాధిస్తారని అడిగితే కెసిఆర్ అని బీఆర్ఎస్ నాయకులు
"నదీ ప్రవాహం... వొడ్డును
కోసేస్తూ విస్తరించినట్టు
శత్రువులను కూడా
క్రమ క్రమంగా
బలహీన పరచాలి..
దెబ్బ తెలియగూడదు
గాయం మానకూడదు."
-ఇదీ కేసీఆర్ వ్యూహం.
తమ పరిపాలనలో ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారని, 'పాజిటివ్' ఓటుకు డోకా లేదని అనుకున్నా జనాకర్శక పథకాల రూపకల్పన నిరంతరం జరుగుతూనే ఉంటుంది.కేసీఆర్ మెదడు, మందుగుండు సామగ్రికి చెందిన ఒక గోదాము.క్షిపణుల తయారీ కర్మాగారం.రాజకీయ ప్రత్యర్థులను చిత్తు చేయడానికి సంబంధించిన క్షిపణులు తయారవుతూనే ఉంటాయి.మీరు ఇదివరకు ఎందరో ముఖ్యమంత్రులను చూసి ఉండవచ్చు.కానీ కేసీఆర్ ను ఎవరితోనూ పోల్చలేము.ఎవరితోనూ పోలిక కుదరదు.ఆయన సిలబస్ వేరు.అది ఎవరి ఊహకూ అందనిది.ఎవరూ ముందుగా అంచనా వేయలేనిది.ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఎవరూ కోరలేదు.ఆర్టీసీకి ఉన్న ప్రభుత్వ బకాయిలను విడుదల చేయాలని మాత్రమే చాలాకాలంగా కార్మికులు కోరుతున్నారు.ఎవరో డిమాండ్ చేస్తేనో,మరెవరో ఒత్తిడి చేస్తేనో కేసీఆర్ నిర్ణయాలు తీసుకోరు.ఆయన తలచుకుంటేనే నిర్ణయాలు జరుగుతాయి.ఆయన తలచుకోకపోతే ఎన్నేండ్లయినా నిర్ణయం జరగదు.
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, అమలు చేస్తున్న కార్యక్రమాలు, కులాలు,వర్గాల వారీగా ప్రకటిస్తున్న వరాలు, పార్టీలోకి జరుగుతున్న చేరికలు వంటి అంశాలన్నీ బిఆర్ఎస్ లో ఒక ప్రక్రియగా కొనసాగుతూనే ఉంటాయి. వివిధ సర్వేల ద్వారా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరు, రాజకీయ పరిస్థితులపై కెసిఆర్ ఓ అంచనాకు వచ్చారు.ప్రత్యర్థి పార్టీల నుంచి ముఖ్యులపై వల వేసే ప్రక్రియ వేగం పుంజుకున్నది.తెలంగాణలో నవంబర్,డిసెంబర్ లలో ఎన్నికలు జరగనున్నవి.
తెలంగాణాలో మూడో సారి ఎవరు విజయం సాధిస్తారని అడిగితే కెసిఆర్ అని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు.ప్రతికూల వాతావరణం,ప్రజల్లో వ్యతిరేకత,అవతల కాంగ్రెస్ పుంజుకుంటుందన్న విషయం వంటి అంశాలపై ఎవరు ఎన్ని చెప్పినా ఏదో రకంగా కెసిఆర్ బిఆర్ఎస్ ను గెలిపిస్తారన్నది వారిధీమా.విజయమైనా,వైఫల్యమైనా కెసిఆర్ ఖాతాలోకే వెడతాయి.రెంటికీ ఆయనే బాధ్యుడు.ప్రాంతీయ రాజకీయపార్టీలలో ప్రజాస్వామ్యం కన్నా వ్యక్తి స్వామ్యం ఎక్కువగా నడుస్తుంది.వ్యక్తి పూజ,ఆరాధన జాతీయపార్తీల్లోనూ ఉన్నా ప్రాంతీయ పార్టీలలో దాని మోతాదు చాలా ఎక్కువ.తెలంగాణలో కెసిఆర్ కేంద్రంగానే పార్టీ కార్యకలాపాలు, ప్రభుత్వ పాలనా వ్యవహారాలూ నడుస్తున్నవి.రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేటీఆర్ ను పార్టీ వర్కింగు ప్రెసిడెంట్ పదవిని అప్పజెప్పి పాలనలో ఆయనకూ 'వాటా' ఇచ్ఛారు.
కెసిఆర్ వ్యూహమూ, ఎత్తుగడలపై అపరితమైన విశ్వాసం ఆ పార్టీ నాయకులకు ఉన్నది.రాష్ట్ర విభజన తర్వాత 2014 లో 119 అసెంబ్లీ స్థానాల్లో బిఆర్ఎస్ (టిఆర్ఎస్) అతి కష్టం మీద చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా 63 స్థానాలు గెలుచుకోగలిగింది.తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి తీసుకు వచ్చిన చాంపియన్ గా ప్రజల్లోకి వెళ్ళినా బొటాబొటీ సీట్లు ఎందుకోచ్చాయో కెసిఆర్ కు తెలుసు.అప్పటికి బిఆర్ఎస్ కంటూ 'సంప్రదాయ ఓటు బ్యాంకు' లేదు.అయితే తెలంగాణ, తెలంగాణేతర ప్రజల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొల్పడం కేసీఆర్ మొదటి విజయం.ఇక 63 సీట్లు గెలిచిన బిఆర్ఎస్ ఆ తర్వాత ఉపఎన్నికల్లో మరో రెండు గెలిచి 65 కు సంఖ్యాబలం పెంచుకున్నది.వివిధ పార్టీల నుంచి వచ్చిన శాసన సభ్యులు మరో 25 మందిని కలుపుకున్నది.ఎం.ఎల్.ఏ.ల సంఖ్య 90 కి పెంచేశారు.
మంత్రి హరీశ్రావు పార్టీలో ట్రబుల్ షూటర్ .ఏ సమస్య ముంచుకొచ్చినా పరిష్కరించడం కోసం కేసీఆర్, హరీశ్ను పంపించేవారు.బిఆర్ఎస్ లో హరీశ్ రావు బలమైన నేతగా గుర్తింపు తెచ్చుకున్నాడు.అయితే "అధికార పదవుల పోటీ"లో ఆయన అడ్డు వస్తారన్న ఆందోళన కేసీఆర్ కొడుకు,కూతురు లో కొన్నెండ్లు సాగింది.తర్వాత కుటుంబ సభ్యుల మధ ఒడంబడిక ఏదో జరిగి ఉంటుంది.అందువల్ల ఇటీవలికాలంలో కేటీఆర్,హరీశ్ రావు మధ్య 'స్నేహపూర్వక'పోటీ జరుగుతోంది.ఆధిపత్య పోరాటమేదీ లేదు.ఎవరి 'సరిహద్దుల్లో' వారు ఉంటూ కార్యకలాపాలను నడిపిస్తున్నారు.కాగా ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడినప్పటికీ దాన్ని తిప్పిగొట్టి సునాయాసంగా ఓట్లుగా మార్చగల మంత్రబలం కెసిఆర్ కు ఉందని ఆయన మద్దతుదారుల అభిప్రాయం.తెలంగాణ ప్రజలకు లాజిక్ అవసరం లేదని, మ్యాజిక్కు కావాలని కెసిఆర్ బలంగా నమ్ముతారు. ఓటర్లను పోలింగ్ బూత్ల వరకు తీసుకువెళ్లి ఓట్లు వేయించగల నిర్వాహక సామర్థ్యం బి ఆర్ఎస్ కు గతంలో లేదు.అలాంటి 'నెట్ వర్క్' గడచినా తొమ్మిది సంవత్సరాలలో ఏర్పడింది.
ఇబ్బడి ముబ్బడిగా లక్షల కోట్లతో అభివృద్ధి,సంక్షేమ పథకాల వెల్లువ సాగుతున్నందున అవి ఓట్లు గా మారతాయని ముఖ్యమంత్రి నమ్మినట్టే 2018 లో ఫలితాలు దాదాపు ఏకపక్షంగా వచ్చాయి.కింది స్థాయి ఓటరు తన పక్షాన ఉన్నట్టు కెసిఆర్ ద్రువీకరించుకున్నారు. 2028 ఫలితాల నాటికి బిఆర్ఎస్ కు సంప్రదాయ ఓటు బ్యాంకు ఏర్పడింది.ఆ వోటుబ్యాంక్ ను స్థిరపరచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఎంతమేరకు సానుకూల ఫలితాలను రాబడతాయో డిసెంబర్ కల్లా తేలిపోనుంది.అధికారంలో ఉన్నంత కాలం వాపు,బలంగానే కనిపిస్తుంది.కానీ అది నిజమైన బలం కాదు.కెసిఆర్ వ్యక్తిత్వం ఆయన స్వభావం వల్ల ఏర్పడింది. ఆయన 'మధ్యే మార్గం'లో పయనించే నేత కాదు.ఈ స్వభావమే విజయానికీ వైఫల్యానికీ ఆయనే బాధ్యుడుగా చేస్తున్నది. కెసిఆర్ ఏకఛత్రాధిపత్యం వల్ల వాతావరణం ఒక ఊపులా కన్పిస్తున్నా చివర వరకు వచ్చే సరికి ఒక పొంగులా చల్లారే ప్రమాదం కూడా లేకపోలేదు.
నిరుద్యోగుల మాటేమిటి? తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని లక్షలాది మంది నిరుద్యోగ విద్యావంతులు పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. ముఖ్యమంత్రి కేసిఆర్,కేటీఆర్,హరీశ్ రావు తదితర మంత్రులు చెబుతున్న లెక్కలకు,ఆచరణలో జరుగుతున్న దానికీ పొంతన లేదని కాంగ్రెస్,బీజేపీ విమర్శిస్తూనే ఉన్నవి.పూర్వాపరాలు,పర్యవసానాల గురించి ఎవరితో చర్చించకుండా తాను అనుకున్న నిర్ణయాలను మొండిగా అమలు చేయడం, వివిధ వ్యవస్థల్లో తనను ప్రశ్నించేవారు లేకుండా చూసుకోవడం, ఎవరినైనా నయానా భయానా లొంగదీసుకోవడం కెసిఆర్ నైజం.తెలంగాణలో ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడంలో కెసిఆర్ ప్రతిభాపాటవాలు అబ్బురపరుస్తూ ఉంటాయి.చాణక్యుడు,శకుని కలపోతగా కెసిఆర్ ను అభివర్ణించేవాళ్లు కూడా లేకపోలేదు.
పదవులు,ధనార్జన,అధికార దాహంతో అల్లాడిపోయే కాంగ్రెస్ పార్టీ నాయకులలో చాలా మంది కేసీఆర్ కు కోవర్టులుగా పనిచేయడంలో ఆశ్ఛర్యం ఏమున్నది?ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ లో కెసిఆర్ సమ ఉజ్జీ లేకపోవడం బిఆర్ఎస్ 'హ్యాట్రిక్' కు కలిసి వచ్చే అంశం.తమ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి కెసిఆర్, మీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?అని టి.ఆర్.ఎస్ నాయకులు ప్రశిస్తే కాంగ్రెస్ దగ్గర జవాబు ఉండదు.అది జాతీయపార్టీ.రాష్ట్ర స్థాయిలో సి.ఎం అభ్యర్థిని ముందుగానే ప్రకటించే సంప్రదాయం ఆ పార్టీ లో ఎప్పుడూ లేదు. 2004 లో అధికారం వచ్చే నాటికి సి.ఎం వై.ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీలో అందరూ మానసికంగా సిద్ధమయ్యారు.వై.ఎస్ వలె బలవంతుడు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ లేరు.తెలంగాణలో అంతో ఇంతో నయం.ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ పెర్ఫార్మెన్స్ బాగుంది.ఎపిలో చతికిలపడిపోయింది.
ఇదిలా ఉండగా బిఆర్ఎస్ సిట్టింగ్ ఎం.ఎల్.ఏ లలో చాలా మందిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తున్నది.అయితే వారిలో ఎంతమందిని మార్చగలరో,మార్చితే వచ్చే పర్యవసానాలు, ప్రకంపనలను ఇప్పుడే అంచనా వేయడం సాధ్యం కాదు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఫలితాల అనంతరం తెలంగాణలో పుంజుకున్నా,ఆశావహ పరిస్థితులు నెలకొన్నా ఆ పార్టీలో 'బహు నాయకత్వం' ఏళ్ల తరబడి కొనసాగుతున్న సమస్య.తనను కించపరుస్తున్నారని,బిఆర్ఎస్ లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా ప్రచారం చేస్తున్నారని ఈ ప్రచారం వెనుక 'కీలక' నాయకుడు ఉన్నట్టు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.ఆయన రేవంత్ రెడ్డిని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.'కేసీఆర్ తో ఉత్తమ్ కు డీల్ కుదిరింది.ఆయన చేరడం లాంఛనమే' అని బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు 'తెలుగు పోస్టు' కు చెప్పారు.తన పేరు వెల్లడించరాదని ఆయన విజ్ఞప్తి చేశారు.
(Views, thoughts, and opinions expressed in this news story/article belong solely to the author)
Next Story