బ్రేక్ చేస్తారా.. లొంగిపోతారా..!
ఎన్నికలు వస్తున్నాయంటేనే నేతల్లో తెలియని గుబులు మొదలవుతుంది. మరీ ముఖ్యంగా నేతలను 'సెంటిమెంట్' వెంటాడుతుంటుంది. ఒక్కోసారి విజయానికి దారితీస్తే.. మరోసారి అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఏ పనిలోనైనా మంచి, చెడు ఉన్నట్టే.. ఇందులోనూ గుడ్, బ్యాడ్ ఉంటుంది. తమ గెలుపుపై ధీమాగా ఉన్నా.. లోపల మాత్రం ఇది వేధిస్తూనే ఉంటుంది. ఎవరికో అదృష్టం కలిసి వస్తే తప్ప.. ఈ సెంటిమెంట్‌ను అధిగమించడం కష్టం. ప్రస్తుతం గుంటూరు జిల్లాలోని ఇద్దరు టీడీపీ నాయకులను ఈ ' బ్యాడ్ సెంటిమెంట్' వెంటాడుతోంది. దీనిని అధిగమించిన వారిని గుర్తుచేసుకుని.. వారి అదృష్టం తమకు ఈసారి కలిసి వస్తుందేమోనని ఆశ పడుతున్నారు. స్పీకర్‌గా చేసిన వారు మళ్లీ విజయాన్ని సాధించకపోవడం ఒకటైతే డబుల్ హ్యాట్రిక్ అనేది అందని ద్రాక్షలా ఉండిపోవడం మరొకటి. ప్రస్తుతం స్పీకర్ శివప్రసాద్, మరో నేత ధూళిపాళ్ల నరేంద్ర.. ఈ బ్యాడ్ సెంటిమెంట్‌ను ఎలా బ్రేక్ చేస్తారనే ఆందోళన వీరి అనుచరులను తీవ్రంగా వేధిస్తోంది.
కోడెలకు పనిచేస్తుందా?
ప్రస్తుతం స్పీకర్‌గా కోడెల శివప్రసాదరావు వ్యవహరిస్తున్నారు. నర్సరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో బలమైన ఓటర్లు ఉన్నారు. స్వపక్షీయుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన సెంటిమెంట్‌తో కూడిన ఎన్నికల్లో పోటీ చేస్తుండడంతో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆయన వర్గీయుల్లో ఆందోళన మొదలైంది. గతంలో సెంటిమెంట్ ఎదురయి ఓడిపోతే ఓడిపోవచ్చు. ఈసారి ఆ పరిస్థితి లేదని సత్తెనపల్లి నాయకులు, కార్యకర్తలు చెబుతున్నారు. అసెంబ్లీ స్పీకర్ పదవి నిర్వహించిన వారిలో యనమల రామకృష్ణుడు ఒక్కరే విజయం సాధించగలిగారు. ఆయన మినహా స్పీకర్‌గా పనిచేసిన మిగిలిన వారు ఎన్నికల్లో ఓడిపోవడమో లేదా ? రాజకీయంగా తెరమరుగు అయిపోవడమో ? జరిగింది. ఇక యనమలకు ఆయనకు పనిచేయని విధంగానే స్పీకర్ సెంటిమెంట్ కోడెలకు పనిచేయదని ఆయన అనుచరులు ధీమాగా చెబుతున్నారు. ఇక్కడ వైసీపీ ఓట్లలో చీలిక వస్తేనే కోడెల గెలుపు ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక కోడెల ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న సత్తెనపల్లిలో పోటీ చేస్తారా ? లేదా ? తన పాత నియోజకవర్గం అయిన నరసారావుపేటకు వెళతారా ? అన్నది చూడాలి.
ఆరోసారి మాత్రం......
ఇక గుంటూరు జిల్లా రాజకీయ చరిత్రలో హ్యాట్రిక్ సాధించిన నాయకులున్నా.. డబుల్‌హ్యాట్రిక్ సాధించిన వారు ఎవరూ లేరు. మాజీ మంత్రులు మాకినేని పెదరత్తయ్య, కోడెల శివప్రసాద్‌లు ఒకే నియోజకవర్గం నుంచి ఐదుసార్లు విజయం సాధించారు. ఆరోసారి మాత్రం బోర్లా పడ్డారు. 1989లో పెదకూరపాడు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ 1994, 1999లో గెలుపొంది హ్యాట్రిక్ సాధించినా ఐదవ సారి గుంటూరు నుంచి పోటీ చేసి గెలుపొందారు. కానీ 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. సెంటిమెంట్ ప్రభావం బాగా ఉన్న నేపథ్యంలో 1994, 1999, 2004, 2009, 2014 వరుసగా ఐదుసార్లు విజయం సాధించిన ధూళ్లిపాళ్ల నరేంద్ర ఆ సెంటిమెంట్‌ను అధిగమిస్తారా? అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది.
బలమైన సెంటిమెంట్ ఉండటంతో.......
పొన్నూరు నియోజకవర్గంలో వైసీపీకి ఓటర్లు ఉన్నప్పటికీ బలమైన నాయకత్వ లోపం ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యే నరేంద్రను ఢీ కొట్టి విజయం సాధించగలరా అన్న ప్రశ్న స్థానిక నాయకులు వేస్తున్నారు. ఆరోసారి పోటీచేసిన రత్తయ్య గెలుస్తారని ఆయన అనుచరులు పండుగ చేసుకున్నారు. అవలీలగా కాకున్నా అప్పటి వరకు ఎవరికీ తెలియని.. అనామకుడైన రావి వెంకటరమణ విజయం సాధించి సంచలనం సృష్టించారు. అదే రావి వెంకటరమరణపై పొన్నూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఆయనే రంగంలో ఉండబోతున్నారు. మరి బలమైన సెంటిమెంట్ అనుభవానికి ఎదురీది స్పీకర్ కోడెల, ఎమ్మెల్యే నరేంద్ర విజయం సాధిస్తారో లేదో వేచి చూడాల్సిందే!
- Tags
- andhra pradesh
- ap politics
- dhulipalla narendra
- guntur district
- janasena party
- kodela sivaprasadarao
- makineni pedarathaiah
- nara chandrababu naidu
- pawan kalyan
- ponnuru constiuency
- speaker
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- కోడెల శివప్రసాదరావు
- గుంటూరు జిల్లా
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- ధూళ్లిపాళ్ల నరేంద్ర
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- పొన్నూరు నియోజకవర్గం
- మాకినేని పెద్దరత్తయ్య
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
- స్పీకర్