రెండు టీడీపీ బిగ్ వికెట్లు అవుట్... వైసీపీలోకి జంపేనా..??
ఏపీలో ఎన్నికల వేడి ప్రారంభం అవ్వడంతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమకు పార్టీ ముఖ్యం కాదు.. సీటే ముఖ్యం అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలవకపోతే తమకు రాజకీయ భవిష్యత్తు లేదని డిసైడ్ అయిన వారు సీటు కోసం తాము పెట్టే ఖర్చు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఏపీలో విపక్ష వైసీపీ నుంచి అధికార టీడీపీలోకి భారీ ఎత్తున ఎమ్మెల్యేలు జంప్ చేసేశారు. ఈ క్రమంలోనే అక్కడ గత ఎన్నికల్లో ఈ ఎమ్మెల్యేలపై పోటీ చేసి ఓడిపోయిన నియోజకవర్గ ఇన్చార్జులకు, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మధ్య సీటు విషయంలో పోటీ తప్పేలా లేదు. వీరిలో ఎవరు వెనక్కి తగ్గడం లేదు. జమ్మలమడుగు, అద్దంకి లాంటి నియోజకవర్గాల్లో అయితే పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఈ నియోజకవర్గాల్లో టీడీపీలో పొలిటికల్‌గా హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
కరణం వారసుడికి....??
వచ్చే ఎన్నికల్లో టీడీపీలో సీట్లు దక్కవని డిసైడ్ అయిన వారు, టీడీపీలో ఉన్నా పరిస్థితులు తమకు అనుకూలంగా లేవని భావిస్తున్న వారు వైసీపీ కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నట్టే తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లాలోనే ఇద్దరు టీడీపీ సీనియర్లు టీడీపీలో పరిణామాలు తమకు అనుకూలించకపోతే వైసీపీ వైపు చూస్తునట్టు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాలో చంద్రబాబు తన తాజా పర్యటనలో అద్దంకి నియోజకవర్గంలో పోటీ చేసేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. చంద్రబాబు, రవికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కరణం వెంకటేష్‌కు ఇప్పుడు ఆప్షన్ లేకుండా పోయింది. అదే జిల్లా నుంచి మంత్రిగా ఉన్న శిద్ధా రాఘవరావు నరసారావుపేట నుంచి పార్లమెంటుకు పోటీ చెయ్యాలని అనుకుంటున్నారు. శిద్ధా పార్లమెంటుకు పోటీ చేస్తే కరణంకు దర్శి ఆప్షన్ ఉంటుంది లేని పక్షంలో కరణం వారసుడి పోటీకి సీటు లేనట్టే అవుతోంది.
బాలినేనితో సమావేశం....
ఇటీవల కరణం వెంకటేష్ ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఓ ఫంక్షన్లో సమావేశమై చర్చలు జరిపినట్టు తెలస్తోంది. ఈ చర్చల్లో వీరిద్దరి మధ్య ఏం జరిగింది అన్నది బయటకు రాకపోయినా ఈ కలయిక తర్వాత ఎప్పటి నుంచో కరణం ఫ్యామిలీ వైసీపీలోకి వెళ్లిపోతారన్న వార్తలకు మరింత బలం చేకూర్చినట్లు అయ్యింది. పార్టీ మారితే కరణంకు అద్దంకి సీటుపై స్పష్టమైన హామీ వచ్చేసిందట. అదే టైమ్‌లో ప్రకాశం జిల్లాకు చెందిన మరో సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి సైతం కాస్త అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికే మాగుంటను జిల్లాలో ఉన్న టీడీపీ నాయకులు పక్కన పెట్టారు. కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగిన ఆయనకు ఇప్పుడు టీడీపీలో ఆనుకున్న స్థాయిలో ప్రయార్టి అయితే ఉండడం లేదు.
అభ్యర్థుల ఎంపికపై.....
గత ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా టీడీపీ నుంచి పోటీ చేసి 13 వేల స్వల్ప ఓట్ల తేడాతో వైవీ. సుబ్బారెడ్డి చేతిలో ఆయన ఓడిపోయారు. అయితే మళ్ళీ ఒంగోలు నుంచి ఎంపీగా పోటీకి రెడీ అవుతున్న ఆయనకు సానుకూల వాతావరణం అయితే కనపడడం లేదు. ఒంగోలు పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే ఏడుగురు అభ్యర్థుల ఎంపిక విషయంలో మాగుంటకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయని... వాటిని అధిష్టానం ఆమోదించే ప్రసక్తే లేదని తెలుస్తోంది. తాను సూచించిన అభ్యర్థులు కాకుండా వేరే అభ్యర్థులకు సీటు ఇస్తే ఆ ప్రభావం ఒంగోలు ఎంపీ సీటుపై పడి తాను ఓడిపోతానని మాగుంట తన సన్నిహితుల వద్ద చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో ఎంపీగా పోటీ చేసేందుకు మళ్లీ తాను కోట్లు ఖర్చు పెట్టినా ఉపయోగం లేదన్న నిర్ణయంతో ఆయన ఉన్నారు.
రెండు నియోజకవర్గాల్లోనే.....
ప్రస్తుతం ఒంగోలు పార్లమెంటు పరిదిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఒంగోలు, దర్శి నియోజకవర్గాల్లో మాత్రమే పార్టీ పరిస్థితి బాగుందని ఇక్కడ పార్టీ అభ్యర్థులు గెలుస్తారని మాగుంట భావిస్తున్నారట. మిగిలిన నియోజకవర్గాలైన మార్కాపురం, కొండపి, ఎర్రగొండపాలెం, కనిగిరి నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఘోరంగా ఉందని మాగుంట భావిస్తున్నారు. గిద్దలూరుపై కూడా మాగుంట ఓ మోస్తరు సంతృప్తితోనే ఉన్నారని టాక్. ఈ క్రమంలోనే కొండపి, మార్కాపురం, కనిగిరి, ఎర్రగొండపాలెం ఈ నాలుగు చోట్ల అభ్యర్థులను మార్చాలని మాగుంట సూచిస్తున్నారు. అయితే ఆయన చెప్పినట్టు ఈ నాలుగు చోట్ల అభ్యర్థులను మార్చేందుకు అధిష్టానం సిద్ధంగా లేదని తెలుస్తోంది. పార్టీ తనకు నచ్చిన వారికి టిక్కెట్లు ఇచ్చుకుంటే ఆ బలహీన అభ్యర్థులతో ఆ ప్రభావం ఒంగోలు ఎంపీ సీటుపై పడి మరో సారి తాను ఓడిపోతానని మాగుంట భావిస్తున్నారు.
ఎందుకీ తలనొప్పి అని....
గత ఎన్నికల్లో మాగుంట ఎంత టఫ్ ఫైట్ ఇచ్చినా 13 వేల తేడాతో ఓడిపోయారు. ఎర్రగొండపాలెం లాంటి నియోజకవర్గాల్లో వైసీపీకి వచ్చిన భారీ మెజారిటీతోనే మాగుంట ఓడిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు అదే పరిస్థితులు పునరావృతం అయ్యే చాన్సులు ఉన్నాయి. ఈ క్రమంలోనే మాగుంట ఏకంగా నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పుకు పట్టుపడుతున్నారు. ఒకటి, రెండు నియోజకవర్గాల్లో సంగతి ఎలా ఉన్నా ఏకంగా ఆయన చెప్పినట్టు నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చేందుకు చంద్రబాబు సైతం సుముఖంగా లేరని తెలిసింది. మాగుంటకు బాబు ప్రయార్టీ వరకు ఇస్తున్నా ఆయన చెప్పినట్టు సీట్లు మార్చే పరిస్థితి లేదు. ఈ క్రమంలోనే మాగుంట సైతం ఈ తలనొప్పులు పడడం కన్నా వైసీపీలో చేరితే అక్కడ గ్యారెంటీగా తనకు ఎంపీ సీటుపై హామీ ఉందని తాను సులువుగా గెలవ వచ్చని భావిస్తున్నారట. టీడీపీలో ఏదైనా తేడా జరిగిన పక్షంలో వైసీపీలోకి వెళ్లేందుకు ఇప్పటికే ఆయన మానసికంగా సిద్ధం అయ్యారని తెలుస్తుంది. ఏదేమైనా ప్రకాశం జిల్లాలో ఇద్దరు టీడీపీ సీనియర్ల చూపులు వైసీపీ వైపు ఉండడం రాజకీయంగా కాస్త హాట్ హాట్‌గానే మారింది.
- Tags
- andhra pradesh
- ap politics
- balineni srinivasulureddy
- janasena party
- karanam balaram
- magunta srinivasulureddy
- nara chandrababu naidu
- pawan kalyan
- prakasam district
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- కరణం బలరాం
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- ప్రకాశం జిల్లా
- బాలినేని శ్రీనివాసులురెడ్డి
- మాగుంట శ్రీనివాసులురెడ్డి
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ