Sun Dec 22 2024 20:11:20 GMT+0000 (Coordinated Universal Time)
ముగ్గురి తాకిడి ఉక్కిరిబిక్కిరి..
మొన్న మార్చి నెల చివరి వరకూ అమరావతి భూముల చుట్టూ మాత్రమే ఉద్యమాలు చేసిన టీడీపి ఒక స్టేజ్‌లో నీరసించిపోయింది. "ఇదేం ఖర్మరా బాబు మా రాష్ట్రానికి" ఇంకొకటి ఏదో ఇంతే పెద్ద చాంతాడంత పేరుతో రెండు క్యాంపేయిన్లు చేసింది.
మొన్న మార్చి నెల చివరి వరకూ అమరావతి భూముల చుట్టూ మాత్రమే ఉద్యమాలు చేసిన టీడీపి ఒక స్టేజ్‌లో నీరసించిపోయింది. "ఇదేం ఖర్మరా బాబు మా రాష్ట్రానికి" ఇంకొకటి ఏదో ఇంతే పెద్ద చాంతాడంత పేరుతో రెండు క్యాంపేయిన్లు చేసింది. అవి కూడా లాభం చేకూర్చలేకపోయాయి. ఏప్రిల్ నెలలో ఓ కొత్త స్ట్రేటిజిస్ట్ (పేరు అడగకండి. చెప్పలేను, చెప్పకూడదు) ఇచ్చిన సలహాతో వందలరోజుల అమరావతి ఉద్యమానికి ఉద్వాసన పలికి.. మూడు కోణాల కొత్త వ్యూహాన్ని రచించుకున్నారు తెలుగుదేశం పార్టీవాళ్ళు. అందులో భాగంగా నారా లోకేశ్ లీడ్‌గా "యువగళం", పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఉధృత "వారాహి యాత్ర", చంద్రబాబు గారి అడపాదడపా బహిరంగ సభలు రూపొందుకుతున్నాయి. ఒక్కసారిగా ఊపందుకున్నాయి.
అప్పుడు మొదలైంది ప్రభుత్వం పై ప్రతిపక్షాల అసలు సిసలు తాకిడి. ఉత్తరాంధ్ర, పల్నాడు, రాయలసీమల్లో ప్రత్యేక యాత్రలు, ర్యాలీలూ తీస్తూ ఒక్కోచోట ఒక్కో కాంట్రవర్సీని రూపొందించగలిగింది జనసేన, టీడీపి మైత్రి కూటమి. వాలంటీర్ వ్యవస్థను మొదలుకొని, రోడ్లు, నిరుద్యోగం, అరాచక పాలన అంటూ ప్రభుత్వాన్ని (జగన్‌ని) అటాక్ చేయడం మొదలుపెట్టాయి. అప్పటివరకూ కేవలం అమరావతి రైతుల పాదయాత్రలకే పరిమితమైన ప్రతిపక్షాల కొత్త వ్యూహాన్ని జగన్ అర్ధం చేసుకునేలోపే వాళ్ళ ట్రాప్‌లో పడిపోయారు. పవన్ కళ్యాణ్ రేకెత్తించిన వాలంటీర్ వ్యవస్థ రాద్దాంతం.. జగన్‌ని మొట్టమొదటిసారి ప్రతిపక్షాలని ఉద్దేశించి రియాక్ట్ అయ్యేలా చేసింది. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ పై జగన్ స్పందించేలా చేసింది. అది మొదలు లోకేశ్, చంద్రబాబులు కూడా తమ తమ యాత్రలలో ఏదో ఒక రాద్దాంతానికి దారితీస్తూ కొనసాగారు. ఒక కాంట్రవర్సీ నుంచి తేరుకుని డ్యామేజ్ కంట్రోల్ చేసుకుని ఊపిరి పీల్చుకునేలోపే మరో గొడవ తెరమీదకి పునారవృతం చేస్తూ జగన్‌ని కంటిన్యుయస్‌గా ఇరిటేట్ చేయగలిగారు ఆ ముగ్గురూ. మూడు నెలల ఈ త్రికోణ వ్యూహం.. టీడీపి క్యాడర్లో నూతనోత్సాహాన్ని తీస్కునిరావడమే కాకుండా.. వచ్చే ఎన్నికలలో అధికారాన్ని తిరిగి దక్కించుకుంటారనే నమ్మకాన్ని కూడా పెంపొందించగలిగింది.
సరిగ్గా అలాంటి సమయంలో అరెస్ట్ అయ్యారు చంద్రబాబు నాయుడు..
చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవడం వల్ల పార్టీ మీద, అతని మీద ఒక్కసారిగా సింపతీ క్రియేట్ అయింది. ఇది అనుకోకుండా చంద్రబాబుకు కలిసివచ్చిన అంశమనే చెప్పుకోవాలి. 73వ ఏట ఓ పెద్దమనిషిని అలా చేయడం సరికాదేమో అని జనం కూడా జాలీ చూపడం కనిపించింది. ఈ సడెన్ ఎమోషన్ టీడీపికి ఓ మోస్తరు ఓట్ బ్యాంక్‌ని కూడా పెంచిందనే చెప్పుకోవాలి.
సరిగ్గా ఈ సమయంలో..
స్కిల్ డెవలప్మెంట్ నిధుల స్కామ్‌లో అరెస్ట్ అయిన చంద్రబాబు ఎప్పుడు బయటికి వస్తారో అనే సందిగ్ధత ఆ పార్టీ వర్గాల్లో నెలకొంది. దశాబ్దాల కాలంగా పార్టీ వ్యవహారాలు, కార్యకలాపాలు, అడ్మినిస్ట్రేషన్, ఎలక్షన్ స్ట్రేటజీలు గట్రా అన్నీ తానై నడిపించిన చంద్రబాబు ఇప్పుడు జైల్లో ఉండటంతో.. బయట అందరి చేతులూ కట్టేసినట్టయింది. విజనరీ లీడర్, విజనరీ లీడర్ అనిపించుకున్న బాబు గారు ఒకవేళ తను లోపలికి వెళ్తే ప్లాన్ బీ ఏంటి అనేది ఎప్పుడూ రాసుకోలేదు అనిపిస్తోంది. ఎన్నికలకి ఇంకా చాలా నెలల గడువు ఉంది కాబట్టి.. ఈ అరెస్ట్ తాలూకా ఎమోషన్ అన్ని రోజుల వరకూ సాగదు. చంద్రబాబు గారు ఎప్పుడు బయటికి వస్తారో క్లారిటీ లేదు. ఒకవేళ పద్నాలుగు రోజుల తర్వాత బయటికి వస్తారు అనుకున్నా.. ప్రస్తుతం ఏర్పడ్డ సింపతీని ఎన్నికల వరకూ కొనసాగించగలుగుతారా అనేది కూడా సందేహమే!
ఇదంతా ఇలా ఉంటే.. నిన్న జైల్లో చంద్రబాబు గారిని కలిసి వచ్చిన పవన్ కళ్యాణ్.. టీడీపితో పొత్తుతో ఎన్నికలకి పోతున్నాము, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చే సమస్యే లేదు. రాష్ట్రంలో మా ఇద్దరి భవిష్యత్తు కాదు.. ముందు ప్రజల భవిష్యత్ మాకు ముఖ్యం అంటూ జైల్ బయటే తేల్చి చెప్పేశాడు. ఏయ్ జగన్.. ఇప్పుడు కాస్కో, ఏం చేగగలుగుతావో ట్రై చేయ్ అంటూ సవాల్ కూడా విసిరాడు. పవన్ కళ్యాణ్‌కు అటూఇటూ నిలబడ్డ నారా లోకేశ్, నందమూరి బాలకృష్ణలు ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా మారారు అనడానికి ఇంతకన్నా నిదర్శనం అవసరం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బెయిల్ పై బయటికి వచ్చినా కూడా టీడీపిలో జోష్ కొనసాగాలంటే జనసేన తోడు ఉండాల్సిందే అనే పరిస్థితులు నెలకొన్నాయి. పదేళ్ళ రాజకీయ ప్రస్థానంలో పవన్ కళ్యాణ్ ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న ట్రంప్‌కార్డ్ ఫ్యాక్డర్ అతనికి అకస్మాత్తుగా ఎదురైంది. వెతుకుతున్న తీగ కాలికి తగిలినట్టు.. ఇన్నేళ్ళు పొత్తులో కేవలం అవతలి వాళ్ళ ఆఫర్‌ను సమ్మతిస్తూ వచ్చిన పవన్.. ఇవాళ తన మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ధైర్యం కల్పిస్తున్నారు. 2019లో టీడీపి ఓడిన చాలా స్థానాల్లో జనసేన ఓట్లు కీలకంగా చీలాయి. ఆ స్థానాలు ఈసారి ఖచ్చితంగా మైత్రి కూటమి సొంతం చేసుకుంటుంది అనిపిస్తోంది. ఈ విషయంలో ఆ రెండు పార్టీలకు ఎదురయ్యే సమస్య ఏ పార్టీ అభ్యర్థి ఎక్కడినుంచి పోటీ చేయాలి అని. ఈ విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఓ అండర్‌స్టాండింగ్‌కి వస్తే ఆ రెండు పార్డీల క్యాడర్లూ ముందునుంచే సంయమనంగా సాగే పరిస్థితులు ఏర్పడతాయి. అధికారం మనకే దక్కుతుందన్న ముందస్తు యాంగ్జైటీ ఏమైనా రేగితే మాత్రం.. ఇటు పవన్ కళ్యాణ్‌కు అటు చంద్రబాబు నాయుడు గారికీ ఇలాంటి మంచి తరుణం మరో పదేళ్ళలో మరోసారి లభించదు అనుకోవచ్చు.
ప్రతిపక్షాల త్రికోణ వ్యూహాన్ని ఛేదించలేకపోయిన ఏపీ సీఎం.. కనీసం ఇకముందైనా అడ్వైజర్ల సలహాలు కన్సిడర్ చేయగలిగితే.. గత నాలుగు నెలల్లో చవిచూసిన పెయిన్ నుంచి తప్పించుకోగలుగుతారు. మూడు రాజధానుల ఆంధ్రప్రదేశ్ అంటూ కొన్నాళ్ళు సతాయించి.. కోర్డ్‌లో అందుకు అనుమతి లభించకపోతే అమరావతి భూములను రైతులకు పంచేస్తానని ప్రతిపక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన జగన్.. ఆ తర్వాత అటువంటి మరో స్ట్రేటజీని రూపొందించలేకపోయారు. దాదాపు రెండున్నరేళ్ళ పాటు అమరావతికే పరిమితమైన ప్రతిపక్షం.. అతనిని ట్రాప్‌లోనే కొనసాగింది. లక్కీగా కొత్త వ్యూహాన్ని స్వాగతించడంతో.. ఆంధ్రప్రదేశ్‌లో అనుకోని రాజకీయ అనిశ్చితి నెలకొంది.
Next Story