రాములమ్మ ఇక సైడ్ అయినట్లేనా..?
తెలంగాణ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బకు ఇక్కడి కాంగ్రస్ నేతలు ఇంకా తేరుకోలేకపోతున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి చేదు ఫలితాలే మిగిలాయి. అయితే, కాంగ్రెస్ అధిష్ఠానం కూడా గతంలో ఎన్నడూ లేనంతగా తెలంగాణ ఎన్నికలపై కసరత్తు చేసింది. ఇంచుమించు అందరు సీనియర్ నేతలకు ప్రాతినిథ్యం కల్పిస్తూ కమిటీలను ఏర్పాటు చేసింది. ఇక, ప్రజలను ఆకట్టుకోవడానికి స్టార్ క్యాంపెయినర్ గా విజయశాంతిని నియమించింది పార్టీ. వాస్తవానికి, విజయశాంతి 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఎప్పుడు యాక్టీవ్ గా రాజకీయాల్లో లేరు. అయినా, ఎన్నికల వేళ పార్టీ ఆమెను తీసుకువచ్చి స్టార్ క్యాంపెయినర్ గా నియమించింది. ఆమె పార్టీ అప్పగించిన బాధ్యతలు నెరవేర్చేందుకు చాలానే కష్టపడ్డారు.
తాను పోటీ చేయకుండా ప్రచారం చేసినా...
స్టార్ క్యాంపెయినర్ గా విజయశాంతి కాంగ్రెస్ తరుపున బాగానే ప్రచారం చేశారు. ఆమె స్వయంగా పోటీ చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా ఏ కాంగ్రెస్ అభ్యర్థి పిలిచినా ఆమె వెళ్లి ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ పై అన్నా.. దొరా.. అంటూ ‘ఒసేయ్ రాములమ్మ’ సినిమా రేంజ్ లో డైలాగ్ లు చెప్పారు. మొత్తానికి ఆమెపై పార్టీ పెట్టిన బాధ్యతను మాత్రం సంపూర్ణంగానే నిర్వర్తించారు. కానీ, టీఆర్ఎస్ హవా ముందు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రచారమే పనిచేయలేదు... ఇక విజయశాంతి ప్రచారం కూడా అదే పరిస్థితి. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఓడింది. అయితే, విజయశాంతి తర్వాత స్టెప్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఆమె ఇప్పటి నుంచైనా యాక్టీవ్ పాలిటిక్స్ లో ఉంటారా లేదా మళ్లీ సైలెన్స్ అవుతారా అన్న ప్రశ్న పార్టీ క్యాడర్ లో తలెత్తుతుంది. ఆమె క్రియాశీలకంగా పార్టీలో పనిచేస్తే పార్టీకి మేలు జరిగే అవకాశం ఉంటుందని కొందరి భావన.
టీడీపీతో పొత్తును వ్యతిరేకించినా...
అయితే, పార్టీ వైఖరి పట్ల విజయశాంతి తీవ్రంగా అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. ముఖ్యంగా, తెలుగుదేశం పార్టీతో పొత్తును ఆమె మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందని ఆమె ఎన్నికల ముందే పార్టీ దృష్టికి తీసుకుపోయారట. అయినా, పార్టీ వినలేదు. దీంతో విజయశాంతి అనుమానించిందే కరెక్ట్ అయ్యింది. టీడీపీతో పొత్తు కాంగ్రెస్ విజయావకాశాలను కొంతమేర దెబ్బతీసింది. ఇక, ఎన్నికల సమయంలోనూ తనకు పార్టీ రాష్ట్ర నాయకత్వం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదనేది ఆమె భావన. తన ప్రచారానికి సహకరించలేదని, పూర్తి స్థాయిలో ప్రచారానికి అవకాశం కూడా లభించలేదని ఆమె అసంతృప్తితో ఉన్నారు.
ఇప్పటి నుంచైనా యాక్టీవ్ అవుతారా..?
ఇక మెదక్ జిల్లాలోని రెండు టిక్కెట్ల విషయంలోనూ ఆమె మాట నెగ్గలేదని బాధపడుతున్నారు. ఎన్నికల వేళ పార్టీ ప్రచురించిన ప్రకటనల్లోనూ ఆమె ఫోటో లేకపోవడంపై ఆమె బాహాటంగానే విమర్శలు గుప్పించారు. ‘తల్లి తెలంగాణ’ పార్టీ పెట్టి తెలంగాణ కోసం ఉద్యమించి, అనంతరం టీఆర్ఎస్ లో నెంబర్ 2 గా కొనసాగిన విజయశాంతికి కాంగ్రెస్ లో మాత్రం ఇంతకాలం తగిన ప్రాధాన్యత కరువైంది. ఇప్పటికి పార్టీ ఆమెను గుర్తించింది. మరి, ఓటమి భారంతో మళ్లీ ఇంతకుముందులా ఆమె సైలెన్స్ అవుతారా లేదా యాక్టీవ్ పాలిటిక్స్ లో ఉంటారో చూడాలి.