Mon Dec 23 2024 04:01:11 GMT+0000 (Coordinated Universal Time)
Kesineni Nani : మౌనంగా మాత్రం ఉండరట... మోత మోగించడం ఖాయమట
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని పార్టీలో మరింత రెబెల్ గా మారుతున్నట్లే కనిపిస్తుంది
ఎన్నికల సమయంలో ఏ పార్టీ కూడా అంత కూల్‌గా ఉండలేదు. ఏ పార్టీలోనైనా టిక్కెట్ల విషయంలో అసంతృప్తులు తప్పవు. అదీ అధికార పార్టీ కావచ్చు. ప్రతిపక్షం కావచ్చు. గెలుస్తామన్న నమ్మకం కుదిరితే చాలు సీటు విషయంలో తమ పేరు ప్రకటించే వరకూ ఎవరైనా వెయిట్ చేస్తారు. వస్తే ఓకే. లేకుంటే.. పార్టీ అధినాయకత్వంపై తిరగబడతారు. అది ఏ పార్టీలోనైనా కామన్ విషయమే. ఇప్పుడు ఏపీలో వైసీపీలో టిక్కెట్లు కన్ఫర్మ్ చేస్తున్న వేళ అనేక అసంతృప్తులు బయటపడుతున్నాయి. కొందరు సర్దుకుని వెళుతుండగా మరికొందరు మాత్రం పార్టీని వీడి వేరే పార్టీలో చేరేందుకు సిద్ధపడుతున్నారు. తమతో పాటు తమ క్యాడర్ ను కూడా తీసుకెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.
బెజవాడ ఎంపీ సీటు...
ఇందులో తెలుగుదేశం పార్టీకి కూడా మినహాయింపు కాదు. ఏపీ శాసనసభతో పాటు లోక్‌సభ ఎన్నికలు కలసి జరుగుతాయి. అయితే ఈసారి టీడీపీకి అనుకూల వాతావరణం ఉందని భావిస్తున్న నేతలు టిక్కెట్లను తాము సాధించుకునేందుకు తెగించి పోరాడుతున్నారు. విజయవాడ పార్లమెంటు సీటు ఇప్పుడు హాట్ సీటుగా మారింది. అక్కడి నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న కేశినేని నానికి ఈసారి టిక్కెట్ దక్కుతుందా? లేదా? అన్న అంశంపై గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. కేశినేని నాని సోదరుడు చిన్నికి ఈసారి విజయవాడ పార్లమెంటు స్థానం టిక్కెట్ దక్కుతుందని కూడా అంచనాలు ఉన్నాయి. చిన్నికి లోకేష్ ఆశీస్సులు పుష్కలంగా ఉండటంతో కేశినేని నానికి ఈసారి టిక్కెట్ అనుమానమేనన్న టాక్ మాత్రం బెజవాడ టీడీపీలో ఉంది.
రెండుసార్లు ఎన్నికై...
కేశినేని నాని రెండుసార్లు విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. రెండు సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఆయన విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో మూడు పార్లమెంటు స్థానాలు గెలిస్తే అందులో విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం ఒకటి. కేశినేని నాని సొంత బలంతో పాటు విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో సైకిల్ పార్టీ బలంగా ఉండటం కూడా మరో రీజన్ అని చెప్పాలి. అయితే రెండోసారి ఎంపీ అయిన తర్వాత పార్టీ అధినాయకత్వానికి కేశినేని నానికి మధ్య కొద్దిగా కాదు.. చాలా గ్యాప్ వచ్చిందనే చెప్పాలి. పెద్దగా అధినాయకత్వాన్ని పట్టించుకోరన్న పేరుంది. అయితే అదే సమయంలో చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల సమయంలో కేశినేని నాని కుమార్తె పేరును మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు.
ఎంపీ ల్యాడ్స్ నిధులను...
కానీ కేశినేని నాని తన నియోజకవర్గం పరిధిలోని శాసనసభ స్థానాల్లో సొంత గ్రూపులను ఏర్పాటు చేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. కొన్ని చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా ఎంపీ ల్యాడ్స్ నిధులను విడుదల చేస్తుండటం పార్టీలో చర్చనీయాంశమైంది. అప్పుడప్పుడు కేశినేని నాని పార్టీపై చేసే విమర్శలు కూడా ఆయనను రాజకీయంగా ఇబ్బందుల్లోకి నెట్టాయనే చెప్పాలి. తన సోదరుడిని తనకు పోటీగా పార్టీలో ఎదిగేలా ప్రోత్సహించడాన్ని నాని జీర్ణించుకోలేకనే విమర్శలు చేశారన్న వాదన కూడా ఉంది. మొత్తం మీద కేశినేని నానికి టిక్కెట్ ఇవ్వకపోతే ఆయన పార్టీకి తలనొప్పిగా మారే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఆయన మౌనంగా ఉండే నేత కాదు. పార్టీ లోగుట్టును మరీ బయటపెట్టడంలో సమర్థుడు. గతంలో ప్రజారాజ్యంలోనూ నాని చేసిన పనిని కొందరు ఈ సందర్భంగా ఉదహరిస్తున్నారు. మొత్తం మీద బెజవాడ టీడీపీలో కేశినేని నాని వ్యవహారం మాత్రం పార్టీలోనే కాదు రాజకీయంగా కూడా చర్చనీయాంశమైంది.
Next Story