Mon Nov 18 2024 02:57:29 GMT+0000 (Coordinated Universal Time)
గ్రామాల వారీ గల్ఫ్ వాట్సాప్ గ్రూపులే రాజకీయ వేదికలు
గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న 15 లక్షల మంది తెలంగాణ ప్రవాసి కార్మికులు, గత పదేళ్ళలో గల్ఫ్ నుంచి వాపస్ వచ్చి గ్రామాలలో నివసిస్తున్న మరో 15 లక్షల మంది గల్ఫ్ రిటనీలు, వారి కుటుంబ సభ్యులు నవంబర్ 30న జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తమ ప్రభావం చూపనున్నారు.
గల్ఫ్ నుండి గ్రామాలకు రాజకీయ గాలి
గల్ఫ్ కార్మికుల మెప్పు పొందని పార్టీల మేనిఫెస్టోలు
5 స్థానాల్లో గల్ఫ్ సంఘాల నాయకుల పోటీ
గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న 15 లక్షల మంది తెలంగాణ ప్రవాసి కార్మికులు, గత పదేళ్ళలో గల్ఫ్ నుంచి వాపస్ వచ్చి గ్రామాలలో నివసిస్తున్న మరో 15 లక్షల మంది గల్ఫ్ రిటనీలు, వారి కుటుంబ సభ్యులు నవంబర్ 30న జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తమ ప్రభావం చూపనున్నారు. ఒక ప్రవాసికి తన కుటుంబంలో ముగ్గురు, నలుగురు సభ్యులు ఉంటారనుకుంటే ఒక కోటి గల్ఫ్ ఓటు బ్యాంకు ఉన్నట్లే. ప్రధాన పార్టీల గెలుపు, ఓటములను ప్రభావితం చేయగలరు. తమ హక్కులు, సంక్షేమం కోసం గల్ఫ్ కార్మికులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై చేస్తున్న పోరాటం ఇప్పుడు రాజకీయ మార్గాన్ని ఎంచుకున్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలకు ఈ ఎన్నికల్లో ‘గల్ఫ్ గండం’ పొంచి ఉన్నది.
1980 దశకంలో ఢిల్లీ కేంద్రంగా గల్ఫ్ గురించి తనకు ఎదురైన చేదు అనుభవాలను మరిచిపోలేని కేసీఆర్ గల్ఫ్ కార్మికుల అంశంపై కోపం, పగ పెంచుకున్నట్లు ఆయన సమకాలికులు చెబుతుంటారు. గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తానని మాట తప్పడం, గల్ఫ్ బోర్డు, ఎన్నారై పాలసీ అంశాన్ని మూలకు పడేయడం ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ ను ఆత్మ రక్షణలోకి నెట్టేసింది. తమ అభ్యర్థులను ఎలాగైనా గట్టెక్కించేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో ఇటీవలి డిచుపల్లి సభలో తెల్ల రేషన్ కార్డుదారులకు ఇవ్వనున్న రూ.5 లక్షల బీమా పథకాన్ని గల్ఫ్ కార్మికులకు కూడా వర్తింపజేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.
భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని పంపిస్తూ దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్న గల్ఫ్ కార్మికులు ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిరసనగా తమ గల్ఫ్ సంఘాల నేతలను ప్రత్యక్ష రాజకీయాల్లోకి దించారు. సిరిసిల్ల నుంచి గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక అధ్యక్షులు దొనికెని క్రిష్ణ ఇండిపెండెంట్ గా టీవీ రిమోట్ గుర్తుతో మంత్రి కేటీఆర్ తో తలపడుతున్నారు. నేతాజీ స్థాపించిన ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ టికెట్లపై సింహం గుర్తుతో నాలుగు నియోజకవర్గాల్లో గల్ఫ్ లీడర్స్ రంగంలో ఉన్నారు. గల్ఫ్ జెఏసి చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్ (వేములవాడ), గల్ఫ్ కార్మికులు, చెరుకు రైతులు, బీడీ కార్మికుల ఉమ్మడి అభ్యర్థి చెన్నమనేని శ్రీనివాస్ రావు (కోరుట్ల), ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల (నిర్మల్), గల్ఫ్ జెఏసి రాష్ట్ర కార్యదర్శి బూత్కూరి కాంత (ధర్మపురి) నుంచి పోటీలో ఉన్నారు.
క్రిష్ణ దొనికెని, సిరిసిల్ల
గుగ్గిల్ల రవిగౌడ్, వేములవాడ
చెన్నమనేని శ్రీనివాస్ రావు, కోరుట్ల
స్వదేశ్ పరికిపండ్ల, నిర్మల్
బూత్కూరి కాంత, ధర్మపురి
గల్ఫ్ నుంచి గ్రామాలకు కాల్స్
ఐదు స్థానాల్లో పోటీలో ఉన్న గల్ఫ్ సంఘాల నాయకులకు ఓటు వేసి గెలిపించాలని సౌదీ అరేబియా, యూఏఈ (దుబాయి), ఓమాన్ (మస్కట్), కువైట్, ఖతార్, బహరేన్ ఆరు అరబ్ దేశాలతో పాటు సింగపూర్, మలేసియా తదితర దేశాల నుంచి గ్రామాలలోని తమ కుటుంబ సభ్యులకు పెద్ద ఎత్తున వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, జూమ్, బోటిమ్, ఐఎంఓ లాంటి యాప్ లతో ఆడియో, వీడియో కాల్స్ చేస్తున్నారు. రాజకీయ యుద్ధానికి స్మార్ట్ ఫోన్లు ఆయుధాలుగా మారాయి. గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న వారు, గల్ఫ్ రిటనీలు కలిసి విలేజ్ డయాస్పోరా (గ్రామ ప్రవాసి) వాట్సప్ గ్రూపుల ద్వారా రాజకీయంగా సంఘటితమవుతున్నారు. వివిధ దేశాలలో నివసిస్తున్న వలస కార్మికులు ప్రత్యక్షంగా ఒకరినొకరు కలుసుకోవడం వీలు కానందున వాట్సాప్ గ్రూపులను రాజకీయ వేదికలుగా ఉపయోగించుకుంటున్నారు.
గల్ఫ్ ఓటరు ఎవరి వైపు
గల్ఫ్ వలసలు అధికంగా ఉన్న ముధోల్, ఖానాపూర్ (ఎస్టీ), చొప్పదండి (ఎస్సీ), బాల్కొండ, ఆర్మూర్, జగిత్యాల, ఎల్లారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ రూరల్ లతో పాటు గల్ఫ్ వలసలు ఒక మోస్తరుగా ఉన్న ఆదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్, హుజూరాబాద్, హుస్నాబాద్, మానకొండూరు (ఎస్సీ), నిజామాబాద్ అర్బన్, బోధన్, పెద్దపల్లి, దేవరకద్ర, మక్తల్, మెదక్, సిద్దిపేట, దుబ్బాక, నల్గొండ, మిర్యాలగూడ, భువనగిరి, పరిగి లలో గల్ఫ్ ఓటు బ్యాంకు ఎవరివైపు మొగ్గు చూపుతుంది అనే చర్చ నడుస్తోంది. ఈ నియోజకవర్గాల్లో గల్ఫ్ సంఘాల నాయకులు పోటీలో లేనందున, గల్ఫ్ సంఘాలు ఎలాంటి పిలుపు ఇస్తారో అని కాంగ్రెస్, బీజేపీ లు ఆసక్తిగా గమనిస్తున్నాయి. గల్ఫ్ సంక్షేమంపై ఇచ్చిన హామీలను నెరవేర్చని బీఆర్ఎస్ కు గల్ఫ్ కార్మికులు దూరమైనారు. రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేక ఓటు ఎటు మళ్లుతుంది, ఎవరిని వరిస్తుందో చూడాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి పెద్దగా చేసింది ఏమీ లేదు. తెలంగాణ ఎన్నికల ప్రణాళికలో గల్ఫ్ సంక్షేమానికి కృషి చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేస్తామని, గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల ప్రణాళికలో ప్రకటించింది.
Next Story