ఉండవల్లి చెప్పినట్లే....జగన్....?
ఉండవల్లి చెప్పింది కరెక్టే...‘‘జగన్ కు స్ట్రాటజీ తెలీదు. ఎలక్షన్ మేనేజ్ మెంట్ ఏమీ తెలీదు. చంద్రబాబు చివరి నిమిషంలో ఎన్నికల్లో ఏదైనా చేస్తారు’’ ఇదీ మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పిన మాట. ఉండవల్లి మాటను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అక్షరాలా నిజం చేస్తున్నట్లున్నారు. ఒకవైపు బీజేపీతో వైసీపీ కుమ్మక్కయిందని తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేస్తోంది. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఛాంపియన్లు తామేనంటుంది. కాని వైసీపీ మాత్రం చేసిన పనులను చెప్పుకునే కార్యక్రమాలు చేపట్టలేకపోతుందన్న విమర్శలు ఆ పార్టీలోనే విన్పిస్తున్నాయి.
నాలుగున్నరేళ్లుగా.....
వాస్తవానికి నాలుగున్నరేళ్లుగా ప్రత్యేక హోదా కోసం జగన్ పోరాడుతూనే ఉన్నారు. యువభేరి, దీక్షల పేరిట ప్రజల్లో ప్రత్యేక హోదాపై అవగాహన కల్పిస్తున్నారు. కాని ఎన్నికల సమయం ముంచుకొచ్చేసరికి ప్రత్యేక హోదాను తెలుగుదేశం తన్నుకుపోతున్నా జగన్ చేష్టలుడిగి చూస్తున్నారంటున్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం జగన్ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు రాజీనామాలు చేశారు. ఎన్నికలకు ఏడాది సమయం ఉన్నప్పటికీ ఐదుగురు ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిధున్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, వరప్రసాద్ లు రాజీనామాలు చేశారు. రాజీనామాలు స్పీకర్ కు ఇచ్చివచ్చి ఐదురోజులు ఆమరణ దీక్షకు కూడా దిగారు.
ప్రజల్లోకి వెళ్లింది ఏదీ?
అయితే వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందిన తర్వాత జగన్ పార్టీ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది పెద్దగా ఏమీ లేదు. తమ ఎంపీలు ఏపీ ప్రత్యేక హోదా కోసమే రాజీనామా చేశారంటూ వారిని ప్రజల్లోకి పంపాల్సిన జగన్ కార్యాచరణను రూపొందించడంలో విఫలమయ్యారన్న విమర్శ ఉంది. ఇప్పుడు ఏపీలో వారి రాజీనామాల విషయాన్ని కూడా జనం మర్చిపోయారు. నెలకొకసారి వంచనపై గర్జన అంటూ జిల్లాల్లో సభలకు రాజీనామాలు చేసిన ఎంపీలు హాజరవుతున్నారు తప్ప వారి ఊసే కన్పించడం లేదు. వారు రాజీనామాలు చేసిన తర్వాత పదమూడు జిల్లాల్లో వారిని తిప్పి ప్రజలకు వివరించే ప్రయత్నం చేసి ఉంటే బాగుండేదని వైసీపీ సీనియర్ నేతలే అభిప్రాయపడుతున్నారు.
బాబును చూడు.....
మరోవైపు చంద్రబాబు తమ పార్టీకి చెందిన ఎంపీలు రాజీనామాలు చేయకుండానే మైలేజ్ తెచ్చుకుంటున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల్లో బయట హడావిడి చేసిన టీడీపీ ఎంపీలతో చంద్రబాబు సమావేశాలు జరిగినన్ని రోజులూ టెలికాన్ఫరెన్స్ నిర్వహించేవారు. ప్రభుత్వంపై వత్తిడి తేవాలని సూచించేవారు. వారు బయట నినాదాలు చేయడం తప్ప వత్తిడి తెచ్చే ప్రయత్నం చేయకపోయినా కావాల్సినంత ప్రచారం పసుపు పార్టీకి లభించింది. ఉత్తరాంధ్ర సమస్యలు, విశాఖ రైల్వే జోన్ వంటి విషయాల్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి వద్దకు వెళ్లిన టీడీపీ ఎంపీలు హంగామా సృష్టించి జాతీయ మీడియాలోనూ హీరోలయ్యారు. కాని జగన్ పార్టీ తాజా మాజీ ఎంపీలు మాత్రం ఇప్పుడు ఎక్కడున్నారో ఎవరికీ తెలీని పరిస్థితి. రాజీనామాలు చేసి ఏపీ కోసం త్యాగం చేశామని చెప్పుకునే ఛాన్స్ ఉన్నా జగన్ మిస్ చేసుకున్నారన్న వాదన పార్టీలోనే వినపడుతుంది. ఇప్పటికైనా జగన్ తన స్ట్రాటజీలను మార్చుకోవాలని ఆ పార్టీ నేతలే కోరుతున్నారు.
- Tags
- andhra pradesh
- ap politics
- avinash reddy
- janasena party
- mekapati rajamohan reddy
- midhunreddy
- nara chandrababu naidu
- pawan kalyan
- telugudesam party
- undavalli arunkumar
- vara prasad
- y.s. jaganmohan reddy
- y.v.subbareddy
- ysr congress party
- అవినాష్ రెడ్డి
- ఆంధ్రప్రదేశ్
- ఉండవల్లి అరుణ్ కుమార్
- ఏపీ పాలిటిక్స్ వై.వి.సుబ్బారెడ్డి
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- మిధున్ రెడ్డి
- మేకపాటి రాజమోహన్ రెడ్డి
- వరప్రసాద్
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ