జగన్ ది రైట్ రూట్......!
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయం కరెక్టేనా? ఇప్పుడు వైసీపీలో జరుగుతున్న చర్చ ఇదే. వంగవీటి రాధాను దూరం చేయడం వల్ల జగన్ కు నష్టమా? లాభమా? ఈ ప్రశ్నలే ఇప్పుడు వైసీపీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రాధాను దూరం పెట్టడం వల్ల కాపు సామాజిక వర్గం దూరమవుతుందన్న వాదనను కొందరు కొట్టిపారేస్తున్నారు. నిజానికి కొంతకాలం క్రితం వరకూ వంగవీటి రాధా కాపు సామాజిక వర్గానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేవారు. కాని గత కొన్నేళ్లుగా రాధా స్వయంకృతాపరాధంతోనే అది పోగొట్టుకుంటున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాపు సామాజిక వర్గ నేతలున్న......
నిజానికి వైసీపీలో బలమైన కాపు నేతలే ఉన్నారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు వంటి నేతలు ఉన్నారు. పార్టీలో ఉన్న కాపు సామాజిక నేతలందరికీ జగన్ సరైన ప్రాధాన్యతనే ఇస్తున్నారు. అయితే రాధా విషయంలో జగన్ అంచనాలు తప్పయ్యాయి. గత ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం నుంచి రాధా పోటీ చేయడం, ఆ తర్వాత పార్టీని పట్టించుకోకపోవడం, ప్రజల్లోకి వెళ్లకపోవడం రాధాకు మైనస్ అయిందంటున్నారు. ప్రశాంత్ కిషోర్ సర్వేలో కూడా రాధా అయితే విజయవాడ సెంట్రల్ లో కష్టమేనని తేలడంతో మల్లాదికి జగన్ ఛాన్స్ ఇచ్చారంటున్నారు.
జనసేనలోకి వెళితే......
మరోవైపు మరో వ్యూహం కూడా ఉందంటున్నారు. సెంట్రల్ సీటు ఇవ్వకుంటే వంగవీటి రాధా పార్టీని వీడే అవకాశముంది. అది కూడా జగన్ కు తెలియంది కాదు. రాధా గత కొంతకాలంగా జనసేనతో టచ్ లోఉన్నారని చెబుతున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుటి పరిచయాలతో తనకు సెంట్రల్ టిక్కెట్ రాకుంటే జనసేన అభ్యర్థిగా బరిలో దిగాలని రాధా భావిస్తున్నట్లు దాదాపు ఏడాది నుంచి వార్తలు వస్తున్నాయి. అందుకే వైసీపీ సెంట్రల్ నియోజకవర్గం సీటును మల్లాది విష్ణుకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
త్రిముఖ పోటీలో......
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి రాధా జనసేన నుంచి పోటీ చేస్తే మల్లాది విష్ణు గెలుపు ఖాయమవుతుందంటున్నారు. ఇదే నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి బోండా ఉమామహేశ్వరరావు వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తారు. అదే జరిగితే కాపు ఓట్లను రాధా చీల్చుకోగలిగితే మల్లాది విజయం ఖచ్చితమని జగన్ నమ్మారు.బ్రాహ్మణ ఓటర్లు మల్లాదికి అండగా నిలబడటం ఖాయమని, రాధా జంప్ చేస్తారని తెలిసే విజయవాడ తూర్పు నియోజకవర్గం, బందరు పార్లమెంటు నియోజవకర్గం ఇస్తామని తెలిపారు. రాధా తన అనుచరులతోసమావేశమై అధిష్టానంతో మాట్లాడిన తర్వాత మూడు రోజుల్లో తగిన నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. మొత్తం మీద రాధా స్వయంకృతాపరాధమే సెంట్రల్ టిక్కెట్ దక్కలేదన్నది వైసీపీలో టాక్.
- Tags
- andhra pradesh
- ap politics
- janasena party
- krishna district
- malladi vishnu
- nara chandrababu naidu
- pavan kalyan
- telugudesam party
- vangaveeti radha
- vijayawada central constiuency
- y.s jaganmohanreddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- కృష్ణా జిల్లా
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబు నాయుడు
- పవన్ కల్యాణ్
- మల్లాది విష్ణు
- వంగవీటి రాధా
- విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ