జగన్ మరొకరికి షాకివ్వనున్నారా?
వైసీపీలో క్రమక్రమంగా ఒక్కో విక్కెట్ డౌన్ అవుతుంది. పార్టీ అధినేత జగన్ కేవలం సర్వేల ఫలితాల ఆధారంగా టిక్కెట్లు కేటాయిస్తుండడంతో పార్టీ కోసం 9 ఏళ్లుగా కష్టపడినవారికి షాకుల మీద షాకులు తప్పడం లేదు. ఈ జిల్లా అని లేదు...ఆ జిల్లా అని లేదు... ఎక్కడ చూసినా వైసీపీ నాయకులకు ఎవరో ఒకరికి షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. చిలకలూరిపేటలో మర్రి రాజశేఖర్, విశాఖపట్నంలో కోలా గురువులు, యలమంచలిలో ప్రగడ నాగేశ్వరరావు, ఆచంటలో కౌరు శ్రీనివాస్.. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి తాజాగా గుంటూరు సిటీకి చెందిన లేళ్ల అప్పిరెడ్డి చేరారు. ఇక రేపో మాపో ఇదే జాబితాలోకి ప్రకాశం జిల్లాకి చెందిన మరో సమన్వయకర్త కూడా చేరిపోతున్నట్టు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాలో జగన్ ఇప్పటికే ముగ్గురు సమన్వయకర్తలకు షాక్ ఇచ్చారు.
బూచేపల్లి తప్పుకోవడంతో.....
కొండపిలో పార్టీ కోసం మూడేళ్లగా కష్టపడిన వరికూటి అశోక్ బాబును తప్పించేసిన జగన్... కందుకూరులో పార్టీ కోసం కష్టపడిన తూమాటి మాధవరావును పక్కన పెట్టేశారు. పర్చూరులో గన ఎన్నికల్లో పోటీ చేసిన గొట్టిపాటి భరత్‌కు బదులుగా మరో కొత్త ఇన్చార్జ్ రావి రామనాథం వచ్చారు. ఇక ఇప్పుడు నిన్న గాక మొన్న దర్శికి కొత్త ఇన్చార్జ్గా నియమితుతులైన బాదం మాధవరెడ్డి సైతం అదే లిస్ట్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి దర్శిలో వైసీపీకి సరైన అభ్యర్థి లేక పెద్ద తలనొప్పిగా మారింది. దర్శి నియోజకవర్గం పేరు చెపితే నాడు కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీకి బూచేపల్లి ఫ్యామిలీయే అండగా ఉంటూ వస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి మంత్రి శిద్ధా రాఘవరావు చేతుల్లో ఓడిపోయిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆ తర్వాత నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనలేదు.
అభ్యర్థిగా ప్రకటించి.....
శివప్రసాద్ రెడ్డి స్వయంగా తన అంతట తానుగా తప్పుకోవడంతో చివరకు బాదం మాధవరెడ్డిని కొత్త సమన్వయకర్తగా తెర మీదకు తీసుకువచ్చారు. అభ్యర్థిగా కూడా జగన్ ప్రకటించారు. బూచేపల్లి వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యకపోవడానికి సిద్ధా రాఘవరావు ఆర్థిక బలం ముందు తట్టుకోలేనన్న కారణం ఒకటైతే... బాలినేని శ్రీనివాస్‌తో ఏర్పడిన విభేదాలు... జగన్ సైతం తనకు ప్రయార్టి తగ్గించారన్న అభద్రత భావమే ఆయనను ప్రధానంగా వెంటాడింది. ఇక కొత్త సమన్వయకర్తగా నియమితులైన బాదం మాధవరెడ్డి ప్రారంభంలో కొద్ది రోజులు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేసినా తర్వాత చేతులు ఎత్తేశారు. తాజాగా జగన్ కార్యాలయం నుంచి ఫోన్ చేయించినా మాధవరెడ్డి అందుబాటులో లేకపోవడంతో పాటు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లడం లేదన్న నివేదికలు అధిష్టానానికి చేరాయి.
త్వరలోనే ఆదేశాలు......
దీంతో దర్శి అసెంబ్లీ నియోజకవర్గానికి కొత్త సమన్వయకర్తలను నియమించాలని డిసైడ్ అయిన జగన్ ...ఆ భాధ్యతను బాలినేని శ్రీనివాస్‌కు అప్పగించారు. ఒంగోల్లోని పేస్ ఇన్జినీరింగ్ కళాశాల అధినేత మద్దిశెట్టి వేణుగోపాల్ పేరు తెర మీదకు వచ్చింది. బాదం మాధవరెడ్డిని దర్శి బాధ్యతల నుంచి తప్పించి ఆ ప్లేస్‌లో వేణుగోపాల్‌కు నియోజకవర్గ ఇన్చార్జ్ పగ్గాలు అప్పగించవచ్చని వార్తలు వస్తున్నాయి. అలాగే ఇక్కడ బాలినేని పేరు కూడా పార్టీ చర్చల్లో నడుస్తోంది. ప్రస్తుతం ఒంగోలు ఎంపీగా ఉన్న వైవి. సుబ్బారెడ్డికి సైతం వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వరని ఒంగోల్ లోక్‌సభ నియోజకవర్గానికి సైతం కొత్త సమన్వయకర్తను నియమించాలని జగన్ డిసైడ్ అయ్యారు. ఈ భాధ్యతను కూడా బాలినేనికే జగన్ అప్పగించారు. తాజాగా జగన్ విజయనగరంలో నిర్వహించిన జిల్లా పార్టీ సమావేశానికి సైతం వైవి. సుబ్బారెడ్డి డుమ్మా కొట్టడంతో ఆయనను తప్పిస్తారన్న వార్తలకు ఊతం ఇస్తోంది. వైసీపీలో పడుతున్న వరస విక్కెట్ల క్రమంలో త్వరలోనే మరి కొన్ని కీలక విక్కెట్లు పడే ఛాన్సులు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
- Tags
- andhra pradesh
- ap politics
- badam madhav reddy
- balineni srinivasulureddy
- buchepally sivaprasad reddy
- darsi constiuency
- janasena party
- maddisetty venugopal
- nara chandrababu naidu
- pawan kalyan
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- దర్శి నియోజకవర్గం
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- ప్రకాశం జిల్లా
- బాదం మాధవ్ రెడ్డి
- బాలినేని శ్రీనివాసులురెడ్డి
- బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
- మద్దిశెట్టివేణుగోపాల్
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ