జగన్ బలం తగ్గలేదట....!
ఏపీ రాజకీయాలు రసవత్తరంగా ముందుకు సాగుతున్నాయి. మరో పదిమాసాల్లోనే ఎన్నికలు ఉండడం, పార్టీలు వేటికవే.. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం తెలిసిందే. వచ్చే ఎన్నికలు ప్రధానంగా ముక్కోణపు తరహాలోనే సాగనున్నాయి. తిరిగి అధికారం చేజిక్కించుకోవాలని టీడీపీ, గత ఎన్నికల్లో కొద్దిపాటి తేడాతో మిస్సయిన అధికారాన్ని.. వచ్చే ఎన్నికల్లో అయినా సాధించాలని వైసీపీ నాయకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎవరికి వారుగా ప్రజల్లోకి వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఈ విషయంలో వైసీపీ ధైర్యంగా ఉన్నా.. టీడీపీ మాత్రం చాలా ఇబ్బందిగా ఫీలవుతోంది. నేతలు ప్రజల్లోకి వెళ్లి ఏం చెబుతారో..? ఏం మాట్లాడతారో? అనేది చంద్రబాబు భయం! ఇదిలావుంటే, ఏపీలో అధికారంలోకి ఎవరు వస్తారనే అంశంపై రాష్ట్రంలో చర్చోపచర్చలు సాగుతున్నాయి.
ప్రత్యర్థి ఉండకూడదని.....
నిజానికి రాజకీయంగా ప్రత్యర్థి ఉండకూడదనే తలంపుతో ఏపీలో చంద్రబాబు వేసిన పాచిక బాగానే పారింది. వైసీపీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు కట్టగట్టుకుని దఫదఫాలుగా టీడీపీలో చేరిపోయారు. దాదాపు 22 మంది ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కారు. అదేసమయంలో ఇద్దరు ఎంపీలు కూడా బాబుకు జైకొట్టారు. ఇంత జరిగిన తర్వాత వైసీపీకి బలం తగ్గడం ఖాయం. ఆ పార్టీ రూపు రేఖలు మారడం కూడా ఖాయం. చంద్రబాబు ఇదే అనుకున్నారు. అయితే, వైసీపీకి సంఖ్య పరంగా బలం తగ్గింది. కానీ, నైతికంగా మాత్రం కాదు! బాబుతో పోల్చుకుంటే.. వైసీపీనే నైతికంగా బలంగా ఉండడం గమనార్హం. ప్రతిపక్షం లో ఉన్న ఎమ్మెల్యేలలో పోయిన వారు పోగా.. మిగిలిన వారంతా జగన్కు అండగా నిలబడ్డారు.
జగన్ మాట జవదాటకుండా......
ఇక, పైకి తమది క్రమ శిక్షణ గల పార్టీ అని చంద్రబాబు చెప్పుకొంటున్నా.. అంతర్గతంగా మాత్రం ఎమ్మెల్యేలు తోక ఝాడిస్తున్నారు. కానీ, వైసీపీ విషయానికి వస్తే.. పైకి జగన్ ఎక్కడా ఎవరినీ కంట్రోల్ చేయడం లేదు. తన మాటలతో ఎవరినీ నొప్పించడం లేదు. హెచ్చరికలు జారీ చేయడం లేదు. కానీ, ఎమ్మెల్యేలు మాత్రం జగన్ మాట జవదాటడం లేదు. కొన్ని చోట్ల వచ్చే ఎన్నికలకు సంబంధించి జగన్ అభ్యర్థులను ఖరారుచేస్తున్నా కూడా ఎక్కడా అసంతృప్తి వెలుగు చూడడం లేదు. పైగా జగన్ చెబుతున్న కార్యక్రమాలను వారు ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారు. జగన్ చెబుతున్న విధంగానే ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారు. టీడీపీ పరిస్తితి అలా లేదు. అదినేత చంద్రబాబు ఏదైనా పిలుపునిస్తే.. అమలు చేసే నాయకులను వెతుక్కొనాల్సి వస్తోంది. దీంతో రాష్ట్రంలో అధికార పార్టీ తిరిగి గెలుస్తుందా? అనే రేంజ్లో చర్చ సాగుతోంది.
ఏ ఇద్దరు కలిసినా....
ఇక, వైసీపీ పరిస్థితి క్రమశిక్షణకు మారుపేరుగానే ఉన్నప్పటికీ.. అధినేత జగన్ వ్యాఖ్యలు నాయకులను ఇబ్బంది పెడుతున్నాయి. కాపుల విషయంలో ఆయన వ్యవహరించిన తీరు పార్టీకి పెద్ద మాయని మచ్చగా మారిపోయింది. దీనిని చంద్రబాబు అనుకూల మీడియా పెద్ద ఎత్తున యాంటీ ప్రచారం చేసింది. అదేవిధంగా కాపులు తమ నాయకుడిగా భావించే పవన్ విషయంలోనూ జగన్ చేసిన వ్యాఖ్యలు డ్యామేజీ చేశాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలూ వచ్చే ఎన్నికల్లో తీవ్రాతి తీవ్రంగా తలపడుతున్న నేపథ్యంలో ఈ రెండు పార్టీల్లో ఏది గెలుస్తుందనే విషయంలో ఏ ఇద్దరు కలిసినా చర్చించుకుంటున్నారు. వైసీపీకి టీడీపీకి ఒకే రేంజ్లో ర్యాంకులు రావడం ఇక్కడ ఆసక్తిగా కూడా మారింది. ఇక్కడ గత రెండు మాసా ల కిందట కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ నిర్వహించిన సర్వేలో కూడా చంద్రబాబుకు 53శాతం మార్కులు పడితే .. జగన్కు 47 శాతం మార్కులు పడడం గమనార్హం. దీంతో చర్చలు జోరుగా సాగుతున్నాయి. మరి చివరికి ఫలితం ఎవరికి అనుకూలంగా ఉంటుందో చూడాలి.