జగన్ కు రిపోర్ట్స్ అందాయ్... ఆపరేషన్ స్టార్ట్....!
పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ హవా తగ్గించాలని చూస్తున్న వైసీపీకి ఎక్కడికక్కడ ఎదురు గాలి వీస్తోంది. దీంతో జిల్లా రాజకీయాలను సరిదిద్దాలని భావించిన వైసీపీ అధినేత జగన్.. ప్రధానంగా టీడీపీకి కంచుకోటగా ఉన్న ఏలూరుపై దృష్టి పెట్టారు. ఇక్కడి వర్గ విభేదాలను ఒక్క నిర్ణయంతో బుట్టదాఖలు చేశారు. సీనియర్ రాజకీయ నాయకుడు, అందరినీ కలుపుకొని పోతారని, ప్రజలపైనా ప్రభావం చూపిస్తారని భావిస్తున్న ఆళ్లనానికి పగ్గాలు అప్పగించారు. దీంతో ఇక్కడ వైసీపీ జోరు పెరుగుతుందని, వచ్చే ఎన్నికల్లో ఇక్కడ టీడీపీకి బలమైన ప్రత్యర్థిగా వైసీపీ ఎదుగుతుందని, టీడీపీని నిలువరించే శక్తికూడా వస్తుందన్నది జగన్ అండ్ టీం అంచనా.
బడేటిని నిలువరిస్తారా?
అయితే, ఇక్కడ బలమైన నాయకుడిగా ఉన్న బడేటి బుజ్జిని.. ఉరఫ్ బడేటి కోట రామారావును ఆళ్లనాని ఎలా నిలువరిస్తాడు ? అనే దానిపైనే ఇప్పుడు విశ్లేషకులు తమ అంచనాలు వెల్లడిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ ఉరఫ్ నాని వైఎస్‌కు ప్రధాన అనుచరుడిగా వెలుగొందారు. ఆయన ఆశీస్సులతోనే 2004లో ఇక్కడ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. ఆ ఊపులో ఆయన విజయం కూడా సాధించారు. 2004 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మరడాని రంగారావుపై ఎవరూ ఊహించని రీతిలో దాదాపు 33 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆ ఎన్నికల్లో జిల్లాలో నానిదే టాప్ మెజార్టీ.
బుజ్జీ ఎంట్రీతో.....
ఆ తర్వాత 2009 నాటికి టీడీపీలోకి బడేటి బుజ్జి ఎంట్రీ ఇచ్చారు. కార్పొరేటర్ స్థాయి నుంచి బుజ్జి అసెంబ్లీకి పోటీ పడే స్థాయికి టీడీపీలో ఎదిగారు. బుజ్జికి అసెంబ్లీ టికెట్ ఇచ్చి గెలిపించుకుందామని చంద్రబాబు భావించారు. అయతే, అనూహ్యంగా 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడంతో ఆ పార్టీలోకి జంప్ చేసిన బుజ్జి టికెట్ దక్కించుకున్నా సరైన పోటీ ఇవ్వలేక పోయారు. అప్పటి ముక్కోణపు పోటీలోనూ ఆళ్లనాని గెలుపొందారు. అయితే 2009లో నాని 13 వేల ఓట్ల మెజారిటీకే పరిమితమయ్యారు. ఇక, 2014 విషయానికి వచ్చేసరికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్లనాని పార్టీ మారి వైసీపీ తీర్థం పుచ్చుకున్నా.. ఆ ప్రభావం ఆయనపై పడలేదు. ఫలితంగా అప్పటికే టీడీపీలోకి తిరిగి వచ్చిన చంద్రబాబు ఆశీస్సులతో బుజ్జి టికెట్ పొంది పోటీ చేశారు.
నాని దూకుడు తగ్గి.....
జిల్లాలో బలంగా వీచిన టీడీపీ గాలులు, జనసేన అధినేత పవన్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలు, పవన్ ప్రచారం ఈయనకు అన్నీ కలిసి వచ్చి భారీ విజయం సాధించారు. ఇక, అప్పటి నుంచి ఆళ్లనాని దూకుడు ఏలూరు నియోజకవర్గంలో తగ్గింది. అయితే, ఆళ్ల నాని ప్రభావాన్ని గుర్తించిన జగన్.. ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించారు. అలాగే జిల్లా పార్టీ అధ్యక్షుడిగాను ఆయన జిల్లాలో వైసీపీ బలోపేతానికి తన వంతుగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే నాని ఎమ్మెల్సీగా ఉండడంతో జగన్ ఏలూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా మాజీ మునిసిపల్ చైర్పర్సన్ మధ్యాహ్నపు ఈశ్వరీ బలరాంకు బాధ్యతలు ఇచ్చారు.
నివేదికలు అందడంతో.....
ఏలూరు లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్త కోటగిరి శ్రీథర్ కూడా ఆమెకు సమన్వయకర్త బాధ్యతలు ఇవ్వడంలో కీలకంగా వ్యవహరించారు. అయితే ఆమె అయితే ప్రస్తుతం దూకుడు మీద ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే బుజ్జిని ఢీకొట్టలేరన్న నివేదికలు పార్టీ అధిష్టానం వద్దకు వెళ్లడంతో జగన్ మళ్లీ రూటు మార్చారు. ఏలూరు నుంచి గట్టి వ్యక్తిని నిలబెట్టాలని నిర్ణయించుకున్నారు. జిల్లా కేంద్రం కావడంతో ఇక్కడ బలహీనమైన వ్యక్తి పోటీలో ఉంటే అసెంబ్లీ సీటుతో పాటు ఎంపీ సీటు విషయంలోనూ మొదటికే మోసం వస్తుందని గ్రహించిన జగన్ తాజాగా మళ్లీ ఏలూరును ఆళ్ల నాని చేతిలోనే పెట్టారు. దీంతో ఇప్పుడు 2019లో ఏలూరు అసెంబ్లీ సీటు కోసం ఆసక్తికర సమరం తప్పదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. నాని ఇక్కడ 1994 నుంచి ప్రతి ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు. ఇక గత రెండు ఎన్నికల్లోనూ పార్టీలు మారినా ప్రధాన పోరు నాని, బుజ్జిల మధ్యే రసవత్తరంగా ఉంటోంది. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లోనూ మళ్లీ వీరిద్దరి మధ్యే పోటీ ఉంటే జిల్లా కేంద్రంలో హోరాహోరీ పోరు తప్పదు.
- Tags
- alla nani
- andhra pradesh
- ap politics
- badeti bujji
- eluru constiuency
- janasena party
- nara chandrababu naidu
- pawan kalyan
- telugudesam party
- west godavari district
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఆళ్లనాని
- ఏపీ పాలిటిక్స్
- ఏలూరు నియోజకవర్గం
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- పశ్చిమగోదావరి జిల్లా
- బడేటి బుజ్జి
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ