జగన్ మరో ముగ్గురికి షాక్ ఇస్తున్నారా... !
ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తలుగా ఈ రోజు వరకూ ఉన్నవారు రేపు ఉంటారో లేదో తెలియని అనిశ్చిత పరిస్థితి. చాలా నియోజకవర్గాల్లో వైసీపీ సమన్వయకర్తలుగా ఉండి వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్న వారు ఫైనల్‌గా రేపటి వరకు తాము ఇన్చార్జులుగా కొనసాగుతామో లేదో ? ఇంకా చెప్పాలంటే భీఫామ్ చేతికి వస్తుందో లేదో అనే ఆందోళనలో తమలో తామే తీవ్ర స్థాయిలో మదన పడుతున్నారు. ఇప్పటికే కడప నుంచి ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ, తూర్పు, విశాఖ, శ్రీకాకుళం ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇప్పటి వరకు పార్టీ కోసం పని చేసిన వారిని నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తున్నారు. జగన్ స్ట్రాటజీ జగన్‌కు ఉండవచ్చు... అయితే ఇప్పటి వరకు కష్టపడిన వారి సంగతి ఏంటా ? అనే దాని విషయంలో వారి రాజకీయ భవిష్యత్తుపై జగన్ నుంచి స్పష్టమైన హామీ రావాల్సి ఉంటుంది.
టీడీపీ కంచుకోటలో.....
టీడీపీకి కంచు కోటైన పశ్చిమగోదావరి జిల్లాలో ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల మార్పులు, చేర్పులు జరిగాయి. కొద్ది రోజుల వరకు ఆచంట నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న కౌరు శ్రీనివాస్‌ను తప్పించి ఆ ప్లేస్‌లోకి అత్తిలి మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ రంగనాథరాజును తీసుకువచ్చారు. ఇక ఎమ్మెల్సీగా ఉన్న ఆళ్ల నానిని ఏలూరు భాధ్యతలు నుంచి తప్పించి మధ్యాహ్నపు ఈశ్వరీ బలరాంకు పగ్గాలు ఇచ్చారు. తిరిగి ఆమెను తప్పించి అక్కడ మళ్లీ ఆళ్ల నానికే పార్టీ పగ్గాలు ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఈశ్వరి వర్గం పార్టీపై గుర్రుగా ఉంది. నిడదవోలులో గత ఎన్నికల్లో పోటీ చేసిన చనుమోలు రాజీవ్ కృష్ణను తప్పించి కొత్తగా జీ. శ్రీనివాసులు నాయుడుకు పార్టీ భాధ్యతలు ఇచ్చినా ఆయన వల్ల ఏ మాత్రం ఉపయోగం లేదని పార్టీ అధిష్టానం వద్ద ఇప్పటికే నివేదికలు ఉన్నాయి.
మూడు రిజర్వ్ డ్ స్థానాల్లో......
అసలు శ్రీనివాసుల నాయుడు అనే వ్యక్తి నిడదవోలు పార్టీ ఇన్చార్జ్గా ఉన్న విషయం పార్టీ వాళ్లకే చాలా మందికి తెలియకపోవడం అక్కడ ఆయన పని తీరును సూచిస్తుంది. సామాజిక సమీకరణల నేపథ్యంలో నరసాపురం మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఇన్చార్జ్ ముదునూరి ప్రసాద్‌రాజుకు ఎన్నికల టైమ్‌లో టిక్కెట్ వస్తుందా రాదా ? అన్నదానిపై ఇప్పటికే చర్చలు ప్రారంభమయ్యాయి. ఇక జిల్లాలో మూడు రిజర్వ్డ్ నియోజకవర్గాలు అయిన గోపాలపురం, కొవ్వూరు, పోలవరంలోనూ ఇదే చర్చలు నడుస్తున్నాయి. గోపాలపురంలో గత ఎన్నికల్లో ఓడిన తలారు వెంకట్రావు ఆర్థికంగా బలహీనంగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయనను తప్పించి అక్కడ ఆర్థికంగా బలమైన వర్గానికి చెందిన వారి ఎంపిక కోసం అన్వేషణ జరుగుతోంది.
మాజీ అధికారులకు......
ఎవరైనా కేంద్ర సర్వీసులు లేదా రాష్ట్ర సర్వీసులకు చెందిన అధికారులు ముందుకు వస్తే గోపాలపురం సీటు వారికే కేటాయించే ఛాన్సులు ఉన్నాయి. ఇక కొవ్వూరులో గత ఎన్నికల్లో ఓడిన తానేటి వనిత మరో సారి పోటీకి రెడీ అవుతున్నా ఆమెకు సీటు వస్తుందా లేదా ? అన్నది సందేహమే. నియోజకవర్గంలో వైసీపీ రెండు గ్రూపులుగా విడిపోయింది. వనిత ఓ గ్రూపునకు నాయకత్వం వహిస్తుండగా ఆమెకు వ్యతిరేకంగా మరో గ్రూపు పావులు కదుపుతోంది. వనితకు టిక్కెట్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని ఆమె వ్యతిరేక వర్గం ఇప్పటికే అధిష్టానం వద్ద పలు ఫిర్యాదులు చేసింది. దీంతో ఆమె అభ్యర్థిత్వం డైలమాలో పడింది. ఆమె రాజకీయ గురువు మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు యాక్టివ్ అయ్యే పరిస్థితి లేకపోవడంతో వనిత రాజకీయ సందిగ్ధంలో ఉన్నారు.
అభ్యర్థుల మార్పు........
ఇదిలా ఉంటే గతంలో జగన్ కోసం తన ఎమ్మెల్యే పదవిని వదులుకోవడంతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా పని చేసిన మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకు సైతం సీటు సందేహమే అంటున్నారు. బాలరాజు తాను కోట్ల రూపాయలను ఖర్చు చెయ్యలేనని ఇప్పటికే చెప్పడంతో పాటు ఆయనకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో మరో గ్రూప్ ఏర్పడడంతో పాటు బాలరాజు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ వాళ్లు వై.వి. సుబ్బారెడ్డితో పాటు ఇతర కీలక నాయకులకు చాలా సార్లు ఫిర్యాదులు చేశారు. దీంతో బాలరాజుకు టిక్కెట్ పై డౌటే అంటున్నారు. పోలవరం ఎస్టీ రిజర్వ్డ్ సీటు కావడంతో ఈ సీటు నుంచి పోటీ చేసేందుకు పలువురు కన్నేశారు. ఏదేమైన పశ్చిమ వైసీపీలో ఇప్పటికే రెండు, మూడు సీట్లలో మార్పులు జరగగా ఎన్నికల టైమ్‌కు మరో నాలుగు, ఐదు సీట్లలో అభ్యర్థుల మార్పులు, చేర్పులు పక్కానే.
- Tags
- andhra pradesh
- ap politics
- balaraju
- janasena party
- nara chandrababu naidu
- pavan kalyan
- polavaram constiuency
- telugudesam party
- west godavari district
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- పశ్చిమ గోదావరి జిల్లా
- పోలవరం నియోజకవర్గం
- ప్రజాసంకల్ప పాదయాత్ర
- బాలరాజు
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
- ిpraja sankalpa padayathra