అందుకే జగన్ అక్కడ అభ్యర్థిని ప్రకటించలేదట !!
విజయనగరం జిల్లాలో వైఎస్ జగన్ పాదయాత్ర దాదాపు ముగుస్తున్న సమయంలో ఒక్క విజయనగరంలో తప్ప మరెక్కడా జగన్ అభ్యర్ధులను ప్రకటించలేదు. ఈ నేపధ్యంలో పార్వతీపురం ఎస్సీ నియోజకవర్గం సీటుకు ఇద్దరు నాయకులు ఇపుడు సిగపట్లు పడుతున్నారు. వీరిలో ఒకరిని జగన్ ఇంచార్జ్ గా నియమించినా రెండవ నేత కూడా మొన్నటి వరకూ ఆ భాధ్యతలు నిర్వహించారు. పైగా జనంలో ఆయనకూ మంచి పట్టు ఉంది. దీంతో ఈ ఇద్దరో ఎవరికి ఎమ్మెలే టికెట్ ఇవ్వాలన్నది జగన్ కి అంతు పట్టడంలేదంటున్నారు. జగన్ పాదయాత్రను సైతం పోటాపోటీగా ఇద్దరు నాయకులూ విజయవంతం చేశారు.
డబ్బే అర్హతా...?
వచ్చే ఎన్నికల్లో డబ్బు బలం కూడా ఉండాలని జగన్ భావిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. అలా చూసుకునే ఇక్కడ ఇంచార్జ్ ని మార్చారని అంటున్నారు. అలజంగి జోగారావు ఇపుడు ఇంచార్జ్ గా ఉంటున్నారు. ఆయన పార్టీలో చక్రం తిప్పుతున్నారు. మొన్నటి వరకూ పార్టీని జమ్మంగి ప్రసన్నకుమార్ నడిపించారు. ఆయనకు జనంలో బలం బాగా ఉంది. ఆయనకు టికెట్ ఇస్తే కచ్చితంగా గెలుస్తారని కూడా అంటున్నారు. అయితే ఇక్కడ పార్టీ వ్యవహారాలు చూస్తే అరకు పార్లమెంట్ ఇంచార్జ్ శత్రుచర్ల పరీక్షిత్ రాజు అలజంగిని డబ్బుందన్న కారణంగా ప్రోత్సహించి ఇంచార్జిని చేశారని అంటున్నారు. దీంతో ఇక్కడ వర్గ పోరు తారస్థాయికి చేరింది.
గతంలో ఓటమి.....
ఇక్కడ 2014 ఎన్నికల్లో కూడా వైసీపీకి మంచి విజయావకాశాలు ఉండేవి. అయితే సరైన మారదర్శకత్వం లేక పార్టీ సీటు చేజార్చుకుంది. ఇక్కడ నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన జమ్మంగి ప్రసన్నకుమార్ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులుపై కేవలం ఆరు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. గట్టి పోటీ ఇచ్చి వైసీపీ పట్టుని నిరూపించారు. ఆ ఎన్నికల్లో ప్రసన్న కుమార్ కి 56 వేల 329 ఒట్లు పడ్డాయి. అదే ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున అలజంగి జోగారావు పోటీ చేసి డిపాజిట్ పోగోట్టుకున్నారు. ఇపుడు కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చిన జోగారావుకు టికెట్ ఇస్తారని ప్రచారం సాగుతోంది.
సర్ధుకోకపోతే ఇబ్బందే:....
వైసీపీలో రెండు వర్గాలు బలంగా ఉన్నాయి. నువ్వా నేనా అని పనిచేస్తున్నాయి. నిజానికి జగన్ తన పాదయాత్రలో భాగంగా ఒకరికి ఎమ్మెల్యే టికెట్ ప్రకటించాలి. కానీ గ్రూపు తగాదాల వల్లనే ఆయన మౌనం దాల్చారని అంటున్నారు. అయితే ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా రెండవ వారు అలగడం ఖాయం. పైగా వేరే పార్టీ నుంచి పోటీకి దిగినా ఆశ్చర్యపోనవసరం లేదు అదే కనుక జరిగితే గెలుపు అవకాశాలు బాగా ఉన్న చోట మరో మారు వైసీపీ సీటు పోగొట్టుకునే ప్రమాదం ఉంది. మరి ఈ విషయం అధి నాయకత్వం గమనించి ఇద్దరికీ నచ్చచెప్పి కలసి నడిపిస్తేనే వైసీపీకి విజయం నమోదు అవుతుందని అంటున్నారు. మరి చూడాలి