జగన్ పార్టీ గన్ షాట్ గెలుపు గ్యారంటీ...!
పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరుతో పాటు, ఏలూరును ఆనుకుని ఉన్న దెందులూరు నియోజకవర్గాల్లో వైసీపీ నయా స్ట్రేటజీ ఆ పార్టీకి ఎంత వరకు వర్కవుట్ అవుతుంది... ఈ రెండు నియోజకవర్గాల్లో వైసీపీ తీసుకున్న కొత్త నిర్ణయాలు అధికార టీడీపీకి దూకుడుకు బ్రేకులు వేస్తాయా ? 2019 ఎన్నికల్లో ఏలూరు లోక్ సభ నియోజకవర్గంలో సెగ్మెంట్లుగా ఉన్న ఈ రెండు నియోజకవర్గాలు ఏలూరు ఎంపీ సీటును వైసీపీ గెలుచుకోవడంలో ఎంత వరకు కీలక పాత్ర పోషిస్తాయి అన్నది చూస్తే... ఈ స్ట్రాటజీ ఆ పార్టీకి కొంత వరకు కలిసొచ్చేదిగా ఉంది. ఆరు నెలల నుంచి ఏడాది క్రితం వరకు చూస్తే ఈ రెండు నియోజకవర్గాల్లో వైసీపీ దిక్కుతోచని స్థితిలో ఉంది. ఏలూరులో గత ఎన్నికల్లో ఓడిన మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నానిని తప్పించి కొత్త కోఆర్డ్నేటర్గా మాజీ మునిసిపల్ చైర్పర్సన్ మధ్యాహ్నపు ఈశ్వరీ బలరామ్‌కు బాధ్యతలు అప్పగించారు.
నానికి అప్పగించడంతో......
నాని తప్పుకోవడంతో ఏలూరు వైసీపీ దిక్సూచి లేని నావ మాదిరిగా మారిపోయింది. నియోజకవర్గంలో బలమైన కేడర్ పార్టీ పటిష్ఠంగా ఉన్నా నడిపించే సమర్ధుడైన నాయకుడు లేకపోవడంతో పార్టీలోనే చాలా మందికి నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి. నియోజకవర్గ రాజకీయాల్లో రెండు దశాబ్ధాలుగా తిరుగులేని నాయకుడిగా ఉన్నా ఆళ్ల నానిని పక్కన పెట్టి మధ్యాహ్నపు ఈశ్వరీ బలరామ్‌కు నియోజకవర్గ బాధ్యతలు ఎందుకు ఇచ్చారో పార్టీలో సామాన్య కార్యకర్తలకు కూడా ఓపట్టాన అర్థం కాలేదు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగాను, ఎమ్మెల్సీగా ఉన్న నాని అయితేనే ఇక్కడ టీడీపీని ఢీకొట్టి గెలిచే సత్తా ఉన్న నాయకుడన్నది అందరి అభిప్రాయాల్లోనూ ఉంది. అయితే తాజాగా తిరిగి ఇక్కడ వైసీపీ బాధ్యతలను నానికి అప్పగించడంతో ఏలూరు వైసీపీలో ఎక్కడాలేని జోష్ వచ్చేసింది. వచ్చే ఎన్నికల్లో నాని నాయకత్వంలో ఇక్కడ వైసీపీ జెండా ఎగరవేస్తామని వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘంటాపథంగా చెబుతున్నారు.
శ్రీధర్ వ్యూహాత్మకంగా.....
వచ్చే ఎన్నికల్లో ఏలూరులో జనసేన ప్రభావం మెండుగా ఉంటుంది. ఈ క్రమంలోనే పార్టీ అధి నాయకత్వం ఏలూరు లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్త కోటగిరి శ్రీధార్ వ్యూహాత్మకంగా మళ్ళీ ఆళ్ల నానిని తెరమీదకు తీసుకురావడంతో ఇక్కడ పార్టీ గెలుపుకు బాటలు వేయడంలో చాలా వరకు సక్సస్ అయ్యారని చెప్పాలి. ఇక ఏలూరును ఆనుకుని ఉన్న దెందులూరు నియోజకవర్గంలో వైసీపీ వేసిన నయా స్ట్రేటజీ కొంత వరకు వర్కవుట్ అవుతున్నట్టే కనిపిస్తుంది. అయితే ఇక్కడ కొత్త సయన్వయకర్తగా ఉన్నా వైసీపీ యూరప్, యూకే కన్వీనర్ అబ్బయ్య చౌదరిపై న్యూట్రల్ జనాల్లోనూ ఆదరణ రోజు రోజుకు పెరుగుతోంది.
చింతమనేనికి చిక్కులే......
కాంట్రవర్సీ కింగ్‌గా పేరున్న టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు తన చర్యల ద్వారానే నియోజకవర్గంలో వ్యతిరేకత వ్యక్తమౌతోంది. అయితే దీనిని సంపూర్తిగా క్యాష్ చేసుకోవడంలో వైసీపీ సక్సెస్ అవుతుందా ? అన్న ప్రశ్నకు ఆన్సర్ సందేహమే అనే చెప్పాలి. నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలో ఓ మండలంలో టీడీపీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. మిగిలిన మూడు మండలాల్లో వైసీపీ, టీడీపీకి సరిసమానమైన పోటీ ఇచ్చే స్థాయికి వచ్చింది. ఈ క్రమంలోనే మరింత వ్యూహాలతో ముందుకు వెళ్తే దెందులూరులో టీడీపీని ఓడించడంలో వైసీపీకి అంత పెద్ద కష్టమేమి కాదన్న అభిప్రాయం అందరిలోను వ్యక్తమౌతోంది. నియోజకవర్గంలో రాజకీయాన్ని శాసించే ఓ ప్రధాన సామాజికవర్గంతో పాటు కొల్లేరులో బలంగా ఉన్నా మరో రెండు సామాజికవర్గాలు సైతం అధికార పార్టీ ఎమ్మెల్యేపైవ్యతిరేకంగా ఉండడం కూడా వైసీపీకి సానుకూలంగా మారనుంది. అయితే దీన్ని ఓట్ల రూపంలో క్యాష్ చేసుకోవడమే వైసీపీ ముందున్న ప్రధాన లక్ష్యం. ఏదేమైనా ఏలూరు, దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గాల విషయంలో వైసీపీ వేసిన స్ట్రాటజీ వర్కవుట్ అయ్యే పరిస్థితులే ఉన్నాయి. అయితే దీన్ని సంపూర్తిగా క్యాష్ చేసుకోవడం వైసీపీ చేతులోనే ఉంది.
- Tags
- abbaiah choudary
- alla nani
- andhra pradesh
- ap politics
- chinthamaneni prabhakar
- janasena party
- kotagiri sridhar
- nara chandrababu naidu
- pawan kalyan
- telugudesam party
- west godavari district
- y.s. jaganmohan reddy
- ysr congress party
- అబ్బయ్య చౌదరి
- ఆంధ్రప్రదేశ్
- ఆళ్లనాని
- ఏపీ పాలిటిక్స్
- కోటగిరి శ్రీధర్
- చింతమనేని ప్రభాకర్
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- పశ్చిమ గోదావరి జిల్లా
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ