వైసీపీలో వైవీ ఎఫెక్ట్....?
ఆయన సీనియర్ నాయకుడు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి కావాల్సిన నాయకుడు. పైగా ఆయన ఫ్యామిలీ సభ్యుడు కూడా! సాక్షాత్తూ వైసీపీ అధినేత జగన్‌కు సొంత బాబాయి. అయితేనేం.. కుండకు చిల్లులు పెట్టే రకంగా మారిపోయారు. కూర్చున్న కొమ్మనే నరుక్కుంటూ ఆయన వ్యక్తిగత ఎదుగుదల, ప్రతిష్టం కోసం పార్టీని పణంగా పెట్టేస్తున్నారన్న విమర్శలు వైసీపీలో వినిపిస్తున్నాయి. ఆయనే.. ఒంగోలు మాజీ ఎంపీ(ఇటీవల ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేశారు) వైవీ సుబ్బారెడ్డి. ప్రకాశం జిల్లా నుంచి చక్రం తిప్పుతున్న వైవీ.. తన వ్యవహారంతో పార్టీకి పెద్ద ఇబ్బందికరంగా మారారని అంటున్నారు.
కొండపిలో జోక్యం చేసుకుని.....
ఇదంతా ఓ భాగమైతే.. తనకు.. ప్రకాశం జిల్లా పార్టీ వ్యవహారాలను చూస్తున్న మాజీ మంత్రి, ప్రస్తుత జిల్లా పార్టీ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాస్‌రెడ్డిపై ఆధిపత్య రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే బాలినేని తీసుకునే నిర్ణయాలకు ఆయన పుల్లలు వేస్తున్నారని తెలుస్తోంది. కేవలం సుబ్బారెడ్డి వ్యక్తిగత ప్రతిష్టకు పోవడంతో క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న ప్రకాశం జిల్లా వైసీపీ నిట్ట నిలువునా రెండు వర్గాలుగా చీలిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో జిల్లాలో పార్టీకి ఘోరమైన ఎదురు దెబ్బ తప్పేలా లేదు. తాజాగా ప్రకాశంలోని కీలక నియోజకవర్గం కొండపిలో బాలినేని ప్రమోట్ చేసిన నాయకుడికి పుల్లలు పెడుతూ.. ఆయనను బరినుంచి తప్పించేలా వ్యవహరించారని వైవీపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
బాలినేని నామినేట్ చేసిన.....
ఎస్సీ నియోజకవర్గం అయిన కొండపి సమన్వయకర్త విషయంలో జోక్యం చేసుకున్న వైవీ సుబ్బారెడ్డి.. ఇక్కడ బాలినేని నామినేట్ చేసిన, ఆయన మద్దతున్న వరకూటి అశోక్‌ను తప్పించారు. ఈయన స్థానంలో విశ్రాంత వైద్యుడు డాక్టర్ మాదాసు వెంకయ్యను నియమించేలా ఉద్దేశ పూర్వకంగానే వైవీ వ్యవహరించాడు. అయితే, ఇప్పటి వరకు ఇక్కడ పార్టీ పుంజుకునేందుకు, పార్టీని సమన్వయం చేసేందుకు అశోక్ భారీ ఎత్తున నిధులు ఖర్చు చేశాడు. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఎందుకు గెలిపించాలో కూడా ఆయన వివరిస్తూ.. ప్రజల్లో దూసుకుపోతున్నాడు. అయితే, ఇవేమీ పట్టించుకోకుండానే వైవీ .. అకోశ్కు వ్యతిరేకంగా చక్రం తిప్పాడు. ఫలితంగా ఇక్కడ ఇంచార్జ్‌ను మారుస్తూ.. జగన్ నిర్ణయం తీసుకున్నాడు.
నిప్పులు చెరుగుతున్న.....
సుబ్బారెడ్డి వ్యూహంతో కొండపికి కొత్త సమన్వయకర్తగా మాదాసు వెంకయ్య వచ్చేశారు. ఇప్పుడు ఇది చిచ్చుకు దారితీసింది. తనతో కోట్లకు కోట్లు ఖర్చు పెట్టించి.. ఆస్తులు సైతం అమ్ముకునేలా చేసి.. ఇప్పుడు తనను రోడ్డున పడేస్తారా? అంటూ అశోక్ వైవీపై నిప్పులు చెరుగుతున్నారు. నాలుగేళ్ల పాటు కోట్లు ఖర్చు చేసి నియోజకవర్గంలో పార్టీని బతికిస్తే ఇప్పుడు తనను తప్పించడం అన్యాయమని ఆయన ఫైర్ అయ్యారు. సుబ్బారెడ్డికి బానిసత్వం చేసే వాళ్లకేనా ? టిక్కెట్లు అని కూడా అశోక్ నిప్పులు చెరుగుతున్నారు. అలాగే మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి ఆస్తులు గత ఎన్నికలకు ముందు సుబ్బారెడ్డి రాయించుకుంటే జగన్ ఆయనకు చీవాట్లు పెట్టి వెంకటరెడ్డికి ఆస్తులు ఇప్పించారని కూడా అశోక్‌బాబు చెప్పారు. ఇదిలా ఉంటే మరోపక్క జిల్లా పార్టీ అధ్యక్షుడు బాలినేని కూడా వ్యూహాత్మకంగా వైవీని టార్గెట్ చేస్తున్నారు.
ప్రతి నియోజకవర్గంలో.....
ఇక, ఈ పోరుతో కొండపిలో వైసీపీ పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. ఇదిలా ఉంటే ప్రస్తుతం జిల్లాలో పార్టీకి మిగిలిన ఏకైక ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డిని కూడా వచ్చే ఎన్నికల్లో తప్పించాలని బలంగా డిసైడ్ అయిన వైవి ఓ మాజీ ఎమ్మెల్యేను తెరమీదకు తీసుకు వస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఇక గిద్దలూరులో ప్రస్తుత సమన్వయకర్త ఐవి.రెడ్డిని తప్పించేసి మాజీ ఎమ్మెల్యే పిడతల సాయి కల్పనారెడ్డిని తెరమీదకు తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా జిల్లాలో ప్రతి నియోజకవర్గంలోనూ వైవీ పుల్లలు పెడుతూ రాజకీయం చేస్తున్నారన్న విమర్శలు సొంత పార్టీలోనే తీవ్రంగా ఉన్నాయి. అదేమంటే ప్రజాక్షేత్రంలో గెలిచిన వాళ్లదే రాజ్యం... గత ఎన్నికల్లో తాను ఎంపీగా గెలిచాను... ఓడిన వాళ్ల మాటకు విలువ లేదంటూ పరోక్షంగా బాలినేనిని టార్గెట్ చేస్తున్నారు. ఏదేమైనా వైవీ ఎఫెక్ట్ జిల్లాలో జగన్‌కు మామూలుగా ఉండేలా లేదు. మరి జగన్ ఇప్పటకి అయినా వైవికి ముకుతాడు వేయకపోతే పార్టీకి వచ్చే ఎన్నికల్లో గండి తప్పదు.
- Tags
- andhra pradesh
- ap politics
- balineni srinivas reddy
- janasena party
- janke venkatareddy
- kondapi constiuency
- nara chandrababu naidu
- pawan kalyan
- prakasam district
- telugudesam party
- y.s. jaganmohan reddy
- y.v.subbareddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- కొండపి నియోజకవర్గం
- జంకె వెంకటరెడ్డి
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- ప్రకాశం జిల్లా
- బాలినేని శ్రీనివాస్ రెడ్డి
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వై.వి.సుబ్బారెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ