జగన్ అడుగు పెట్టకముందే ఇంత రగడా?
కృష్ణా జిల్లాలో జిల్లా కేంద్రమైన మచిలీపట్నానికి ఆనుకుని ఉండే నియోజకవర్గం పెడన. గతంలో మల్లేశ్వరం పేరుతో ఉన్న ఈ నియోజకవర్గం పునర్విభజనలో మునిసిపాలిటీ కేంద్రమైన పెడనగా మారింది. ఈ నియోజకవర్గంలో టీడీపీ పుట్టినప్పటి నుంచి 1983 మినహా మాజీ విప్, పార్టీ సీనియర్ నేత కాగిత వెంకట్రావే గెలుస్తూ వస్తున్నారు. ఈ నియోజకవర్గంలో మూడు దశాబ్దాలుగా పోరు కాగిత వెంకట్రావు వర్సెస్ బూరగడ్డ వేదవ్యాస్ మధ్యే నడుస్తోంది. ఒక్క 2009లో మాత్రం వేదవ్యాస్ ప్రజారాజ్యం పార్టీ నుంచి పెడన వదిలేసి పక్కనే ఉన్న మచిలీపట్నం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
1989 నుంచి కాగిత వర్సెస్ వేదవ్యాస్ ....
1989లో కాగితను వేదవ్యాస్ ఓడిస్తే, 1994, 1999 ఎన్నికల్లో వేదవ్యాస్‌ను కాగిత ఓడించారు. 2004లో తిరిగి ఇక్కడ వేదవ్యాస్ గెలిచారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో మల్లేశ్వరం పేరు మారి పెడనగా అవతరించింది. ఈ ఒక్క ఎన్నికల్లో మాత్రం వేదవ్యాస్ మచిలీపట్నంకు మారి అక్కడ ప్రజారాజ్యం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో మైలవరంకు చెందిన జోగి రమేష్ ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి కాగితను వెయ్యి ఓట్లతో ఓడించారు. ఇక గత ఎన్నికలకు ముందు వేదవ్యాస్ వైసీపీలోకి జంప్ చేసి మళ్లీ కాగితతోనే పోటీ పడ్డారు. ఈ ఎన్నికల్లో కాగిత 13 వేల ఓట్ల మెజార్టీతో వేదవ్యాస్‌ను మూడో సారి ఓడించారు.
అటు తిరిగి ఇటు తిరిగి టీడీపీలోకే...
ఇక 1989లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచిన కాపు వర్గానికి చెందిన వేదవ్యాస్ మూడు దశాబ్దాల్లో నాలుగు పార్టీలు మారారు. ముందు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే 2009లో ప్రజారాజ్యం నుంచి మచిలీపట్నంలో పోటీ చేసిన ఆయన గత ఎన్నికలకు ముందు వైసీపీలోకి వెళ్లి మళ్లీ పెడనలో పోటీ చేసి వరుసగా రెండోసారి కూడా ఓడారు. ఇక ఆయన ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. వేదవ్యాస్ కుమారుడికి చంద్రబాబు తనయుడు లోకేష్‌తో ఉన్న అనుబంధం నేపథ్యంలో కొడుకు కోసం వేదవ్యాస్ సైకిల్ ఎక్కేశారు.
వైసీపీలో రగడ రగడ...
ఇక వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప యాత్ర నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే ఇక్కడ పార్టీలో రగడ స్టార్ట్ అయ్యింది. గత ఎన్నికలకు ముందు ఇక్కడ పనిచేసిన ఉప్పాల రాంప్రసాద్‌ను వేదవ్యాస్ కోసం కైకలూరు పంపారు. వేదవ్యాస్ టీడీపీలోకి వెళ్లడంతో రాంప్రసాద్ తిరిగి పెడనలో వర్క్ చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అయినా ఆయన పెడనలో గెలవాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే గతంలో ఇక్కడ గెలిచిన జోగి రమేష్ ఇప్పుడు పెడనలో జోక్యం చేసుకోవడం రాం ప్రసాద్‌ను తీవ్రంగా హర్ట్ చేసింది.
జోగి దెబ్బకు......
జోగి రమేష్ గత ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం మైలవరం నుంచి పోటీ చేసి ఓడారు. ఇప్పుడు టీడీపీలో ఉన్న సీనియర్ నేత వసంత కృష్ణప్రసాద్ వైసీపీలోకి వచ్చి మైలవరంలో దేవినేని ఉమా మీద పోటీకి రెడీ అవుతుండడంతో జోగి రమేష్ చివరకు మళ్లీ పెడనమీదే కన్నేశారు. ఈ నియోజకవర్గంలో ఆయన వేలు పెట్టడం స్టార్ట్ చేసేశారు. వచ్చే ఎన్నికల్లో పెడన సీటు నాదే అని చెప్పుకుంటున్నారు. దీంతో దాదాపు 7-8 ఏళ్లుగా ఇక్కడ వర్క్ చేసుకుంటోన్న ఉప్పాల రాంప్రసాద్ ఇప్పుడు అలకబూని జగన్ పాదయాత్ర నుంచి పూర్తిగా తప్పుకోవడంతో పాటు తన వర్గాన్ని కూడా పార్టీకి దూరం చేశారు. దీంతో ఇది పెద్ద సంచలనంగా మారింది.
ఎవరికి ఇస్తారనేది?
మరి వైసీపీ అధినేత జగన్ రాం ప్రసాద్‌కు న్యాయం చేస్తూ ఆయనకే ఈ సీటు ఇస్తారా ? లేదా జోగి రమేష్ కోసం రాం ప్రసాద్‌కు మళ్లీ అన్యాయం చేస్తారా ? అన్నది సస్పెన్స్‌గా ఉంది. ఏదేమైనా జగన్ పెడనలోకి ఎంట్రీ ఇచ్చే టైంలోనే పార్టీలో లుకలుకలు, అలకలు రేగడం పెద్ద ఇబ్బందే. ఇక ఈ నియోజకవర్గంలో ఎంతో పట్టున్న కాగిత , వేదవ్యాస్ ఇప్పుడు టీడీపీలోనే ఉన్నారు. దీంతో పాటు బందరు ఎంపీ కొనకళ్లకు ఇక్కడ వర్గం ఉంది. మరి స్ట్రాంగ్‌గా ఉన్న టీడీపీని వైసీపీ ఢీకొట్టాలంటే జగన్ ముందుగా ఇక్కడ పార్టీలో గొడవలు సెటిల్ చేయాలి. ఉప్పాల, జోగి రమేష్ మధ్య సమన్వయం కుదర్చాలి. ఇదే పెడన వరకు జగన్ ముందున్న పరీక్ష.