వారసుడు అయ్యాడు నాయకుడు...!!
రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడూ ఎదుర్కోని కష్టాలు వై.ఎస్.జగన్ ఎదుర్కొన్నారని అంటారు ఆయన సన్నిహితులు. కాదు... ఆయన వైఖరే కష్టాలకు కారణమంటారు ప్రత్యర్థులు. జగన్ వి ఒంటెద్దు పోకడలు అంటారు ఆయన ప్రత్యర్థులు. కాదు... ఆయనవి నాయకత్వ లక్షణాలు అంటారు ఆయన అభిమానులు. జగన్ ది అధికార దాహం అంటారు ఆయన ప్రత్యర్థులు. కాదు... తండ్రిలా ప్రజలకు సేవ చేసి పేరు తెచ్చుకోవాలనే ఆశయం ఆయనది అంటారు ఆయన అనుచరులు. జగన్ పై ఎన్నిరకాల అభిప్రాయాలు ఉన్నా... ఎన్నిరకాల ఆరోపణలు ఉన్నా... ఒకటి మాత్రం నిజం. గత ఎనిమిదేళ్లలో ఎక్కువ సమయం ప్రజల్లో ఉన్న తెలుగు రాష్ట్రాల నాయకుల్లో జగన్ ముందుంటారు. అధికార యావ అని ఆరోపించినా... నాయకుడికి ఉండాల్సిన స్వభావం అని కీర్తించినా... జగన్ ది మాత్రం నిత్యం ప్రజలతోనే ఉండే నైజం అని మాత్రం ప్రత్యర్థులు సైతం ఒప్పుకోవాల్సిందే. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా తాను నిలబడి... పార్టీని నిలబెట్టాడంటే అది కచ్చితంగా ఆయన నాయకత్వం వల్లె సాధ్యపడింది. వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా ‘‘తెలుగుపోస్ట్’’ ప్రత్యేక కథనం.
జైలు జీవితమే పట్టుదలను పెంచిందా...?
పదేళ్ల క్రితం జగన్ ఒక వ్యాపారవేత్త. ముఖ్యమంత్రి కుమారుడు. కడప ఎంపీ. రాష్ట్రంలో చాలా మందికి ఆయన పేరు కూడా పూర్తిగా తెలియదు. కానీ, ఇవాళ జగన్ ని ద్వేషించవచ్చు... ప్రేమించవచ్చు... శత్రువుగా చూడవచ్చు... కానీ ఆయనను మాత్రం ప్రతీఒక్కరు బలమైన నేతగానే భావిస్తారు. కేవలం తండ్రి పేరుపైనే రాజకీయాల్లోకి వచ్చిన జగన్ ఇవాళ తన తండ్రి బాటలోనే సొంతంగా ఎదిగారు. అనేక ఆటుపోట్లను తట్టుకుంటూ నాయకుడిగా మారారు. తండ్రి వైఎస్ మరణం తర్వాత ఆయన పూర్తి స్థాయిలో ప్రజాజీవితంలోకి వచ్చారు. అంతకు మూడు నెలల ముందే కడప ఎంపీగా గెలిచినా ఆయన కేవలం తన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. వైఎస్ మరణాన్ని జీర్ణించుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు ప్రారంభించిన ఓదార్పు యాత్ర జగన్ జీవితాన్ని మలుపుతిప్పింది. ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులను తయారుచేసింది. ప్రజలతో ఆయన కలిసిపోయే వైఖరి చూసి సాధారణ ప్రజల్లోనూ జగన్ పట్ల మక్కువ పెరిగింది. వైఎస్ కుమారుడిగా జగన్ ఎక్కడకు వెళ్లినా విపరీతమైన స్పందన వచ్చింది. అనంతరం పరిణామాల్లో ఆయన కాంగ్రెస్ పార్టీనే ఎదిరించారు. కాదు...కాదు అధినేత్రి సోనియానే ఎదిరించారనేది వాస్తవం. దీంతోకాంగ్రెస్ పార్టీని వదిలి తండ్రి పేరుపైనే పార్టీ పెట్టుకున్నారు. కాంగ్రెస్ ద్వారా వచ్చిన ఎంపీ పదవికి రాజీనామా చేసి రికార్డు మెజారిటీతో మళ్లీ గెలిచారు. అప్పుడే ఆయన బలాన్ని దేశమంతా గుర్తించింది. అనంతరం పడరాని కష్టాలన్నీ పడ్డారు. కేసులను ఎదుర్కొన్నారు. 16 నెలల పాటు జైలు జీవితం కూడా గడిపారు.
ఎదురుదెబ్బలు ఎన్ని తగిలినా...
ఎన్ని కష్టాలు అనుభవించినా ఆయన పార్టీని మొండి ధైర్యతోనే నడిపించారు. ఎంతోమంది నాయకులు జగన్ మంచివాడంటూ పార్టీలో చేరారు. తర్వాత జగన్ పై బురదజల్లుతూ బయటకు వెళ్లిపోయారు. కానీ, ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. గత ఎన్నికల్లో జగన్ ఒక వైపు నిలవగా మిగతా మూడు ప్రధాన పార్టీలు మరోవైపు నిలిచాయి. జగన్ ఓడిపోయారు. పార్టీ అధినేతగా గెలుపైనా ఓటమైనా జగన్ దే బాధ్యత. ఆ బాధ్యతను స్వీకరించారు. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో ఎంతో అనుభవం కలిగిన నాయకుడిలా ప్రభుత్వ తీరును సందర్భాన్ని బట్టి ఎండగట్టారు. తర్వాత జగన్ కి మరిన్ని ఎదురుదెబ్బలు తగిలాయి. తాను టిక్కెట్లిచ్చి గెలిపించిన ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. 23 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి అధికార పార్టీలో చేరారు. పోతూపోతూ జగన్ పైనే విమర్శలు చేశారు. ఇంకా చేస్తున్నారు. అయినా, జగన్ ఎక్కడా తగ్గలేదు. వాటిని ఏమాత్రం పట్టించుకోలేదు.
గెలిచినా...ఓడినా.....
ఈ నాలుగున్నరేళ్లుగా అనేక పోరాటాలు, దీక్షలు ఆయన చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదానే సంజీవని అంటూ మొదటి నుంచి జగన్ ఒకేమాట మీద ఉన్నారు. ఇందుకోసం నిరాహార దీక్ష, పోరాటాలు కూడా చేశారు. ఇవాళ హోదాను వ్యతిరేకించిన వారు కూడా హోదానే కావాలంటున్నారంటే జగన్ ఈ నినాదాన్ని ఏదో ఓ కార్యక్రమంతో ప్రజల్లో ఉంచడమే కారణం. ఇక, గత సంవత్సర కాలంగా జగన్ పూర్తిగా ప్రజల్లోనే ఉంటున్నారు. చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా, ఎవరూ చేయని విధంగా 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలను కలుస్తున్నారు. తాను అధికారంలోకి వస్తే చెపట్టబోయే పథకాలను వారికి వివరిస్తున్నారు. అధికార పార్టీ పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. విజయమే లక్ష్యంగా రాజకీయ వ్యూహాలు పన్నుతున్నారు. కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఎన్నికలు జగన్ కు చాలా కీలకమైనవి. అయితే, జగన్ కు విజయం మాత్రం అంత కష్టం కాకపోవచ్చు... సులువూ కాకపోవచ్చు. కానీ, గెలిచినా, ఓడినా జగన్... జగనే.