ఇక్కడ జగన్ బ్యాచ్ వారికే జై కొడుతుందా?
తెలంగాణ ఎన్నికల్లో ఎంతకూ చిక్కుముడి వీడకుండా రాజకీయ పార్టీలను కలవెరపడుతున్న ప్రశ్న.. సెటిలర్ల ఓట్లు ఎవరికి ? గత ఎన్నికల్లో సెటిలర్లలో మెజారిటీ ప్రజలు టీడీపీ, బీజపే కూటమికి మద్దతు ఇచ్చారు. దీంతో సెటిలర్ల ప్రభావం ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో టీడీపీ, బీజేపీ ఎక్కువ స్థానాలు దక్కించుకున్నాయి. అయితే, తర్వాత వచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం సెటిలర్లు టీఆర్ఎస్ వైపు నిలిచారు. మరి, ఇప్పుడు వీరు ఎటువైపు ఉంటారనేది ప్రశ్నార్ధకంగా మారింది. సెటిలర్ల ఓట్లు కచ్చితంగా తమకే పెడతాయని టీడీపీతో కూడిన ప్రజాకూటమి ధీమాగా ఉంది. అయితే, నాలుగున్నరేళ్లుగా తమ హయాంలో సెటిలర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నందున తమవైపే ఉంటారని టీఆర్ఎస్ భావిస్తోంది. సుమారు 15 నియోజకవర్గాల్లో కీలకమైన సెటిలర్ల ఓట్లు గెలుపోటములను ప్రభావితం చేయగలవు. అయితే, సెటిలర్లలోని వైసీపీ అభిమానులు ఎటువైపు ఉంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
గత ఎన్నికల్లో వైసీపీ మంచి ఓట్లు...
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డిని తెలంగాణలో అభిమానించే ప్రజలు పెద్దఎత్తున ఉన్నారు. ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారిలో చాలామంది వైఎస్ఆర్ ను ఇప్పటికీ ఇష్టపడతారు. ఆయన మరణం తర్వాత జగన్ పట్ల కూడా కొందరు వైఎస్ అభిమానులకు సాఫ్ట్ కార్నర్ ఉంది. గత ఎన్నికల్లో జగన్ స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఏపీపై దృష్టి పెట్టినా తెలంగాణలో మూడు స్థానాల్లో విజయం సాధించింది. సెటిలర్ల ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు సాధించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని ఎల్బీనగర్ లో 19 వేల ఓట్లు, మల్కాజిగిరిలో 15 వేల ఓట్లు, కూకట్ పల్లిలో 22 వేలు, శేరిలింగంపల్లిలో 24 వేలు, కుత్బుల్లాపూర్ లో 27 వేలు, జూబ్లీ హిల్స్ లో 10 వేలు, ఖైరతాబాద్ లో 24 వేలు, ఉప్పల్ లో 16 వేలు, సికింద్రాబాద్ లో 11 వేల ఓట్లను ఆ పార్టీ సాధించింది. అంటే సెటిలర్లలో వైసీపీకి అనుకూలంగా ఉండేవారు కూడా ఉన్నారని అర్థం.
శత్రువుకు శత్రువు మిత్రుడే కదా..!
ఈ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేయడం లేదని జగన్ ప్రకటించారు. దీంతో సెటిలర్లలో వైఎస్, జగన్ అభిమానుల్లో ఎవరికి ఓటేయాలనే మీమాంస నెలకొంది. అయితే, వీరిలో ఎక్కువ శాతం టీఆర్ఎస్ కి మద్దతు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందుకు రెండు కారణాలు ఉన్నాయంటున్నారు. చంద్రబాబు నాయుడు కీలకంగా ఉన్న ప్రజాకూటమి గెలిస్తే ఆరు నెలల తర్వాత ఏపీలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీకి కలిసివస్తుందని వారి ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రాకపోవడాన్నే తన ఖాతాలో వేసుకున్న చంద్రబాబు... తెలంగాణలో ప్రజాకూటమి గెలిస్తే మాత్రం ఏపీ ఎన్నికల్లో బాగా ఉపయోగించుకుని జగన్ ను ఓడించే అవకాశం ఉంటుందనుకుంటున్నారు. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సెటిలర్లకు ఏ విధమైన ఇబ్బంది కూడా లేకపోవడం మరో కారణంగా కనిపిస్తోంది. ఇక జగన్ పట్ల టీఆర్ఎస్ కి కొంత సానుకూలతే ఉంది. ఇటీవల జగన్ పై హత్యాయత్నం సంఘటన జరిగినప్పుడు కూడా కేసీఆర్ జగన్ కి ఫోన్ చేసి పరామర్శించారు. కేటీఆర్, కవిత కూడా ఘటనను ఖండించారు. టీఆర్ఎస్ మంత్రి తలసాని స్వయంగా వెళ్లి పరామర్శించారు. ఈ పరిణామాలు కూడా జగన్ అభిమానులను టీఆర్ఎస్ కి దగ్గర చేస్తున్నట్లు కనిపిస్తోంది.
నేటి సమావేశంలో ఏం తెలుస్తారు ?
ఇదే సమయంలో నేడు కూకట్ పల్లిలో జరగనున్న ఓ సమావేశం చర్చనీయాంశమైంది. కేసీఆర్ కి సీమాంధ్రుల సంఘీభావం పేరుతో సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. ఈ సమావేశం వెనుక కొందరు జగన్ అభిమానులే ఉన్నట్లు తెలుస్తోంది. సమావేశానికి సంబంధించి వాట్సాప్ లో మెసేజ్ లు చక్కర్లు కొడుతున్నాయి. శత్రువుకు శ్రతువు మిత్రుడు అన్నట్లుగా జగన్ కి శత్రువుగా ఉన్న చంద్రబాబుకు శత్రువు కేసీఆర్ ను వీరు మిత్రుడిగా భావిస్తున్నట్లు సదరు మేసేజ్ లు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన సెటిలర్లు, ఓ సామాజకవర్గానికి చెందిన సెటిలర్లు ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశ్యం మాత్రం జగన్ అభిమానుల్లో టీఆర్ఎస్ కి మద్దతు ఇచ్చేలా ఓ క్లారిటీ తీసుకురావడమే అని తెలుస్తోంది.