ఆల్టర్నేటివ్ జగన్ చూసుకున్నారే...!!!
వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్న ప్రశాంత్ కిషోర్ బీహార్ రాజకీయాల్లో బిజీగా మారారు. దీంతో ప్రశాంత్ కిషోర్ తన సేవలను పూర్తికాలం అందించలేనని వైసీపీ అధినేత జగన్ కు చెప్పేశారు. ఇటీవల ప్రశాంతకిషోర్ బీహార్ లో జనతాదళ్ యు ఉపాధ్యక్షుడిగా పదవీ బాధ్యతలను చేపట్టారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీహార్ లో బీజేపీ, జేడీయూ కూటమిని గెలిపించడమే లక్ష్యంగా ప్రశాంత్ కిషోర్ అక్కడ కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. దీంతో ప్రశాంత్ కిషోర్ ఇక వైసీపీకి పూర్తి స్థాయి సహకారం ఇక అందించరని తేలిపోయింది.
ప్రశాంత్ కిషోర్ వెళ్లిపోవడంతో.....
అయితే తాను బీహార్ రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ అవసరమైన పొలిటికల్ స్ట్రాటజీని అందిస్తానని జగన్ కు ప్రశాంత్ కిషోర్ హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. అయితే ప్రశాంత్ కిషోర్ టీం మాత్రం ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి పనిచేస్తుందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు జాతీయ స్థాయి సంస్థలను వైఎస్ జగన్ నియమించుకున్నట్లు సమాచారం. ఈ సంస్థల ద్వారానే సర్వేలు నిర్వహించుకునేలా జగన్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ టీం రాష్ట్రంలోని దాదాపు 150 నియోజకవర్గాల్లో రెండు దఫాలుగా సర్వేలు నిర్వహించారు. ఒక సర్వే జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రారంభం కాకముందు, మరొకటి పాదయాత్ర పూర్తయిన తర్వాత సర్వే నిర్వహించి నివేదికలు ఇచ్చారు.
త్రిముఖ పోటీ ఉండటంతో.....
జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రస్తుతం విజయనగరం జిల్లాలో జరుగుతోంది. మరికొద్ది రోజుల్లో చివరి జిల్లా అయిన శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించనుంది. జనవరి మొదటి వారానికి ప్రజాసంకల్ప పాదయాత్ర పూర్తవుతున్న నేపథ్యంలో అభ్యర్థులను ఖరారు చేయాలన్న యోచనలో పార్టీ అధినేత జగన్ ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్నప్పటికీ, ఈసారి త్రిముఖ పోటీ జరగనుండటంతో సామాజిక పరంగా, ఆర్థికంగా అభ్యర్థుల ఎంపికలో అన్ని జాగ్రత్తలు పాటించాలని ఇప్పటికే జగన్ సీనియర్ నేతలకు సూచించారు.
అతి విశ్వాసం ఉండకూడదని.....
గత ఎన్నికల్లో అతి విశ్వాసంతో వైసీపీ స్వల్ప తేడాతో అధికారం కోల్పోయింది. ఈసారి అలాకాకుండా పకడ్బందీగా అభ్యర్థుల ఎంపికను చేపట్టాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఎంపీ అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యేల అభ్యర్థుల ఎంపిక కూడా వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ప్రజాసంకల్ప పాదయాత్రకు విశేష స్పందన లభిస్తుండటం, వివిధ జాతీయ మీడియా సంస్థలు జరిపిన సర్వేల్లో అనుకూల ఫలితాలు రావడంతో కొంత ఆత్మవిశ్వాసం వైసీపీలో మెరుగైంది. దీంతో పాటు పాదయాత్ర పూర్తయిన తర్వాత బస్సు యాత్ర ద్వారా ఎన్నికల వరకూ నిత్యం ప్రజల్లో ఉండేలా జగన్ ప్లాన్ చేసుకోవడమూ కలసి వచ్చే అంశంగా ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. మొత్తం మీద ప్రశాంత్ కిషోర్ బీహార్ రాజకీయాలకు వెళ్లినా, జగన్ మాత్రం ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ఉన్నారన్నది పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.
- Tags
- andhra pradesh
- ap politics
- janasena party
- nara chandrababu naidu
- pawan kalyan
- prasanth kishore
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- ప్రశాంత్ కిషోర్
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ