ఈ వైసీపీ సీటు గెలుపు గ్యారంటీ...!
తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్న జిల్లా కేంద్రం కాకినాడ గ్రామీణ నియోజకవర్గం రాజకీయాలు ఆసక్తిగా మారాయి. ఇక్కడ గెలిచిన అభ్యర్థి తాలూకు పార్టీ అధికారంలోకి వస్తోంది. గతంలో చాలా సార్లు ఇదే జరిగింది. ప్రస్తుతం ఇక్కడ టీడీపీ హవా సాగుతోంది. కాకినాడ ఎంపీ సహా ఎమ్మెల్యే సీట్లలో టీడీపీ జోరు కొనసాగుతోంది. అయితే, సాధారణంగా సిట్టింగ్ ఎంపీ, ఎమ్మెల్యేలపై ఉండే వ్యతిరేకత ఇక్కడ కూడా కొనసాగుతోంది. ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మిపై తీవ్ర వ్యతిరేకత కొనసాగుతోంది. ఆమె పేరుకే ఎమ్మెల్యేగా ఉన్నారని, పెత్తనం అంతా ఆమె భర్త నిర్వహిస్తున్నారని, ఎక్కడికి వెళ్లినా ముందు ఆయనే షెడ్యూల్ తెలుసుకుని వ్యవహరిస్తున్నారని పెద్ద ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా ప్రజలు ఎవరైనా కూడా ఎమ్మెల్యేని కలవాలంటే.. మూడంచెల్లో అనుమతి తీసుకోవాల్సి ఉంటుందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇక అనంతలక్ష్మి కుమారుల వ్యవహారం... వారు వ్యవహరిస్తోన్న తీరు నియోజకవర్గంలో ఆమెకు, పార్టీకి పెద్ద మైనస్‌గా మారింది. దీనిపై ఇప్పటికే అధిష్టానానికి కూడా నివేదికలు వెళ్లాయి.
పిల్లికి వ్యతిరేక పవనాలు......
దీనికి ప్రధాన కారణం ఆమె భర్తేనని అంటున్నారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే అధికార పార్టీకి చెందిన సీనియర్ నేత పిల్లికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఇక, ఇక్కడ వైసీపీ తరుఫున కురసాల కన్నబాబు ఉన్నారు. అయితే, ఆయన గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. దీనికి ముందు ఆయన కాంగ్రెస్‌లో కీలక వ్యక్తిగా చక్రం తిప్పారు. అయితే, రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన ఆయన ఎన్నికల సమయంలో ఏ పార్టీలోనూ చేరకుండా స్వతంత్రంగా బరిలోకి దిగారు. అయితే ఆ ఎన్నికల్లోపరాజయం పాలయ్యారు. మూడో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత ఆయన వెంటనే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక, అప్పటి ఎన్నికల్లో వైసీపీ తరఫున చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ బరిలో నిలిచారు. టీడీపీ తరఫున పోటీ చేసిన పిల్లి అనంతలక్ష్మికి గట్టి పోటీ ఇచ్చారు. అయితే, చివరి నిముషంలో ఆయన రెండో స్థానానికే పరిమితమయ్యారు. ఆ తర్వాత ఆయన నియోజకవర్గంలో పెద్దగా యాక్టివ్ పార్ట్ తీసుకోలేక పోయారు.
కన్నబాబు రికార్డు.....
ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే కన్నబాబు ఏకంగా 43 వేల ఓట్లు తెచ్చుకుని రికార్డు క్రియేట్ చేశారు. 2009లో ప్రజారాజ్యం నుంచి గెలిచిన ఆయన గత పదేళ్లలో నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా పాతుకుపోయారు. ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం అవ్వడంతో ఆయన గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఈ రేంజ్లో ఓట్లు చీల్చడం ఆయనకు అక్కడ ఉన్న వ్యక్తిగత ఇమేజ్ను సూచిస్తోంది. ఆ తర్వాత ఆయన వైసీపీలోకి రావడం... జగన్ కన్నబాబును జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించడం జరిగాయి. జగన్ పాదయాత్ర మొత్తం కన్నబాబు కనుసన్నల్లోనే జరుగుతుంది. ఆయన దగ్గరుండి అధినేతకు జిల్లా సమస్యలను వివరిస్తున్నారు.
టీడీపీలో అసంతృప్తులను బుజ్జగిస్తూ.....
ప్రస్తుత పరిస్థితిని చూస్తే.. వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా కురసాల కన్నబాబు వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయననే ఇక్కడ నుంచి పోటీ నిలబెట్టాలని జగన్ డిసైడ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మరింత విస్తృతంగా నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ప్రజలను కలుస్తున్నారు. కాకినాడ రూరల్, కరప మండలాలతో పాటు కాకినాడ కార్పొరేషన్ పరిధిలోని ఆరు డివిజన్లలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీ నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కార్పొరేషన్ ఎన్నికల వరకు వైసీపీకి మంచి పట్టు ఉందన్న అంచనాతో ఉన్న నేతలకు ఆ ఎన్నికల ఫలితాలు షాకివ్వడం, ఆరు డివిజన్లలో అభ్యర్థులు ఓటమి పాలవడంతో కొంత నిరాశ చెందినా.... నియోజకవర్గంలో అన్నీ తానై వ్యవహరిం చడంతోపాటు తన గెలుపుపై కన్నబాబుపై వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. టీడీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలు, కార్యకర్తలను బుజ్జగిస్తూ వైసీపీలో చేర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక్కడ కన్నబాబుకే వైసీపీ అభ్యర్థిత్వం ఖరారవ్వడం, పోటీదారులు లేకపోవడంతో అంతా తానై వ్యవహరిస్తూ గెలుపుకోసం వ్యూహాలు రచిస్తున్నారు.
- Tags
- andhra pradesh
- ap politics
- janasena party
- kakinada rural constiuency
- kurasala kannababu
- nara chandrababu naidu
- pilli anantha lakshmi
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- కాకినాడ రూరల్ నియోజకవర్గం
- కురసాల కన్నబాబు
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- పిల్లి అనంతలక్ష్మి
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ