ఈ సీటు వైసీపీకి బంగారు పళ్లెంలో పెట్టి అప్పగిస్తారా?
రాజకీయాల్లో కొన్ని నిర్ణయాలు.. పార్టీలకు పుట్టగతులు కూడా లేకుండా చేస్తాయని అంటారు పరిశీలకులు. గతం నుంచి పాఠాలు నేర్వని వైనం .. పార్టీలకు చెంప పట్టుగా పరిణమిస్తున్న దాఖలాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అలాంటి తప్పునే ఏపీ అధికార పార్టీ టీడీపీ చేస్తోందని అంటున్నారు పరిశీలకులు. విషయంలోకి వెళ్తే.. విజయవాడ తూర్పు నియోజకవర్గం టీడీపీలో టికెట్ ముసలం పుట్టింది. ఈ టికెట్ కోసం ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రయత్నిస్తున్నారు. అయితే, ఈయనకు చెక్ పెట్టాలని టీడీపీలోని మంత్రి దేవినేని ఉమ వర్గం ప్రయత్నిస్తోంది. దీనికి కారణాలు ప్రత్యేకంగా ఏమీ లేవు. గద్దెకు ఉన్న అనూహ్య ప్రజాదరణను, అధినేత చంద్రబాబు వద్ద ఉన్న మార్కులు చూసి ఓర్చుకోలేక పోవడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
అవినాష్ కు టిక్కెట్ కోసం......
ఈ క్రమంలోనే దేవినేని ఉమ వచ్చే ఎన్నికల్లో తనకు అనుకూలంగా ఉండే వ్యక్తికి టికెట్ ఇప్పించుకునేలా చాప కింద నీరులా చక్రం తిప్పుతున్నారట. ఈ నేపథ్యంలో దివంగత నేత దేవినేని నెహ్రూ కుమారుడు దేవినేని అవినాష్ పేరును తెరమీదికి తెస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తూర్పు నుంచి అవినాష్‌ను రంగంలోకి దింపండం ద్వారా టీడీపీ విజయం సాధించే అవకాశం ఉందని , ప్రస్తుతం గద్దెకు ఓ వర్గం వ్యతిరేకంగా ఉందని దేవినేని వర్గం వాళ్లు ప్రచారం చేస్తున్నారు. కానీ, ఇటీవల చంద్రబాబు వెల్లడించిన మార్కుల్లో 70% మార్కులతో గద్దె రామ్మోహన్ ముందు వరుసలో ఉన్నారు. అయినా.. కూడా వైసీపీ నుంచి యలమంచిలి రవి రంగంలోకి దిగితే.. పరిస్తితి యూటర్న్ తీసుకుంటుందని గద్దె ఓటమి ఖాయమని జరుగుతోన్న ప్రచారం వెనక దేవినేని వర్గం ఉందన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
సానుభూతి పనిచేస్తుందా?
అదేసమయంలో దేవినేని నెహ్రూ మృతి వల్ల వచ్చిన సింపతీ పార్టీకి కలిసొచ్చే అంశమని ఆ వర్గం వాళ్లు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే గద్దెకు బదులుగా అవినాష్‌ను రంగంలోకి దింపితే బాగుంటుందని ఆయన అధినేత కు చెప్పాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. కట్ చేస్తే.. ఒకవేళ చంద్రబాబు మంత్రి దేవినేని మాటలు విని దేవినేని అవినాష్‌కు టికెట్ కేటాయిస్తే.. పరిస్థితి ఎలా ఉంటుందనే చర్చ జరుగుతోంది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
యలమంచిలికి ప్రయోజనమేనా?
తన తండ్రి దేవినేని రాజశేఖర్ ఉరఫ్ నెహ్రూ ప్రజల్లో సాధించిన పేరులో పావలా అంత కూడా అవినాష్ సాధించలేదనేది ప్రస్తుతం చర్చకు వస్తున్న అంశం. అంతేకాదు, నెహ్రూ ఉన్న రోజుల్లోనే 2014లో ఎంపీగా పోటీ చేసిన అవినాష్ అప్పటి ఎన్నికల్లో కనీస డిపాజిట్ కూడా రాబట్టుకోలేక పోయారు. కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన అవినాష్ తమకు అనుచరగణం ఉన్న తూర్పు, సెంట్రల్ లో కూడా ప్రభావం చూపలేకపోయారు. మరి ఇప్పటికైనా పరిస్థితి మెరుగైందా? అంటే అది కూడా కనిపించడం లేదు. మరి ఈనేపథ్యంలో సెంటిమెంట్ పేరుతో అవినాష్‌ను రంగంలోకి దింపితే.. చేజేతులా.. తూర్పు సీటును వైసీపీ నాయకుడు యలమంచిలికి బంగారు పళ్లెంలో పెట్టి అందించినట్టే అవుతుందని అంటున్నారు పరిశీలకులు.
- Tags
- andhra pradesh
- ap politics
- devineni avinash
- devineni uma
- gadde rammohan
- nara chandrababu naidu
- telugudesam party
- vijayawada
- y.s jaganmohanreddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- గద్దె రామ్మోహన్
- తెలుగుదేశం పార్టీ
- దేవినేని అవినాష్
- దేవినేని ఉమ
- నారా చంద్రబాబునాయుడు
- విజయవాడ
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ