టీడీపీకి మరో షాక్...వైసీపీలోకి...?
టీడీపీకి షాక్ షాక్ ల మీద షాక్ లిస్తున్నారు వైసీపీ అధినేత జగన్. పార్టీలో చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వైసీపీలో చేరికలు జోరందుకుంది. ఇటీవలే యలమంచిలి రవి పార్టీలో చేరడం, ఈనెల 29న కాటసాని రాంభూపాల్ రెడ్డి పార్టీలో చేరుతున్నారు. దీంతో వైసీపీలో ఉత్సాహం రెట్టింపయింది. మరోవైపు టీడీపీ ఎడతెగని పంచాయతీలతో సతమతమవుతూనే ఉంది. చంద్రబాబు పూర్తి సమయాన్ని ఇప్పుడు పార్టీలో పంచాయతీలు తీర్చడానికే వెచ్చిస్తున్నారు. జగన్ మాత్రం పాదయాత్ర చేస్తూనే చేరికలు పచ్చజెండా ఊపేస్తున్నారు.
వైసీపీలోకి క్యూ కడుతున్న....
వైసీపీ ప్రత్యేకహోదా నినాదంలో ముందుండటం, జగన్ పాదయాత్రతో దూసుకుపోతుండటంతో ఆ పార్టీకి కొంత ఎడ్జ్ ఉందని రాజకీయ నేతలు కూడా అంచనా వేస్తున్నారు. అధికారపార్టీపై అసంతృప్తితో పాటు స్థానిక ఎమ్మెల్యేల మీద అసహనం కూడా వైసీపీకి కలసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. దీంతో ఫ్యాన్ పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. పార్టీ మారుతున్న నేతలను చంద్రబాబు బుజ్జగిస్తున్నా, వారికి ఎటువంటి హామీ ఇవ్వలేకపోతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పదవి ఇస్తామని చెబుతుండటంతో వారు బాబు మాటలను విశ్వసించలేక వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు.
మాజీ ఎమ్మెల్యే కన్నబాబు.....
తాజాగా విశాఖకు చెందిన మాజీ ఎమ్మెల్యే కన్నబాబు వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన చెప్పేశారు. మే 5వ తేదీన జగన్ సమక్షంలో తాను పార్టీలో చేరుతున్నట్లు కన్నబాబు చెప్పారు. కన్నబాబు కాంగ్రెస్ టైంలో యలమంచిలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యంవహించారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే తెలుగుదేశం అధినేత చంద్రబాబు, మంత్రి నారాలోకేష్ తనకు న్యాయం చేస్తానని చెప్పి నమ్మించి మోసం చేశారన్నారు కన్నబాబు. ఈసారి యలమంచలి నియోజకవర్గంలో టీడీపీ సీటు దక్కడం కూడా కష్టమేనని భావించిన కన్నబాబు వైసీపీ గూటికి చేరుతున్నారు. విశాఖ జిల్లాలో కన్నబాబు చేరికతో కొంత బలం పెరగుతుందని వైసీపీ భావిస్తోంది.