ఆ నలుగురిని జగన్ చేర్చుకుంటారా?
జంప్ చేసిన ఎమ్మెల్యేలు తిరిగి సొంత గూటికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే తమకు వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వవద్దని తమ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరికి సీటు ఇవ్వాలన్నది వారి విజ్ఞప్తిగా ఉంటోంది. వైసీపీ గుర్తు మీద గెలిచి టీడీపీలోకి 23 మంది ఎమ్మెల్యేలు వెళ్లపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో చాలా మందికి అధికార పార్టీ నేతలతో పొసగడం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కొద్దిగా అధికారులు భయపడి తమ మాట వినేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. అక్కడ టీడీపీ ఇన్ ఛార్జిదే మొత్తం హవా. ఆయన చెప్పినట్లు నడవాల్సిందే. దీంతో వైసీపీ నుంచి జంప్ అయిన కొందరు ఎమ్మెల్యేలు పునరాలోచనలో పడ్డారు.
ఫ్యాన్ గూటికి వచ్చేస్తామంటూ....
ఈ మేరకు నలుగురు ఎమ్మెల్యేలు తిరిగి ఫ్యాన్ గూటికి వస్తామని జగన్ కు వర్తమానం పంపారు. ఇద్దరు సీనియర్ నేతలతో సంప్రదించిన వీరు తమను పార్టీలో చేర్చుకుంటే చాలని, టిక్కెట్లు తమకు ఇవ్వకపోయినా ఫరవాలేదని కూడా చెప్పినట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు, కర్నూలు జిల్లాకు చెందిన ఒకరు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మరొక ఎమ్మెల్యే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీరు తమకు టిక్కెట్ ఇవ్వకపోయినా పరవాలేదని, వచ్చే ఎన్నికల్లో తమ కుటుంబ సభ్యుల్లో ఒకరికి టిక్కెట్ ఇస్తే సరిపోతుందని సీనియర్ నేతల ముందు తమ ప్రతిపాదన ఉంచినట్లు తెలుస్తోంది.
తమ కుటుంబ సభ్యులకు....
పార్టీ మారినందుకు తమపై వ్యతిరేకత నియోజకవర్గంలో ఉంటే అది పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని, అవసరమైతే అధికార పార్టీ పెట్టిన ప్రలోభాలను కూడా బయటకు చెబుతామని వారిలో ఇద్దరు ముందుకు వస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని పాదయాత్రలో ఉన్న జగన్ దృష్టికి తీసుకెళ్తే ఆయన నవ్వి ఊరుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వెళ్లిపోవడం ఎందుకు? రావడం ఎందుకు? అని జగన్ నవ్వారని జగన్ పాదయాత్రలో ఉన్న వైసీపీ నేత ఒకరు చెప్పారు. ఇలా పార్టీలు మారితే వారికి ఏం క్రెడిబిలిటీ ఉంటుందని కూడా జగన్ ప్రశ్నించారని, అయితే వారిని చేర్చుకుంటారా? లేదా? అన్న విషయంపై జగన్ క్లారిటీ మాత్రం ఇవ్వలేదని చెబుతున్నారు.
జగన్ నవ్వేశారట....
ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఈరోజు జగన్ పచ్చ జెండా ఊపితే వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారని వైసీపీనేత ఒకరు చెప్పారు. అయితే ఇప్పుడు వారిని చేర్చుకుంటే లాభం ఏం ఉంటుందని కూడా ఆలోచిస్తున్నారు. పార్టీ మారిన వారిపై సహజంగా అసంతృప్తి ఉందని, వారు పార్టీ మారి వెళ్లిన తర్వాత నియోజకవర్గానికి సమన్వయ కర్తగా ఉన్న వారిని ఎలా విస్మరిస్తామని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ వారి రాకకు ఓకే చెబుతారా? లేదా? అన్నది వైసీపీలో పెద్దయెత్తున చర్చ జరుగుతోంది. మొత్తం మీద జంప్ చేసిన ఎమ్మెల్యేల్లో నలుగురు మాత్రం త్వరలోనే టీడీపీపై బాంబ్ బ్లాస్ట్ చేస్తారన్న టాక్ ఉంది. చూద్దాం.