ఇక్కడ రాయితీలు కాదు.. అక్కడ వడ్డింపులు వేస్తార్ట!
వెనకటికి ఓ కథ ఉంది.
అనగనగా ఒక అడవిలో ఉండే ఒక బందిపోటు దొంగ ఆ దారమ్మట వెళ్లే వారందరినీ బెదిరించి దోచుకుంటూ ఉండేవాడుట. అడవిమార్గంలో వెళ్లే ప్రజలందరికీ అతడంటే భయం.. కానీ.. వేరే దారిలేదు. ఇదిలా ఉండగా.. ఆ దొంగకు అవసాన దశ సమీపించి , కొడుకును పిలిచి.. ‘‘నాకు మంచి పేరు వచ్చేలా ఏమైనా చేయరా’’ అన్నాట్ట. తర్వాత చనిపోయాడు.
తండ్రి చనిపోయాక అతడికి మంచిపేరు తీసుకురావడం ఎలాగో సదరు పుత్రరత్నానికి అర్థం కాలేదు. చాలా ఆలోచించి చివరకు ఓ నిర్ణయానికి వచ్చాడు. అడవిదారిలో వెళ్లే ప్రజలను పూర్తిగా దోచుకుని, వారిని చితక్కొట్టి పంపించడం ప్రారంభించాట్ట.
పాపం జనం మొత్తం.. వీడి తండ్రి ఉండేవాడు.. వాడు చాలా మంచోడు.. దోచుకునే వాడు గానీ.. కొట్టేవాడు కాదు అనుకోసాగారుట. వారి మాటలు విని.. అబ్బా నా తండ్రిని మంచోడు అంటూ అందరూ పొగిడేలా చేశాను అని దొంగ మురిసిపోయాట్ట.
.... ఇంచుమించుగా ఈ కథలాగానే ఉంది మోదీ సర్కారు అనుసరిస్తున్న పద్ధతి కూడా.
డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించడానికి సర్కారు కసరత్తు చేస్తుండడం బాగానే ఉంది. కానీ అందుకోసం ఆ దిశగా ప్రోత్సాహకాలను ప్రకటించడం బదులుగా.. నగదుతో లావాదేవీ చేసే వారికి కొత్త వడ్డింపులు వేయడం ద్వారా.. నగదు లావాదేవీ అంటేనే భయపడిపోయే పరిస్థితిని కల్పించడం కేంద్రప్రభుత్వం కొత్త ఆలోచనగా ఉన్నదని వార్తలు వస్తున్నాయి. డిజిటల్ లావాదేవీలను పెంచడమే లక్ష్యం అన్నట్లుగా కేంద్రం రకరకాల లాటరీలు ఇతర పథకాలను కూడా ప్రకటించింది. ఇంకా అనేక రకాల కసరత్తులు ఇందుకోసం చేస్తోంది. అయితే కొత్తగా వస్తున్న వార్తలను బట్టి రెండోవైపు నుంచి నరుక్కు రావడంపై వీరు దృష్టి పెడుతున్నారట.
అంటే డిజిటల్ పెంచడం కాదు, నగదు లావాదేవీలు తగ్గించడం అన్నమాట. అందుకోసం కేంద్రం బహుశా.. ‘నగదు లావాదేవీ’ అంటేనే ప్రజలు భయపడిపోయే పరిస్థితిని కల్పించదలచుకున్నట్లుగా ఉంది. ఆ రకంగా నగదు చేసే కొనుగోళ్లు ఇతర వ్యవహారాలపై అదనపు రుసుము, సుంకాలు వేయదలచుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
అయినా పిలక పెంచుకోవడం మీద కూడా మారుమాట్లాడకుండా పన్నులుచెల్లించిన చరిత్ర ఉన్న దేశం మనది. సర్కారు వారు ఏలాంటి పన్నుల పేరిట వేధించినా సరే.. మౌనంగా భరించడం మనకు అలవాటైపోతుందేమో.