ఇద్దరూ...ఇద్దరే....నవ్వులపాలయ్యారు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏవగింపు కలిగిస్తున్నాయి. ప్రత్యేక హోదా ఛాంపియన్ షిప్ సాధించే ప్రయత్నంలో భాగంగా ఏపీ పరువును హస్తిన నడిరోడ్డుపైకి నెడుతున్నాయి. ఇటు అధికార తెలుగుదేశం పార్టీ, ఇటు ప్రతిపక్ష వైసీపీ కూడా దెందూ దొందే. అవిశ్వాసం వల్ల ప్రయోజనమేదీ లేదని తెలిసినా తామే రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడుతున్నామంటూ నాలుగేళ్ల తర్వాత రంకెలు వేస్తున్నాయి. వాస్తవానికి ఈ పని అధికార పార్టీ ముందే చేయాల్సి ఉంది. కాని కేంద్ర ప్రభుత్వంతో ఉన్న అవసరాల దృష్ట్యా ప్రత్యేక హోదాను పక్కన పెట్టిందన్నది అందరికీ తెలిసిందే.
నాలుగేళ్ల తర్వాత....
ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం పార్టీ ఉన్నట్లుండి స్టాండ్ మార్చుకోవడానికి గల కారణాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని అందరికీ తెలిసిందే. ఆ విషయం టీడీపీ అధినేతకూ తెలియంది కాదు. తానొక్కరినే నిజాయితీపరుడినని, బస్సులో పడుకుని మరీ పాలన సాగించానని, అవినీతికి ఆమడదూరంలో ఉంటానని పదే పదే చెబుతున్న చంద్రబాబుకు ప్రత్యేక హోదా రాదన్న విషయం ఇప్పుడు కాదు 2016లోనే తెలుసు. అయినా ప్రత్యేక ప్యాకేజీ కోసం వస్తుందేమోననుకుని కేంద్రం చేతిలో మోసపోయానని ఇప్పుడు నింపాదిగా చెబుతున్నారు.
ఇప్పుడు గుర్తుకొచ్చి....
నాలుగేళ్లు నాన్చి ఎన్నికల సమయానికి ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకే తెలుగుదేశం ప్రయత్నం అన్నది ఎవరికీ తెలియంది కాదు. కాకుంటే అధికార పార్టీ, ఏపీలో బలంగా ఉన్న పార్టీ ఉద్యమిస్తే ప్రత్యేక హోదా వస్తుందేమోనన్న ఆశతో మాత్రమే ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాని చంద్రబాబు మాత్రం ఆ తప్పును బీజేపీ పైకి నెట్టే ప్రయత్నం బాగానే చేస్తున్నారు. ఆయన బీజేపీపైనే కాకుండా ప్రతిపక్ష వైసీపీ మీద కూడా బురద జల్లే కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. ముస్లిం మైనారిటీల సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు ట్రిపుల్ తలాక్ విషయంలో తమ పార్టీ ముస్లింలకు అనుకూలంగా వ్యవహరిస్తే, వైసీపీ బీజేపీ చెంతన చేరిందని ధ్వజెమెత్తారు.
వైసీపీ కూడా తక్కువ తినలేదే....
మరోవైపు వైసీపీ కూడా తక్కువేం తినలేదు. ప్రత్యేక హోదా సాధన కోసం తొలి నుంచి వైసీపీ పోరాటం చేస్తున్న మాట వాస్తవమే అయినప్పటికీ, కొన్ని విషయాల్లో వైసీపీ తప్పటడుగులు వేసిందన్న విమర్శలను ఎదుర్కొంటోంది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల సమయంలోనే ప్రత్యేక హోదా నినాదాన్ని లింక్ చేసి బీజేపీకి మద్దతిచ్చి ఉంటే ఆ పార్టీపై నమ్మకం ఉండేది. జగన్ తన కేసుల నుంచి తప్పించుకోవడం కోసమే బీజేపీతో చేతులు కలిపారన్న టీడీపీ విమర్శలు కూడా సహజంగా నమ్మదగినవిగానే ఉన్నాయి. అయితే ఐదుగురు ఎంపీల బలం మాత్రమే ఉన్న వైసీపీ అవిశ్వాసంపై హస్తిన లో చేస్తున్న హైడ్రామాను కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇలా రెండు పార్టీలూ రాజకీయ అవసరాల కోసమే ప్రత్యేక హోదాను భుజానకెత్తుకున్నాయి తప్ప సాధించాలన్న చిత్తశుద్ధి లేదన్నది వాస్తవం. ఈ నేపథ్యంలో గత పదిరోజులుగా ఢిల్లీలో ఈ రెండు పార్టీలూ అనుసరిస్తున్న వ్యవహారాన్ని చూసి జాతీయ పార్టీల నేతలు కూడా నవ్వుకునే పరిస్థితి. ఇలా ఈ రెండు పార్టీలూ వచ్చే ఎన్నికల్లో ఓట్ల వర్షం కురిపించే ప్రత్యేక హోదాను పట్టుకుని, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఏపీ పరువును బజారు కీడుస్తున్నారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. రెండు పార్టీలు కలిసి ఇతర పార్టీల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేయకుండా, ఒకరిపై ఒకరు పార్లమెంటు బయట దుమ్మెత్తు పోసుకుంటున్న తీరు వీరి వైఖరిని చెప్పకనే తెలుస్తోంది.