ఏపీపై బీజేపీ స్కెచ్ ఇదేనా?
ఎన్డీయే కూటమి నుంచి టీడీపీ బయటకు రావడంతో బీజేపీ అధిష్ఠానం అప్రమత్తం అయింది. ఆంధ్రప్రదేశ్ లో పార్టీని బలోపేతం చేస్తూ టీడీపీకి చెక్ పెట్టేందుకు కసరత్తు మొదలు పెట్టింది. ఇప్పటికే ఢిల్లీలో రాష్ట్ర బీజేపీ నేతలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించండం మరో రాజకీయ పరిణామానికి దారితీసే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే టార్గెట్ గా బీజేపీ అధిష్ఠానం వ్యూహం ఉంటుందని, ఈ మేరకు టీడీపీ జాతీయ అధిష్టానం స్కెచ్ రెడీ చేసిందని తెలుస్తోంది.
ఎవరితో పొత్తు?
ఇక టీడీపీ ఎన్డీయేతో పొత్తు తెగతెంపులు చేసుకోవడంతో రాష్ట్రంలో మాత్రం వైఎస్సార్ సీపీ, లేదా జనసేన తో పొత్తు కుదుర్చునే అవకాశాలు, దీని వల్ల తమకు ఎంత ప్రయోజనం ఉంటుందన్న కోణంలోనూ ఆ పార్టీ జాతీయ నేతలు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతర్గతంగా.. బీజేపీతో వైసీపీ ఒక అవగాహన కుదుర్చుకున్న తర్వాతనే వైసీపీ అవిశ్వాస తీర్మానం నాటకానికి తెరలేపినట్లు టీడీపీ నేతలు ఆరోపించారు. వైసీపీ అవిశ్వాస తీర్మానం విషయంలో నిజాయితీగా లేనందునే తాము మద్దతు విరమించుకుని.. తామే స్వయంగా కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు వారు చెబుతున్నారు.
చంద్రబాబు పసిగట్టి.....
ఇక గుంటూరు సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేవలం చంద్రబాబు నాయుడినే ప్రధానంగా టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేశారు. బీజేపీపై మాత్రం విమర్శలు చేయలేదు. మరోవైపు కొద్ది రోజుల క్రితం.. బీజేపీతో పొత్తుకు సానుకూలంగా ఉన్నట్లు వైసీపీ నేత విజయసాయిరెడ్డి చెప్పడం కూడా వైసీపీ అవిశ్వాస తీర్మానానికి టీడీపీ మద్దతు ఇవ్వకపోవడం మరో కారణంగా పలువురు నాయకులు అంటున్నారు. ఇలా బీజేపీకి టీడీపీ దూరమవుతున్న వేళ వైసీపీ దగ్గరయ్యేందుకు చేసిన ప్రయత్నాలను చంద్రబాబు పసిగట్టినట్లు సమాచారం.
ముమ్మరంగా చర్చలు....
ఇదిలా ఉండగా.. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే విషయంలో టీడీపీ, వైఎస్సార్ సీపీ రెండూ నాటకాలు ఆడుతున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలన్న పట్టుదలతో వైసీపీ అధినేత జగన్ ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలవకపోతే తన పార్టీ మనుగడ కష్టమన్న విషయం జగన్ కు తెలుసునని, అందుకే బీజేపీ కలిసి నడిచే ఒక అనివార్య పరిస్థితి జగన్ ముందు ఉందని పలువురు నేతలు అంటున్నారు. అయితే అది ఎన్నికల తర్వాతనే జగన్ అంగకరిస్తారన్నది బీజేపీకి తెలియంది కాదు. టీడీపీని ఓడించాలన్నా.. పార్టీ బలోపేతం కావాలన్నా.. వైసీపీతో కలిసి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి బీజేపీ ముందు ఉంది. ఇక జనసేన విషయంలో మాత్రం బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. వైసీపీ అధినేతను కాదనుకుంటే బీజేపీకి జనసేనే ఆప్షన్. ఇప్పుడు ఢిల్లీలో రాష్ట్ర బీజేపీ నేతలతో అధిష్ఠానం నిర్వహించే సమావేశంలో ఇవే విషయాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని పలువురు నాయకులు అంటున్నారు.
- Tags
- బీజేపీ