కేసీఆర్ బర్త్ డే ఈసారి వెరీ వెరీ స్పెషల్ ఎందుకంటే...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సారి తన బర్త్ డేతోనే ఎన్నికల వ్యూహాన్ని మొదలు పెట్టారు. 2019 ఎన్నికలను లక్ష్యంగా చేసుకోవడనాకి కేసీఆర తన పుట్టిన రోజునే ఎంచుకున్నారు. ఇప్పటి వరకూ కేసీఆర్ పై ఒక అపప్రధ ఉండేది. ప్రజలను, నేతలను, ప్రజాసంఘాలను కలవరనే విమర్శ ఉంది. గడచిన రెండున్నరేళ్లుగా కేసీఆర్ అతికొద్ది మంది మంత్రలును మాత్రమే కలిసేవారు. మిగిలిన నాయకులకు ఆయనను కలవాలంటే గగనమే. అయితే ఈ రెండున్నరేళ్లు మొండిగా వ్యవహరించిన కేసీఆర్ తన పుట్టినరోజు నుంచే పంథాను మార్చుకున్నట్లు చెబుతున్నారు. ప్రజలకు, నేతలకు అందుబాటులో ఉండేందుకు సమయాన్ని వెచ్చిస్తున్నారు. గత పుట్టిన రోజు వేడుకలకు, ఈసారి జరిగిన వేడుకులకు చాలా తేడా ఉందని సొంత పార్టీ నేతలే అంటున్నారు.
ఎన్నికలే లక్ష్యంగా...
2019 ఎన్నికల్లో మళ్లీ గెలవడమే గులాబీ దళపతి లక్ష్యం. అయితే నిన్న..మొన్నటి వరకూ గెలుపుపై ధీమాగా ఉండేవారు కేసీఆర్. తాను చేపట్టిన పథకాలే తనకు విజయాన్ని తెచ్చి పెడతాయని భావించారు. మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ వంటి పథకాలు ప్రజల్లోకి బాగా వెళ్లాయి. కొన్ని ప్రాంతాల్లో సాగు నీరు ఎరుగని పొలాలకు కూడా నీళ్లందుతున్నాయి. కరెంటు కష్టాలను అధిగమించారు. ఉద్యోగ నియామకాల ప్రక్రియను వేగవంతం చేశారు. కులాల వారీగా నిధుల కేటాయింపులు చేస్తున్నారు. కాని ప్రజల్లో కొంత అసంతృప్తి నెలకొందన్న నివేదికలు కేసీఆర్ ను అలెర్ట్ చేశాయంటున్నారు. రెండున్నరేళ్ల ముందునుంచే సరికొత్త పథకాలతో ప్రజల ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందుకోసమే జనహిత కార్యక్రమం ఏర్పాటు చేశారు. వివిధ వర్గాలు,కులాల ప్రజలను కలుసుకునేందుకు ఇది వేదికగా మారింది.
జనహిత ద్వారా.....
జనహిత కార్యక్రమం ద్వారా నేరుగా ప్రజలను కలుసుకుని వారిద్వారానే సమస్యలను వినేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. వరుసగా కలుస్తున్నారు. చేనేత కార్మికులను కలుసుకున్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం ఈ బడ్జెట్ లో అధిక నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. నెలకు నేత కార్మికుడు 13 వేల రూపాయల వరకూ సంపాదించుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. సిరిసిల్ల కార్మికులను ప్రత్యేకంగా ఆదుకుంటామన్నారు. ఇలా వరుసగా ఆయన అన్ని సమస్యలనూ ప్రజల నుంచి ఆ సంఘాల నేతల నుంచే వినాలని నిర్ణయించుకున్నారు. విపక్ష పార్టీలు వరుసగా సమస్యలపై పోరాటం చేస్తుండటంతో....దానిని జనహిత ద్వారానే తిప్పికొట్టాలన్నది కేసీఆర్ వ్యూహంగా కన్పిస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గత పుట్టిన రోజులు జరుపుకున్నారు. కాని ఇంత ఆర్భాటం లేదు. సాదాసీదాగా జరిగాయి. కాని ఈసారి మాత్రం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాయి ఆ పార్టీ శ్రేణులు. ఎన్నికల సమయం ఇంకా రెండేళ్లు మాత్రమే ఉండటంతో ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నారు. జనహిత తోపాటు ఇక జిల్లా పర్యటనలు కూడా చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలను వేగం పెంచాలని కూడా అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు పనులను ముమ్మరం చేయాలని కూడా నీటిపారుదల శాఖ అధికారులకు లక్ష్యాన్ని విధించారు. ఇలా కేసీఆర్ తన పుట్టిన రోజు నాడే జనాలను కలుసుకునే ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పటి నుంచే జనాలకు చేరువకావాలని కేసీఆర్ నిర్ణయించుకోవడంతో పార్టీ శ్రేణులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.