క్యాష్ లెస్సూ...కస్సుబుస్సూ...
ఏం జరుగుతుందో తెలియదు. ఎన్నాళ్లకు పరిస్థితులు కుదుట పడతాయో తెలియదు. నల్లధనం ఎంతపట్టుకున్నారో లెక్కతెలియదు. డీమానిటైజేషన్, రీమానిటైజేషన్..బ్లాక్ మనీ, అన్ అకౌంట్ మనీ ఈ పదాల అర్థమే అంతుచిక్కదు. కానీ మామూలు మనిషి..ఆమ్ ఆద్మీ మాత్రం అడ్డంగా బుక్కయిపోయాడు. నలభై రోజులు గడిచినా నడిరోడ్డుమీదే బతుకు తెల్లారిపోతోంది. రిజర్వు బ్యాంకు , వాణిజ్య బ్యాంకుల వద్ద ఉండాల్సిన అధిక విలువ కలిగిన నోట్లమొత్తాన్ని తీసేస్తే మిగిలిన 13 లక్షల కోట్లు బ్యాంకులకు డిపాజిట్ల రూపంలో వచ్చేశాయి. అంటే ఎవ్వరూ సొమ్మును గోదావరిలో పారేసుకోలేదు. తగలబెట్టుకోనూ లేదు. ఏదో అకౌంట్లో వేసేశారనే తేటతెల్లమైపోతోంది. మరి కొండను తవ్వి ఏం సాధించినట్లు ? అంటే సర్కారు వద్ద సమాధానం లేదు.
ఇప్పుడు తాజాగా క్యాష్ లెస్ ఎకానమీ అంటూ కొత్త పల్లవి మొదలైంది. ఇదెంతవరకూ సాధ్యమో మరి ప్రధానమంత్రికే తెలియాలి. దేశంలోని ఆరులక్షల గ్రామాలకు గాను అయిదున్నర లక్షల గ్రామాల్లో అసలు బ్యాంకు శాఖలు లేవు. ఏటీఎం లూ లేవు. పాయింట్ ఆఫ్ సేల్స్ యంత్రాలూ లేవు. అంటే నూట ముఫ్పై కోట్ల జనాభాకు గాను తొంభై కోట్ల జనాభా కు క్యాష్ లెస్ కొనుగోళ్లు జరిపే అవకాశాలే లేవన్నమాట. అయినా ప్రభుత్వం మాత్రం అందని ద్రాక్షనే పట్టుకొని వేలాడుతోంది. నోట్ల రద్దు వైఫల్యానికి కొత్త ముసుగు తొడుగుతోంది.
ఇప్పటి వరకూ ఆరు లక్షల కోట్ల రూపాయల విలువైన కొత్త నోట్లను మార్కెట్లోకి విడుదల చేశామంటోంది. అయినా కరెన్సీ కష్టాలు మాత్రం తీరడం లేదు. నూటికి ఎనభై శాతం ఏటీఎంలు పనిచేయడం లేదు. కనీసం వారానికి 24 వేల రూపాయలు ఇచ్చే పరిస్థితి బ్యాంకుల్లో కనిపించడం లేదు. ఒక వ్యవస్థపై నమ్మకం ఎప్పుడైతే సడలిందో ఇక ప్రజలు తమ సొంత భద్రతనే నమ్ముకుంటారు. అందుకే లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి విడుదల చేశామని రిజర్వు బ్యాంకు చెబుతున్నా కొత్త నోట్లు తిరిగి బ్యాంకులకు రావడం లేదు. అంటే ఎంత డ్రా చేసినా ఆ సొమ్మును ప్రజలు తమ వద్దే ఉంచుకుంటున్నారు. ఇది అవసరానికి మించి కూడా కావచ్చు. తమ అవసరాలకు తగిన మొత్తాన్ని ఏటీఎంలలో కానీ, బ్యాంకులలో కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చనే భరోసా లేకపోవడం తో ఇలా అసాధారణ పరిస్థితులు , అభద్రతా భావం ఏర్పడింది. దీంతో నిజానికి మనీ సర్క్యులేషన్ కూడా తగ్గిపోయింది.
పదికోట్ల కుటుంబాలు ఒక్కో కుటుంబం పదివేల చొప్పున ఇంట్లో దాచుకుంటే ఆ మొత్తం లక్ష కోట్లు అవుతుంది. దేశంలోని 50 కోట్ల కుటుంబాలు సగటున అంతే మొత్తం దాస్తే అయిదు లక్షల కోట్లకు చేరిపోతుంది. బ్యాంకింగు వ్యవస్థపై నమ్మకం సడలిన స్థితిలో దేశంలో అదే జరుగుతోంది. ప్రజలు సొంత అవసరాలు, కుటుంబ అవసరాల నిమిత్తం పొదుపు చేస్తున్నారు. రోజువారీ అవసరాలకు మించి నిల్వ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఎన్ని లక్షల కోట్ల రూపాయలను విడుదల చేసినా చెలామణిలోకి రావడం కష్టమనిపిస్తోంది. మళ్లీ ప్రజల్లో భరోసా ఏర్పడే వరకూ ఈ స్థితిలో మార్పు రాదు. ఈలోపు ఆర్థిక వ్యవస్థ దిగజారి జీడీపీ రెండు పాయింట్లు పడిపోయిందంటే అంతే సంగతులు. దేశ జాతీయస్థూల ఉత్పత్తి నూట నలభై లక్షల కోట్ల రూపాయలు. అంటే ఒక్కశాతం జీడిపీ పడిపోతే లక్షా నలభై వేల కోట్ల రూపాయలు పోయినట్లే.
మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ అంచనా ప్రకారం డీమోనిటైజేషన్ కారణంగా రెండు శాతం జీడీపీ పడిపోవచ్చు. అంటే ఎకానమీలో రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు పోయినట్లే. మన తలసరి ఆదాయం లక్ష రూపాయల లోపే ఉంది. అంటే దాదాపు 3 కోట్ల మంది ఏడాది పాటు ఉపాధి కోల్పోయినట్లే ..కాదంటారా మోడీ జీ... ఇందులో వ్యవసాయ కూలీల నుంచి కుటీర పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల వరకూ చిన్నాచితక బడుగు జీవులెందరెందరో ఉంటారు. అశ్వత్థామ హత: కుంజర: అన్నట్లుగా ఆరునెలలు కసరత్తు చేసి మూలనున్న ముసలవ్వ మీద యుద్ధానికి వెళ్లినట్లే అయిపోయింది ప్రభుత్వ తీరు. సామాన్యుడినే సంక్షోభంలోకి నెట్టేసింది సర్కారీ విధానం. ప్రజాస్వామ్య దేశంలో కచ్చితంగా ఇది పులిమీద సవారీ యే. అయితే ప్రభువుల సంగతి తేలేదెప్పుడో కానీ బడుగు బక్క మనిషి మాత్రం చిక్కిశల్యమైపోతున్నాడు. చితికి ఛిద్రమైపోతున్నాడు.
- Tags
- డీమానిటైజేషన్