చంద్రబాబు కెప్టెన్‌గా దేశంలో కొత్త కూటమి
దేశంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. మోడీ నియంతృత్వ ధోరణితో విసిగిపోయిన ఎన్డీయే భాగస్వామ్య పక్షాలే ఎప్పుడు బయటకు రావాలా ? అని వెయిట్ చేస్తున్నాయి. ఇప్పటికే శివసేన వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామన్న ప్రకటన చేసేసింది. ఇక టీడీపీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేయగా శుక్రవారం ఉదయమే మోడీ అండ్ కోకు షాక్ ఇస్తూ తాము ఎన్డీయే నుంచి కూడా బయటకు వచ్చేస్తున్నట్టు ప్రకటన చేసింది.
మరికొన్ని పార్టీలు కూడా....
ఇక ఇదే లిస్టులో మరి కొన్ని పార్టీలు కూడా ఎన్డీయే నుంచి బయటకు వచ్చేందుకు రెడీ అవుతున్నట్టు జాతీయ రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ఇప్పటికే యూపీలోని గోరఖ్‌పూర్, ఫుల్పూర్ లోక్‌సభ సీట్లతో పాటు బిహార్‌లోని అరారియా లోక్‌సభ సీటును బీజేపీ కోల్పోవడం, యూపీలో ఎస్పీ+బీఎస్పీ కాంబినేషన్ సక్సెస్ అవ్వడం, ఇటు బిహార్‌లో నితీష్+బీజేపీ మళ్లీ కలిసినా లాలూదే పై చేయి కావడం, అటు రాజస్థాన్‌లోనూ బీజేపీ రెండు సిట్టింగ్ ఎంపీ సీట్లు కోల్పోవడం, పంజాబ్, ఢిల్లీలో ఎదురు దెబ్బలు ఇలా చెప్పుకుంటూ పోతే రోజు రోజుకు బీజేపీ గ్రాఫ్ నార్త్‌లోనే ఎంత శరవేగంగా పడిపోతుందో చెపుతున్నాయి.
మరో కొత్త ఫ్రంట్....
ఇక ఇప్పటికే బలమైన యూపీఏ కూటమిని ఏర్పాటు చేసేందుకు రాహుల్ నడుం బిగించారు. వరుసగా ఆయన శరద్‌పవార్, మమతా బెనర్జీ లాంటి వాళ్లతో మీట్ అవుతున్నారు. ఇక ఇప్పుడు తాజాగా శుక్రవారం ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో జాతీయ రాజకీయాల్లో మరో కొత్త ఫ్రంట్ ఏర్పాటు కానుందా ? అంటే అవుననే ఆన్సరే వస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి వివిధ ప్రాంతీయ పార్టీలత కూడిన ఫెడరల్ ఫ్రంట్‌కు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నాయకత్వం వహించే అవకాశాలున్నాయంటూ బీజేపీకి కొమ్ము కాస్తోన్న రిపబ్లిక్ టీవీలో కథనాలు ప్రసారమయ్యాయి.
ఇప్పటికే ఏడు పార్టీల మద్దతు...
ఇక ఇప్పటికే ఈ కూటమిలో చంద్రబాబుకు 7 పార్టీలు మద్దతు ప్రకటించాయని, ఈ కూటమిని చంద్రబాబు మేలో అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని, ఎస్పీ, బీఎస్పీలతో పాటు ఇటు కలిసొస్తే తమకు బద్ధ శత్రువుగా ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్, మమతా బెనర్జీ, శివసేన లాంటి పార్టీలతో జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు చంద్రబాబు ఫెడరల్ ఫ్రండ్ కీలకం అవుతుందని కూడా రిపబ్లిక్ టీవీ పేర్కొంది. మరోవైపు.. ఫెడరల్ ప్రంట్‌పై పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఎంపీల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి.
బాబు తప్ప మరో లీడర్....
బీజేపీకి యాంటీగా ఈ కూటమి ఏర్పడితే దీనికి చంద్రబాబు తప్ప నాయకత్వం వహించే మరో లీడర్ లేడని కూడా పలువురు జాతీయ స్థాయి నాయకులు కూడా చెపుతున్నారు. ఇక బీజేపీ తీరుతో విసిగిపోయిన అకాళీదళ్ కూడా బయటకు వచ్చేందుకు రెడీగా ఉంది. అకాళీదళ్ ఎప్పటికప్పుడు టీడీపీకి సపోర్ట్‌గానే ఉంటోంది. ఏదేమైనా బీజేపీకి వ్యతిరేకంగా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అటు యూపీఏ ఆధ్వర్యంలోనే కాకుండా ఇటు చంద్రబాబు ఆధ్వర్యంలో ఏర్పడే ఫెడరల్ ఫ్రంట్‌తో దేశవ్యాప్తంగా ఎన్నో రాజకీయ సంచలనాలు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.