జగన్ కు రెండు రోజుల్లో జర్క్ ఇస్తారా?
వైసీపీకి చెందిన మరో కీలక నేత త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. జగన్ పాదయాత్ర ప్రారంభించిన తర్వాత వైసీపీకి కొంత ఇమేజ్ పెరిగిందని చెప్పడంలో అతిశయెక్తి లేదు. అయితే వైసీపీని వీక్ చేసేందుకు టీడీపీ అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇప్పటికే 22 మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకుని మానసికంగా దెబ్బకొట్టింది. జగన్ ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభమైన తర్వాత కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు వంతల రాజేశ్వరి, గిడ్డి ఈశ్వరి, ఎంపీ బుట్టా రేణుకలు పార్టీని వీడిపోయారు. అయినాజగన్ ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా ముందుకు సాగుతున్నారు.
క్యాంపు నిర్వహించాలని.....
అయితే రాజ్యసభ ఎన్నికలు జరుగుతుండటంతో ప్రస్తుతమున్న 44 మంది ఎమ్మెల్యేలు వైసీపీకి కీలకం. వైసీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని జగన్ ప్రకటించారు. ఆయన నామినేషన్ కూడా వేశారు. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు జారిపోతే జగన్ పార్టీ ఆ ఒక్క స్థానం దక్కించుకోవడమూ కష్టమే. అందుకోసం ప్రత్యేకంగా వారిని క్యాంప్ కు తరలించాలని జగన్ పార్టీ భావిస్తుంది. 44 మంది ఎమ్మెల్యేలను అందరినీ కాకుండా కొంతమందినే క్యాంపుకు తరలించాలని భావిస్తున్నారు. ఈ బాధ్యతను వేమిరెడ్డికే అప్పగించినట్లు తెలుస్తోంది. ముఖ్యమైన నేతలను వదిలి మిగిలిన ఎమ్మెల్యేందరినీ నేడో, రేపో క్యాంప్ కు తరలించనున్నారు.
తాజాగా వైసీపీ కీలకనేతను....
ఇదిలా ఉండగా టీడీపీ మాత్రం ఆపరేషన్ ఆకర్ష్ ను మానుకోలేదని తెలుస్తోంది. తాజాగా కాకినాడ వైసీపీ పార్లమెంటు ఇన్ ఛార్జిగా ఉన్న చలమలశెట్టి సునీల్ ను టీడీపీలోకి తీసుకొచ్చే కార్యక్రమం దాదాపుగా పూర్తయినట్లు తెలుస్తోంది. మరో రెండు, మూడురోజుల్లోనూ సునీల్ పసుపుకండువా కప్పుకునే అవకాశముందంటున్నారు. చలమలశెట్టి సునీల్ కు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి మధ్య విభేదాలు తలెత్తాయి. ఎన్నిసార్లో ఈ వివాదం పార్టీ అధినేత వద్దకు వెళ్లింది. అయినా పరిష్కారం కాలేదు.
సునీల్ కు మంచి ఆఫర్.....
చలమలశెట్టి సునీల్ తనకు కాకినాడ ఎంపీ టిక్కెట్ తో పాటు తన దగ్గరి బంధువు ముత్యాల శ్రీనుకు జగ్గంపేట టిక్కెట్ ను వచ్చే ఎన్నికల్లో ఇవ్వాలని కోరుతున్నారు. అయితే జగన్ నుంచి ఈ ప్రతిపాదనపై పెద్దగా స్పందన రాలేదు. దీంతో తనకు ప్రాధాన్యత దక్కడం లేదన్న అసంతృప్తితో చలమలశెట్టి సునీల్ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సునీల్ కు టీడీపీ నుంచి ఆఫర్ వచ్చిందంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కాకినాడ ఎంపీ స్థానాన్ని సునీల్ కు ఇస్తామని చెప్పడంతో ఆయన పార్టీ మారేందుకు సిద్ధమయినట్లు సమాచారం. ప్రస్తుతం ఎంపీగా ఉన్న తోట నరసింహంను వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. దీంతో సునీల్ రెండు రోజుల్లో సైకిల్ ఎక్కేస్తారని తెలుస్తోంది. ఎమ్మెల్యేలు జారిపోకుండా జగన్ కాపాడుకుంటుంటే, ముఖ్యమైన నేతలపైన టీడీపీ దృష్టి పెట్టిందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.
- Tags
- జగన్