జేసీని విధిలేక భరిస్తున్నారా?
అనంతపురంలో జేసీ బ్రదర్స్ తమ పట్టును నిలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ నుంచి గత ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన జేసీ బ్రదర్స్ ఒకరు ఎంపీగానూ, ఒకరు ఎమ్మెల్యేగానూ ఎన్నికయ్యారు. అనంతపురంలో ఒక సామాజికవర్గం పట్టును దెబ్బతీయాలన్న లక్ష్యంతోనే జేసీ బ్రదర్స్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అనేక సందర్భాల్లో ప్రభుత్వాన్ని కూడా ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయినా చంద్రబాబు జేసీ బ్రదర్స్ ను విధిలేక భరిస్తున్నారన్న టాక్ పార్టీలో విన్పిస్తోంది.
ప్రభాకర్ చౌదరికి వ్యతిరేకంగా.....
ఇప్పటికే జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి వ్యతిరేకంగా పావులు కదిపారు. ఆయనకు చెక్ పెట్టడానికి వైసీపీ నుంచి గురునాధరెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చారన్న విమర్శలు కూడా టీడీపీ నుంచే విన్పించాయి. ప్రభాకర్ చౌదరి గురునాధరెడ్డి చేరికను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన చంద్రబాబు వద్దనే తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. అయితే చంద్రబాబు ప్రభాకర్ చౌదరికి నచ్చజెప్పి గురునాధరెడ్డిని పార్టీలోకి చేర్చుకున్నారు. అయితే వీరిద్దరూ కలిసే పరిస్థతి లేదన్నది అనంత వాసులకు అందరికీ తెలిసిన విషయమే.
రహదారి విస్తరణ పనుల్లో....
అనంతపురం పట్టణంలో రహదారి విస్తరణను చేపట్టాలని జేసీ దివాకర్ రెడ్డి, వద్దని ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి మధ్య వివాదం తలెత్తింది. విస్తరణ చేపట్టకుంటే రాజీనామా చేస్తానని హెచ్చరించి జేసీ సంచలనమే సృష్టించారు. విస్తరణ జరిపితే తాను రాజీనామా చేస్తానని ప్రభాకర్ చౌదరి వార్నింగ్ ఇచ్చారు. ఈ వివాదమే చివరకు పెద్దదయింది. అయితే తనను కాదని పార్టీలోకి తీసుకున్న గురునాధరెడ్డికి ఎటువంటి పదవి ఇచ్చినా తాను అంగీకరించబోనని ప్రభాకర్ చౌదరి తేల్చి చెప్పారు. అందువల్లనే తొలుత చంద్రబాబు గురునాధరెడ్డికి అనంతపురం అర్బన్ డెవలెప్ మెంట్ అథారిటీ ఛైర్మన్ పదవి ఇద్దామనుకున్నా ప్రభాకర్ చౌదరి జోక్యంతో ఆగారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
తాజాగా పుట్టపర్తిలోనూ.....
ఇదిలా ఉండగా జేసీ దివాకర్ రెడ్డికి గతంలో పీఏ గా పనిచేసిన సురేష్ రెడ్డి పుట్టపర్తి నియోజకవర్గం టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. సురేష్ రెడ్డి పంచాయతీరాజ్ శాఖలో పనిచేశారు. తర్వాత జేసీ పీఏగా కూడా ఉన్నారు. అయితే ఆయన గతకొంతకాలంగా పుట్టపర్తి నియోజకవర్గంలో ఉంటూ పట్టుపెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జేసీ ద్వారా టిక్కెట్ తెచ్చుకోవాలని భావిస్తున్నారు. ప్రభుత్వ విప్ పల్లె రఘునాధరెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దీనిపై పల్లె వర్గీయులు సురేష్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈనేపథ్యంలో సురేష్ రెడ్డి క్రికెట్ బెట్టింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. అవమానాన్ని భరించలేక ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. పల్లె రఘునాధరెడ్డి కావాలని పోలీసులకు చెప్పి అరెస్ట్ చేయించారని సురేష్ రెడ్డి కుటుంబీకులు బహిరంగంగానే ఆరో్పిస్తున్నారు.జేసీ అనంతపురంలో అన్ని నియోజకవర్గాల్లో వేలుపెట్టాలని చూస్తున్నారని, ఇది సరైంది కాదని అంటున్నారు టీడీపీ నేతలు. మొత్తం మీద అనంతపురంలో జేసీ వ్యవహారం చంద్రబాబుకు తలనొప్పిగా మారింది.