తెలంగాణ కాంగ్రెస్ లో ఇది సాధ్యమా?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచుతోంది. అభ్యర్ధులను ఏడాది ముందే ప్రకటిస్తుందట. ఏడాది ముందే అభ్యర్ధులను నిర్ణయించడం వల్ల నియోజకవర్గంలోని ప్రతి ఓటరును కలుసుకునే వీలుంటుందని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతోంది. టీపీసీసీ తన అభిప్రాయాన్ని ఇప్పటికే హైకమాండ్ కు కూడా పంపిందని చెబుతున్నారు. అభ్యర్ధులను ఖరారు చేసేందుకు కూడా ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అభ్యర్ధుల నుంచి ముందుగా దరఖాస్తులు కోరాలని కూడా నిర్ణయించారు. నియోజకవర్గాల వారీగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి...తర్వాత వాటిని స్క్రూటినీ చేస్తారు. డీసీసీ అధ్యక్షులతో పాటు కమిటీ కూర్చుని అభ్యర్ధులకు సీట్ల కేటాయింపు పై ఒక నిర్ణయం తీసుకుంటుంది. అంతేకాకుండా పార్టీ ప్రయివేటుగా నియోజకవర్గాల వారీగా సర్వే చేయిస్తుంది. ఈ సర్వేలో విజయావకాశాలు ఎవరికి ఉన్నాయో వారికే సీట్లు కేటాయించాలని పార్టీ భావిస్తుంది.
సీనియర్ల సెటైర్లు....
అయితే ఇది సాధ్యం కాదంటున్నారు సీనియర్ నేతలు. ఏడాది ముందు అభ్యర్ధులను ప్రకటించినందున అవతల పార్టీలకు మంచి అవకాశమిచ్చినట్లలవుతుందంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసిన అభ్యర్దులకు పోటీగా సరైన అభ్యర్ధిని నిలబెట్టేందుకు వైరి పక్షానికి అవకాశమిచ్చినట్లవుతుందంటున్నారు. ఇప్పడు జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా అభ్యర్ధుల ఎంపిక ఎలా జరిగిందో చూశారు కదా? అని చమత్కరిస్తున్నారు. పొత్తులు ఎవరితో ఉంటాయో? ఉండవో? తెలియకుండా పీసీసీ అధ్యక్షుడు ఏడాది ముందే అభ్యర్ధులను ప్రకటిస్తామని చెప్పడం అర్ధరహితమని వ్యాఖ్యానిస్తున్నారు. డీసీసీ అధ్యక్షులకు టిక్కెట్లు ఇవ్వబోమని చెప్పడం కూడా సరికాదని మరికొందరు అంటున్నారు. అధికారంలో లేనప్పడు పార్టీకి అన్నీ తానై వ్యవహరించి..క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు అండగా ఉంటున్నవారికి టిక్కెట్లు ఇవ్వకపోతే వారు ఎలా పార్టీ అభివృద్ధిపై దృష్టి పెడతామని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఏడాది ముందే అభ్యర్ధులను ప్రకటిస్తానని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి.
యూత్ పై ప్రత్యేక దృష్టి......
మరోవైపు కాంగ్రెస్ యువ ఓటర్లపై దృష్టి పెట్టాలని నిర్ణయించింది. గత ఎన్నికల్లో యువత తమకు ఓట్లు వేయనందునే అధికారానికి దూరమయ్యాయని భావించి తప్పు దిద్దుకునే ప్రయత్నంలో పడింది కాంగ్రెస్. పార్టీ అనుబంధ శాఖల్లో యువతకు ఎక్కువ అవకాశమిచ్చి వారిని ఆకర్షించుకోవాలని నిశ్చయించింది. గత ఎన్నికల్లో 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వయస్సున్న యువత కాంగ్రెస్ కు ఓటు వేయలేదని గుర్తించింది. ఈమేరకు తాజా సర్వేలో వెల్లడి కావడంతో దిద్దుబాటు చర్యలకు నడుంబిగించింది. యూనివర్సిటీలు, కళాశాలలల్లో సెమినార్లు నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టాలని భావిస్తోంది. నిరుద్యోగ సమస్యపై ఉద్యమించాలని అందులో పెద్దయెత్తున యువకులు పాల్గొనేలా చేయాలని నేతలకు సూచించింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఓయూ ఆర్ట్స్ కళాశాలలో ఎన్.ఎస్.యూ.ఐ., యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగసభను నిర్వహించి దానికి రాహుల్ గాంధీని ఆహ్వానించాలని భావిస్తున్నారు. మొత్తం మీద యువతను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ అన్ని రకాల ప్రయత్నాలనూ ప్రారంభించింది.