తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి మొదలయింది. అన్ని రాజకీయ పార్టీలూ ఎమ్మెల్సీ ఎన్నికలపైనే ప్రధానంగా దృష్టి పెట్టాయి. ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండటంతో అధికార పార్టీ నుంచి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ లో సందడి వాతావరణ నెలకొంది. ఆశావహులు నేతల చుట్టూ ప్రదిక్షిణలు చేస్తున్నారు. రెండు మూడు రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. దీంతో ప్రధాన రాజకీయ పక్షాలన్నీ దీనిపైనే దృష్టి కేంద్రీకరించాయి.
గులాబీ పార్టీకే అవకాశం...
పెద్దల సభకు వెళ్లాలన్న ఉత్సాహంతో గులాబీ నేతలు సీఎం క్యాంపు కార్యాలయానికి క్యూ కడుతున్నారు. మార్చి 29వ తేదీన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కె. జనార్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే కోటాలో లో గంగాధర్ గౌడ్, హైదర్ రజ్వీ, మాగం రంగారెడ్డి పదవీకాలం ముగుస్తోంది. మే 27వ తేదీతో నామినేటెడ్ ఎమ్మెల్సీలు డి. రాజేశ్వరరావు, ఫారూఖ్ హుస్సేన్ పదవీ కాలం కూడా ముగియనుంది. దీంతో మొత్తం ఏడు స్థానాలకు తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగాల్సి ఉంది. నోటిఫికేషన్ రెండు మూడు రోజుల్లో వచ్చే అవకాశముండటంతో పార్టీల నేతలు కూడా పలువురు తమ అనుచరుల పేర్లు అధిష్టానం ముందు పెడుతున్నారు. శాసనమండలిలో టీఆర్ఎస్ దే పైచేయి. మొత్తం 40 ఎమ్మెల్సీ స్థానాల్లో 29 స్థానాల్లో గులాబీ పార్టీకి చెందిన వారే ఉన్నారు. వీరిలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు. అసెంబ్లీలో కూడా అధికార పార్టీకి బలం పుష్కలంగా ఉండటంతో అత్యధిక స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశముంది. ఎంఐఎం ఈసారి కూడా తమ స్థానాన్ని తమకే వదిలేయాలని కోరుతోంది. ఇంకా పేర్లు ఖరారు కాకపోయినప్పటికీ తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయపార్టీల్లో కాక పుట్టిస్తున్నాయి.
- Tags
- తెలంగాణ మండలి