పంజాబ్, గోవా రాష్ట్రాల ఎన్నికలు నేడు
పంజాబ్, గోవా రాష్ట్ర ఎన్నికలు నేడు జరగనున్నాయి. పంజాబ్ లో అకాళీదళ్ బీజేపీ కూటమి, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు పోటీ పడుతున్నాయి. హ్యాట్రిక్ కొట్టాలని అకాళీదళ్, ఎలాగైనా పంజాబ్ పీఠంపై జెండా ఎగరేసి మోడీకి సవాలు విసరాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతున్నాయి. మధ్యలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తమ గెలుపు ఖాయమని చెబుతోంది. పంజాబ్ లో ఈరోజు 117 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రచారం ముగిసి ఇక అభ్యర్ధులందరూ నేటి పోలింగ్ పైనే దృష్టి పెట్టారు. ప్రధానంగా పంజాబ్ రాష్ట్రంలో అత్యధిక స్థానాలున్న మాల్యా ప్రాంతాన్ని అన్ని పార్టీలూ చుట్టి వచ్చేశాయి. ప్రధాని మోడీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లు రోడ్ షోలు, బహిరంగ సభలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మాల్యా ప్రాంతంలో 69 స్థానాలు ఉండటంతో అందరూ ఇక్కడే స్పెషల్ కాన్సన్ ట్రేషన్ చేశారు.
ఎవరి వాదన వారిదే...
అధికార పార్టీపై వ్యతిరేకత తమకు అనుకూలంగా మారుతుందిని కాంగ్రెస్ భావిస్తోంది. పదేళ్ల నుంచి అకాళీదళ్ పంజాబ్ చేసిందేమీ లేదని తన ప్రచారంలో ప్రధానాస్త్రంగా వాడింది. కాంగ్రెస్ కు పట్టం కడితే డ్రగ్స్ మాఫియా నుంచి పంజాబ్ ను రక్షిస్తామని కూడా హామీ ఇచ్చింది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం రెండు పార్టీలూ ప్రజలను మోసం చేసినవేనని, తమకు ఒకసారి అధికారం ఇస్తే పంజాబ్ స్వరూపాన్నే మార్చి వేస్తామని చెబుతోంది. పంజాబ్ లో త్రిముఖ పోటీ ఉండటం తమకు కలిసొస్తుందని అకాళీదళ్, బీజేపీ కూటమి ఆశపడుతున్నాయి. ఆమ్ ఆద్మీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలిస్తే అది తమకు లాభించే అంశమని ఆపార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు.
నువ్వా?...నేనా?....
ఇక గోవా రాష్ట్రంలో ఎన్నికలు నేడు జరగనున్నాయి. గోవాలో 40 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రధానంగా చతుర్ముఖ పోటీ నెలకొన్నా ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోరు ఉందంటున్నారు. విశ్లేషకులు. అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి కూడా కాషాయం జెండా ఎగరేయాలని భావిస్తోంది. చిన్న రాష్ట్రాన్నైనా చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ తపిస్తోంది. రెండు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందుకు రావాలని ఎన్నికల కమిషన్ పిలుపునిచ్చింది. మొత్తం మీద పంజాబ్, గోవా రాష్ట్ర ఓటర్లు ఎటు వైపు మొగ్గు చూపుతారో?...