పవన్ స్క్రిప్ట్ ఉండవల్లిదేనా...?
మాటల మాంత్రికుడు, మంచి రచనా దురంధరుడు అయిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్ జనసేన ఆవిర్భావ సభలో పవన్ ప్రసంగానికి స్క్రిప్ట్ అందించారా ? ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కి ఉండవల్లి అరుణ కుమార్ ను గత నెల పవన్ కళ్యాణ్ ఎంపిక చేయడం వారిద్దరూ సన్నిహితంగా మెలగడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తుంది. ఇదే అనుమానాలను టిడిపి సైతం వ్యక్తం చేస్తుంది. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి కి స్క్రిప్ట్స్ కానీ ఆయన విపక్ష నేతగా వున్నప్పుడు చంద్రబాబు కి వ్యతిరేకంగా రాసిన లేఖల తయారీ ఉండవల్లే రచించేవారు. రాజీవ్, సోనియా , వంటివారికి అనువాదకుడిగా ఆయన ప్రసంగాలు అద్భుతంగా సాగేవి. ఇక వన్ మ్యాన్ షో పేరిట ఉండవల్లి సభలకు ఒక సినీహీరోకీ వచ్చే రేంజ్ లో జనం వచ్చి మరీ వినేవారు.
అధ్యయనం చేశారా?
జైఆంధ్ర ఉద్యమంలో యువకుడిగా జైలు కెళ్లిన ఉండవల్లి కేవలం తన ప్రసంగాలతోనే రాజకీయంగా అత్యున్నత స్థాయికి ఎదిగారు. అదే ఉద్యమంలో ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆంధ్రులకు హీరో అయ్యారు. వీరిద్దరూ మాటలను తూటాల్లా పేలుస్తూ ప్రజాస్వామ్య అత్యున్నత శిఖరమైన పార్లమెంట్ లో అడుగుపెట్టడం విశేషం. గత కొంతకాలంగా పవన్ మాటల్లో పదును పెరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తప్పులు అధ్యయనం చేయడం వల్ల కావొచ్చు, వివిధ అంశాల్లో నిష్ణాతులైన వారితో చర్చించడం వల్ల కావొచ్చు పవన్ సమస్యలపై లోతైన అవగాహనను తక్కువ సమయంలోనే తెచ్చుకున్నారు. ఇంతటి మార్పులో ఉండవల్లి సహకారం ఉందనే అంతా భావిస్తున్నారు. రాష్ట్రంలో జనసేన దూసుకుపోవడానికి ఇంతకన్నా అవకాశం లేదని ఉండవల్లి ఇంతకుముందే తేల్చి చెప్పారు. అధికారంలో వున్న టిడిపి , బిజెపి తప్పులను సూటిగా ఎండగడితేనే ప్రజల్లో హీరో అవుతారని ఆ అవకాశం పవన్ అందిపుచ్చుకోవాలని దిశా నిర్దేశం చేశారు. తన నోటి వెంట వచ్చే మాటల కన్నా సెలబ్రిటీ గాను, యువత లో క్రేజ్ వున్న పీకే చెపితే ప్రజల్లో మంచి స్పందన ఉంటుందని అరుణ కుమార్ నేరుగా మీడియా సమావేశాల్లోనే అనేవారు. పవన్ ఇప్పుడు సరిగ్గా అదే చేశారు.
గతంలో పస లేని పవన్ ప్రసంగాలు ...
గతంలో పవన్ కళ్యాణ్ పెట్టిన బహిరంగ సభల్లో కావొచ్చు మీడియా సమావేశాల్లో ఏ మాత్రం స్పష్టత లేదంటూ రాజకీయ విశ్లేషకులు ఆయన పైనా కొత్త పార్టీపై విరుచుకుపడేవారు. గత ఉండవల్లి పవన్ తో జత కట్టాక పికె రాజకీయ విమర్శల్లో పదును పెరిగింది. స్పష్టంగా సూటిగా డొంకతిరుగుడు లేకుండా ఆయన మాట్లాడటం మొదలు పెట్టేశారు. వాస్తవానికి గుంటూరు సభలో పవన్ తెలుగుదేశం పై చేసిన విమర్శలన్నీ గతంలో ఉండవల్లి అరుణ కుమార్ పదే పదే మీడియా సమావేశాల్లో చెబుతూ వస్తున్న అంశాలే కావడం గమనార్హం. త్రివిక్రమ్ తో సన్నిహితంగా వుండే పవన్ ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ ఫాలో అవుతారనే టాక్ వుంది. అది సినిమాల్లో బానే ఉంటుంది కానీ పొలిటికల్ గా వీక్ అవుతుందనే విమర్శలు పవన్ దృష్టికి పార్టీ వ్యూహకర్తలు తీసుకువెళ్లారు. దాంతో పవర్ ఫుల్ స్క్రిప్ట్ కి ఉండవల్లిపై పవన్ ఆధారపడ్డారు అంటున్నారు. ఇప్పడు ఆ స్క్రిప్ట్ ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్ట్టించింది. తెలుగుదేశం ఏజెంట్ పవన్ అంటూ ఇన్నాళ్లు సాగిన ప్రచారం పటాపంచలు అవ్వడమే కాకుండా ఏపీలో థర్డ్ ఫోర్స్ తడాఖా చూపించే విధంగా నడిచింది. ఇప్పుడు అందరి చూపు ఉండవల్లి పై మరోసారి పడింది. ముఖ్యంగా టిడిపి నేతలు పవన్ పై విమర్శలు కన్నా ఉండవల్లి పైనే దృష్టి పెట్టడం ఇక్కడ గమనార్హం.