వెంకయ్య వ్యూహాన్ని తోసిపుచ్చిన మోదీ!
ఓటు బ్యాంకు రాజకీయాల్లో ఒక ప్రతిపాదనను వెంకయ్యనాయుడు అద్భుతమైనదిగా భావిస్తే.. దానిని ప్రధాని మోదీ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చినట్లు కనిపిస్తోంది. తాను చెప్పిన వ్యూహానికి డంగైపోయి... వెంటనే మోదీ ఆమోదించేస్తారని అనుకున వెంకయ్యనాయుడు ఇప్పుడు నాలిక్కరచుకుంటున్నారు. నిందలు భరిస్తున్నారు. తన సలహాను సూచనను మోదీ కనీసం పరిగణనలోకి తీసుకోకపోవడంతో.. వెంకయ్యనాయుడుకు పాపం.. మొహం చాటేసుకోవాల్సిన పరిస్థితి దాపురించినట్లుగా ఉంది. ఈ ఉపోద్ఘాతం అంతా.. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన గొడవ. అవును అది ఇప్పుడు.. వెంకయ్య మీద నిందలకు దారితీస్తోంది.
ఎస్సీల్లో మాల- మాదిగల మధ్య విద్యా ఉద్యోగాల్లో , పంపకాల్లో న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఎస్సీల వర్గీకరణ అనేది దేశంలో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న అంశమే. ఇటీవల మాదిగలు పెద్ద స్థాయిలో సభ నిర్వహిచింనప్పుడు.. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్వయంగా ఆ సభలో పాల్గొన్నారు. ఎస్సీల వర్గీకరణకు కేంద్రం కట్టుబడి ఉన్నదని ప్రకటించారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు పెట్టేస్తాం అని కూడా వాగ్దానం చేశారు. అయితే వెంకయ్య నిజానికి ఈ విషయాన్ని సీరియస్ గానే తీసుకున్నారు. ఆయన ఢిల్లీ వెళ్లగానే మోదీని కలిసి ఎస్సీల వర్గీకరణ చేయాల్సిన ‘అవసరాన్ని’ గురించి నొక్కి చెప్పారు. ఇక అంతా అయిపోతుందని అనుకుంటున్న తరుణంలో.. మోదీ వైపునుంచి స్పందన రాలేదు. ఆయన ఈ సూచనను పట్టించుకోలేదు.
ఈలోగా మాదిగల ఆందోళనలు ఢిల్లీకి చేరాయి. బుధ, గురువారాల్లో వారు ధర్నాలు చేయబోతున్నారు. వెంకయ్య ఈ సమావేశాల్లో బిల్లు పెడతాం అని చెప్పి మోసం చేశారంటూ నిందలు వేస్తున్నారు. పాపం.. వెంకయ్య పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలాగా అయిపోయింది.
నిజానికి వెంకయ్య లాజికల్ గానే ఈ నిర్ణయం ద్వారా తమకు కలిగే రాజకీయ లబ్ధి గురించి మోదీకి వివరించినట్లు వదంతులు ఉన్నాయి. ఎస్సీల్లో మాలల్లో క్రిస్టియన్లు ఎక్కువని, ఇప్పటికే వీరంతా కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నారని, రిజర్వేషన్ అనుకూల నిర్ణయం తీసుకుంటే.. మాదిగలను సాలిడ్ గా తమవైపు మరల్చుకోవచ్చునని ఆయన వివరించినట్లు సమాచారం. అయితే మోదీ మాత్రం పట్టించుకున్నట్లు లేదు. మరి మాదిగల ఆందోళనలు మరింత పెరుగుతూ ఉండగా.. పరిస్థితుల్ని వారు ఎలా నెగ్గుకొస్తారో చూడాలి.