సెటైర్ : నాలుకలో భూకంపం
’’పరమాత్ముడు ప్రసాదించినటువంటి ఈ జీవితం అనేది ఏటైతే ఉన్నాదో.. అది ఎప్పటికీ అట్టాగ నున్నటి రోడ్డు మీద కారులో ఎలబారినట్టు... సమ్మంగా సాగిపోరాదు... అందులో కాసింత ఎత్తూ పల్లాలూ, ఎగుడూదిగుడులూ కూడా తప్పకుండా ఉండాల ఏటంటావు’’
‘‘బగమంతుడి తరవాత అంతటోల్లు.. తమరోమాట సెలవిచ్చిన తరవాత.. నేనేటంటాను సామీ.. రైటంటాను.. జై కొడ్తాను’’
‘‘సరైన మడిసివి సెబాసైన మాటంటివి. సాంతం సుఖాలే ఉంటే జీవితం అనే మాయ రక్తి కట్టదు. యెల్తురు తరవాత చీకటి రావాల. సుకం తరవాత కస్టం రావాల. లేకుంటే పరమాత్ముడి ఆట మీద మడిసికి మనసు మళ్లదు.. మడిసిలో అహంకారం అనే దెయ్యం జెడలు విప్పి ఐటం సాంగు డ్యాన్సు ఆడుతుంది’’.
‘‘అదేదో యిప్పి ఆడుతుందన్నారే.. అది ఆడ దెయ్యమా మగ దెయ్యమా సామీ’’
‘‘యిప్పేది- యెదవ దేహాన్ని కప్పి ఉంచే బట్టల్ని కాదు యెదవా.. ఏదో తూకం బాగుందని ఓ మాట వాడాను.. అసలు పాయింటు వొదిలేసి.. కొసరుమీద డౌట్లేంట్రా ఏబ్రాసీ శిష్య పెరమాణువా..’’
‘‘మన్నించండి సామీ.. బుర్ర మన్ను తిన్నాది’’
‘‘సరే యిను.. ఎగుడుదిగుడులు లేకుంటే జీవితం రంజుగా ఉండదు. ఆ మాదిరిగానే.. ఈ పెపంచికం కూడా... ఏదైనా మంచి పాలనలో అన్నీ సక్కంగా జరిగిపోతా ఉంటే... జనంలోమజా ఎందుకుంటాది? మన్ను తిన్న పాములాగా సప్పుడు సెయ్యకుండా పడుంటే ఏటౌతాది? అప్పుడప్పుడు బుసలు యినిపిస్తేనే జనం కాస్త కసిగా ఉండేది’’
‘‘యిప్పుటికి అరగంట అయినాది, ఇయ్యాల తమరేటి సెలవియ్యబోతున్నారో.. నాకేటి మతించట్లేదు సామీ’’
‘‘వొస్తన్నా.. వొస్తన్నా.. ఆత్రపడబోక.
అందుకే ఈ పెపంచికంలోకి అప్పుడప్పుడూ కొన్ని ఉపద్రవాలు వొస్తుండాల? ఉప్పెనలు వస్తుండాల? భూకంపాలూ పుడతండాల...’’
‘‘ఇక్కడేదో యాదికొస్తండాది సామీ’’
‘‘సెబ్బాస్...’’
‘‘చిత్తం సామీ’’
==
‘‘మన నాయకులకు జెనం మీద చానా పేముంటాది.’’
‘‘అవును సామీ.. మరి వోళ్లు వోట్లేస్తేనే గదా.. మనుసుల జాతిలో ఉండే వాళ్లు నాయకుల జాతిలోకి మారేది’’
‘‘అందుకే తమను నాయకులుగా మార్చేసిన జెనానికి ఏదోటి సెయ్యాలని వోళ్లలో ఒక ఉబలాటం ఉంటాది. పెపంచం మైదానం మాదిర్తో.. సాఫీగా సాగిపోగూడదని వోళ్లు అనుకుంటారు... జెనానికి కొన్ని ఎగుడులూ దిగుడులూ పెడితే తప్ప రక్తి కట్టదని, తమ మీద భక్తి పుట్టదని కొత్త కొత్త డెసీషనింగు జేస్తంటారు’’
‘‘తమరు నోట్ల రద్దు గురించి సెలవిస్తన్నారా సామీ’’
‘‘అదేముందిరా భక్తా.. ఇయ్యాల కాపోతే.. మరో వారానికైనా సర్దుకుంటాది. కానీ మాం...ఛి ఉపద్రవాలొస్తేనే జెనం మనల్ని బాగా గుర్తు పెట్టుకునేది..’’
‘‘మరింకేటున్నాది సామీ...’’
‘‘మన యువరాజు రాహుల్ బాబున్నాడా..’’
‘‘మరే ఎక్కడ ఎలక్షను పెడితే.. అక్కడ తను కాలెట్టి...’’
‘‘కాలు కూతలు కారు కూతలు పాత సంగతులు భక్తా.. రాహుల్ బాబు తనలో అంతర్గతంగా ఉన్న భగవత్ప్రసాదితమైన శక్తి ఎక్కడ ఉన్నదో ఇప్పటికి గ్రహింపుకు వచ్చినట్లున్నది’’
‘‘చిత్తం సామీ.. అనగా.. తమ మనోగతం నాకు ఎరిక పడట్లేదు’’
‘‘దేవుడిచ్చిన శక్తి తన కాలులో కాదు, నాలుకలో ఉన్నదని.. రాహుల్ బాబు గ్రహించారు గమనించితివా’’
‘‘అనగా..‘‘
‘‘నేను మాటాడితే భూకంపం పుట్టేస్తాదని సెలవిచ్చినారా లేదా...’’
‘‘అవును సామీ.. యాదికొస్తండాది. పార్లమెంటు గూడా కూలిపోతందేమోనని యెంకయ్య యెటకారాలు గూడా యాదికొస్తండాయి’’
‘‘మాట మంత్రం లాంటిదని, శక్తి ఉండేటిదని గుర్తించిన తొలినాయకుడు రాహుల్ బాబే భక్తా... అందుకే మాటల్తో భూకంపం పుట్టిస్తానంటున్నారు మరి..’’
‘‘మరి మనమేటి సెయ్యాలి సామీ..’’
‘‘సెయ్యటానికేటుంటాదిరా.. పరమాత్ముడికి దండం పెట్టుకోని.. రాహుల్ బాబు మన ఊళ్లో కాలెట్టకుండా, మన బోటోళ్ల మాటెత్తకుండా... రోజులిట్టా గడిసిపొయ్యేలా సూడు సామీ.. అంటూ మొక్కుకోడమే...’’
‘‘ఫలితముంటాదా సామీ...’’
‘‘మౌనం మీదే ఆయన మనసు పడేలా.. పరమాత్మ అనుగ్రహిస్తాడు రా’’
‘‘ధన్యోస్మి సామీ’’
==