సైకిల్ దుమ్ము దులిపేయండి... ఆదేశాలొచ్చేశాయ్
ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని గొంతు చించుకుని ఏపీ బీజేపీ నేతలు చెబుతున్నా ఎవరూ వారిని కనీసం పట్టిం చుకోవడం లేదు. నిధులు ఇచ్చామని లెక్కలతో సహా వివరిస్తున్నా..వాటిని చిత్తు కాగితాల్లా చూస్తున్నారు. అందరిలోనూ ఒకటే ఫీలింగ్.. అప్పుడు కాంగ్రెస్.. ఇప్పుడు బీజేపీ ఏపీని మోసం చేశాయి అనేది బలంగా నాటుకు పోయింది. తమ పార్టీపై ఇంత వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణం సీఎం చంద్రబాబు అని బీజేపీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. అంతేగాక ఇన్నాళ్లూ తమతో ఉండి లబ్ధి పొంది.. చివరకు తమనే ముద్దాయిలా మార్చేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలను ప్రజా క్షేత్రంలోనే ఎండగట్టాలని బీజేపీ అధిష్టానం సిద్ధమైంది. బాబుపై ఎదురుదాడి చేయాలని పార్టీ శ్రేణులకు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా దిశానిర్దేశం చేయడం ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రజాప్రయోజనాల కోసమే పొత్తు అంటూ....
రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదని, ఇన్నాళ్లూ రాష్ట్ర ప్రయోజనాలకోసమే పొత్తులో కొనసాగామని చంద్ర బాబు చెబుతున్నారు. ఇక ఉపేక్షించేది లేదంటూ బీజేపీ తీరును ఆయన ఎండగడుతున్నారు. ఇదే సమయంలో అటు వైసీపీతో కలిసిపోయిందని, పవన్‌తో కుమ్మకు అయిందంటూ ప్రచారం కూడా చేస్తున్నారు. హోదా కాక ప్యాకేజీ ఇస్తా మంటే ఒప్పుకుని సన్మానాలు చేసి, అభినందన తీర్మానాలు పెట్టి.. ఇన్ని చేసిన చంద్రబాబు.. చివరకు బీజేపీని బోనులో నిలబెట్టేశారని బీజేపీ నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. బీజేపీ అధిష్టానం కూడా ఇదే అభిప్రాయంలో ఉంది. ఈ నేపథ్యంలో ఎన్డీయే ప్రభుత్వంపై టీడీపీ చేస్తున్న విష ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలని రాష్ట్ర బీజేపీ నేతలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దిశానిర్దేశం చేశారు.
దూకుడుగా వ్యవహరించాలని....
ఎన్డీయే నుంచి టీడీపీ వైదొలగడం, కేంద్రంపై అవిశ్వాసం తీర్మానం లాంటి తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన.. ఏపీ రాష్ట్ర బీజేపీ కోర్‌కమిటీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కేంద్రంపై టీడీపీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడంలో ఎక్కడా తగ్గొద్దని, విమర్శలకు ప్రతివిమర్శలు చేయాలని, దూకుడుగా వ్యవహరించాలని అమిత్ షా ఆదేశించారు. ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్న సీఎం చంద్రబాబు.. ఇప్పుడు ఎలా మాటమార్చి కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారో ప్రజలకు సమగ్రంగా వివరించాలని ఆదేశించారు. వాళ్లు(టీడీపీ) ఇప్పుడు మన మిత్రపక్షం కాదు, ప్రతిపక్షం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు బీజేపీపై దుష్ప్రచారం చేస్తోందని.. వాస్తవాలు ప్రజలకు వివరించాలన్నారు.
అవినీతి అక్రమాలను కూడా....
చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఏపీకి నిధులు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నప్పటికీ సెంటిమెంట్ పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్న తీరును ఎండగడుతూ ఒక రాజకీయ తీర్మానాన్ని పార్టీ పరంగా ప్రకటించాలన్నారు. వారంలోగా రాష్ట్ర కమిటీ సమావేశమై పార్టీ వాదనను ప్రజల్లో తీసుకెళ్లేందుకు అవసరమైన కార్యచరణను సిద్ధం చేసుకోవాలని అమిత్ షా సూచించారు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టడం ద్వారా టీడీపీ తాను తీసుకున్న గొయ్యిలో తానే పడుతుందని చెప్పినట్లు సమాచారం. ఇన్నాళ్లూ బీజేపీపై విషప్రచారం చేసిన టీడీపీ ఇక నుంచి తాము లెవనెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉండాలని రాంమాధవ్ లాంటి వాళ్లు కూడా ఫైర్ అవుతున్నారు. ఏదేమైనా ఏపీలో బీజేపీ వర్సెస్ టీడీపీ గేమ్ ఓ రేంజ్లో మొదలైంది.